మురికివాడల దేవుడు గోపీనాథ్.. ఈ విషయం తెలుసా?
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నాయకుడు మాగంటి గోపీనాథ్ మృతి చెందారు. అనారోగ్య కారణాలతో ఆయన తుది శ్వాస విడిచారు.
By: Tupaki Desk | 8 Jun 2025 4:06 PM ISTజూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నాయకుడు మాగంటి గోపీనాథ్ మృతి చెందారు. అనారోగ్య కారణాలతో ఆయన తుది శ్వాస విడిచారు. పార్టీలకు అతీతంగా అందరూ మాగంటికి నివాళులర్పిస్తున్నారు. సరే.. అసలు మాగంటి వరుస విజయాలకు, ప్రజానేతగా ఆయన పొందిన గుర్తింపునకు వెనుక ఉన్న రీజన్లు చాలా మందికి తెలియవు. ఉన్నత స్థాయి కుటుంబంలో జన్మించిన మాగంటి.. సినీ నిర్మాతగా అందరికీ సుపరిచితులు. పైగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్త కావడంతో ఇండస్ట్రీలోనూ అందరికీ తల్లోనాలుకగా ఉండేవారు.
ఇవి.. పైకి కనిపించే విషయాలు. కానీ, మాగంటి రాజకీయ ప్రస్థానం చూస్తే.. మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. 2014లో తొలిసారి ఆయన టీడీపీ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన బీఆర్ ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఈ మధ్య కాలం లో ఆయన మురికివాడల ప్రజల కోసం అనేక చర్యలు చేపట్టారు. ఇదే ఆయనకు అపరిమిత ప్రజాభిమా నాన్ని చూరగొనేలా చేసింది.
ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని కృష్ణానగర్, కమాన్, నందినగర్ వంటివి కీలక ప్రాంతాలు. ఇక్కడ ఎక్కువగా మురికివాడల ప్రజలు.. రోజువారీ కష్టం చేసుకుని జీవించే కుటుంబాలు ఉన్నాయి. 2014లో ఈ విషయాన్నే గోపీనాథ్ ఎన్నికల ప్రచారంలోకి తీసుకువచ్చారు. తనను గెలిపిస్తే.. మురికి వాడలను బాగు చేయిస్తానని.. ఇక్కడ శాశ్వతంగా ఉండేలా వారికి అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది.
అనుకున్నట్టుగానే.. మాగంటి ప్రయత్నం చేశారు. ఒకప్పుడు.. ఈ ప్రాంతాల్లో ఉన్న వారిని వేరే చోటకు తరలించేందుకు మునిసిపల్ కార్పొరేషన్ ప్రయత్నం చేసింది. కానీ, దీనిని సమర్థవంతంగా అడ్డుకున్నా రు. మురికి వాడల్లో అందమైన రహదారులు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు స్థిరనివాసం ఏర్పాటు చేసుకునేలా లోన్లు ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రయత్నం కారణంగానే.. జూబ్లీహిల్స్ ప్రాంతంలో పేదలకు నివసించే భాగ్యం కలిగింది. లేకపోతే.. ఉన్నతస్థాయికి మాత్రమే పరిమితం అయ్యేదన్న చర్చ అప్పట్లో రాజకీయ వర్గాల్లో వినిపించింది.
మాగంటి వరుస విజయాల వెనుక పెద్దలకంటే.. పేదలే ఎక్కువగా ఉన్నారు. అంతేకాదు.. పేదల ఇళ్లలో జరిగే మంచి చెడులకు కూడా.. ఆయన ఆర్థిక సాయం చేసేవారు. మూడో కంటికి తెలియకుండా.. ప్రచార ఆర్భాటాలకు అవకాశం లేకుండా.. పేదలను అక్కున చేర్చుకున్నారు. నిజానికి జూబ్లీహిల్స్ అంటే.. సంపన్న వర్గాలే ఎక్కువగా ఉంటాయని అనుకుంటారు. కానీ, 2011 జనాభా లెక్కల ప్రకారం.. పేదలు, మధ్యతరగతి వర్గాలే ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారంటే.. వారిని అక్కడ నుంచి తరలించకుండా ప్రభుత్వాన్ని ఒప్పించడంలో మాగంటి చేసిన కృషి కనిపిస్తుంది. అందుకే.. ఆయన మురికివాడల దేవుడయ్యారని అంటారు పరిశీలకులు.