బీఆర్ఎస్ జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు తీవ్ర అస్వస్థత
జూబ్లిహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
By: Tupaki Desk | 5 Jun 2025 5:47 PM ISTజూబ్లిహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి ఆయన ఆస్పత్రిలో చేరడం ఆందోళన కలిగిస్తోంది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, మాగంటి గోపీనాథ్ అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆయనను AIG ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూ లో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
మాగంటి గోపీనాథ్ అస్వస్థత విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ ముఖ్య నేతలు, మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.
నెల రోజుల క్రితం కూడా మాగంటి గోపీనాథ్ ఇదే AIG ఆస్పత్రిలో చికిత్స పొందారు. మళ్లీ అనారోగ్యం రావడంతో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఆస్పత్రి వర్గాలు ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు వెల్లడిస్తే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మాగంటి గోపీనాథ్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు.
మాగంటి గోపీనాథ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలిసారిగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై జూబ్లీహిల్స్ నుంచి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి ఆయన బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి వరుసగా విజయం సాధించారు.
