Begin typing your search above and press return to search.

ఒంగోలులో ఎంపీ వారసుడికి టికెట్ ఇస్తున్నారా...?

ఒంగోలు వైసీపీ ఎంపీ టికెట్ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి

By:  Tupaki Desk   |   15 Oct 2023 6:58 PM GMT
ఒంగోలులో ఎంపీ వారసుడికి టికెట్ ఇస్తున్నారా...?
X

ఒంగోలు వైసీపీ ఎంపీ టికెట్ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి కన్ ఫర్మ్ అయిందా అంటే ఎంపీ మాటలను బట్టి చూస్తే అదే నిజం అనిపిస్తోంది అంటున్నారు. మాగుంటని నెల్లూరు ఎంపీగా పోటీ చేయిస్తారు అని ప్రచారం ఇప్పటిదాకా జరిగింది.

ఇటీవల నెల్లూరులో జరిగిన వైసీపీ సమావేశంలో నెల్లూరు ఎంపీగా వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పోటీ చేస్తారని ప్రచారంలోకి వచ్చింది. దాంతో మాగుంట ఒంగోలు నుంచే పోటీ చేస్తారు అని అంటున్నారు. ఇపుడు శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు రాఘవరెడ్డి వచ్చే ఎన్నికలలో పోటీకి దిగుతారు అని చెప్పి సంచలన ప్రకటన చేశారు.

ఆదివారం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి జన్మ దిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివారెడ్డి మాట్లాడుతూ ఒంగోలు జిల్లా ప్రజలు అంతా మాగుంటకు అండగా ఉండాలని పిలుపు ఇచ్చారు. కష్టాలలో సైతం మౌనంగా ఉంటూ తన పని తాను చేసుకునే నైజం మాగుంటది అని ఆయన చెప్పుకొచ్చారు.

వచ్చే ఎన్నికల్లో మాగుంట బరిలో ఉంటారో లేక ఆయన కుమారుడు ఉంటారో వారి ఇష్టమని బాలినేని చెప్పడం విశేషం. అయితే 2019లో వచ్చిన మెజారిటీ ఏ విధంగానూ తగ్గకూడదని ఆయన పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాగుంట కుటుంబాన్ని ఆయన పొగడడం గమనార్హం. రాజకీయాల్లో సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ప్రజలకు సేవ చేస్తున్న కుటుంబం మాగుంటది అని అన్నారు.

ఎంపీ మాగుంట తన కుటుంబం రెండేళ్ళుగా ఇబ్బందులు పడుతోందని చెప్పడం విశేషం. అందుకే తాను రెండేళ్ళుగా పుట్టిన రోజులు జరుపుకోలెదని అన్నారు. గత డెబ్బై ఏళ్ళుగా తమ కుటుంబం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎపుడూ పడలేదని ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తన కుమారుడు రాఘవరెడ్డి అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు.

కష్టకాలంలో తన కుటుంబానికి జిల్లా ప్రజలు అండగా నిలబడ్డారని అలాగే పార్టీ నాయకులు కూడా వెన్నుదన్నుగా ఉన్నారని మాగుంట అంటూ ధన్యవాదాలు తెలిపారు. ఇక చివరిగా ఆయన సంచలన ప్రకటన చేశారు. ఈసారి ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డి ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేస్తారని స్పష్టం చేశారు. తమ కుటుంబాన్ని ప్రజలు అంతా దీవించాలని మాగుంట కోరారు. ఈ నేపధ్యం చూసినపుడు ఒంగోలు నుంచి ఎంపీ వారసుడే అభ్యర్ధి అని అంటున్నారు. మరి వైసీపీ హై కమాండ్ దీని మీద తుది ప్రకటన చేయాల్సి ఉంది అంటున్నారు.