అమెరికా టూర్ కుదించుకొని హుటాహుటిన వస్తున్న కేటీఆర్
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాంగటి గోపీనాధ్ తీవ్ర అస్వస్థతకు గురై..గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్చటం తెలిసిందే.
By: Tupaki Desk | 6 Jun 2025 10:49 AM ISTజూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాంగటి గోపీనాధ్ తీవ్ర అస్వస్థతకు గురై..గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్చటం తెలిసిందే. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. కార్డియాక్ అరెస్టుకు గురైన ఆయన్ను.. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలించటం.. వెంటనే సీపీఆర్ చేసిన మీదట గుండెకు పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ప్రస్తుతం ఐసీయూలోని వెంటిలేటర్ మీద ఆయనకు వైద్యం చేస్తున్నారు. పలువురు సీనియర్ వైద్యులు ఆయనకు వైద్యసేవల్ని అందిస్తున్నట్లుగా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ స్పందించారు. మాగంటి ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారం అందుకున్నంతనే తన అమెరికా పర్యటనను కుదించుకొని హుటాహుటిగా హైదరాబాద్ కు బయలుదేరారు.
చాలామందికి తెలియని నిజం ఏమంటే.. బయటకు పెద్దగా ఫోకస్ కాదు కానీ.. కేటీఆర్ కు మాగంటి అత్యంత సన్నిహితులు. హైదరాబాద్ మహానగరంలో బీఆర్ఎస్ నిర్వహించే పలు కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్ల బాధ్యతల్ని మాగంటికే అప్పగిస్తారు. ఏదైనా కార్యక్రమ నిర్వాహణ బాధ్యతను మాగంటికి అప్పజెబితే.. గుండెల మీద చేయి వేసుకొని ఉండొచ్చన్న ధీమా ఉంటుంది. నిజానికి ఈ ఇద్దరు నేతల మధ్య వయసులో తేడా ఎక్కువే అయినప్పటికీ.. కేటీఆర్ కోర్ టీంలో మాగంటి కీలక సభ్యుడు. కాకుంటే.. తనకు సంబంధించిన ఏ అంశంలోనూ ఎక్కువగా ఫోకస్ కాకుండా తెర వెనుక ఉండే అలవాటు మాగంటిలో ఎక్కువ.
అంతేకాదు.. మాగంటి కుమారుడు.. కేటీఆర్ కుమారుడు ఇద్దరు అత్యంత సన్నిహిత స్నేహితులు అన్న విషయం కూడా చాలా తక్కువ మందికి తెలుసు. పలుమార్లు మాగంటి ఇంట్లోనే కేటీఆర్ కొడుకు ఉంటారని ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారుచెబుతుంటారు. ఇలా రెండు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాల అంశం చాలామంది బీఆర్ఎస్ నేతలకు తెలీదని చెబుతారు. ఈ నేపథ్యంలో మాగంటి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందన్న సమాచారం అందుకున్నంతనే తన అమెరికా పర్యటనను కుదించుకొని మరీ హైదరాబాద్ కు కేటీఆర్ వచ్చేస్తున్నారని చెప్పాలి.
