Begin typing your search above and press return to search.

మధురై రైల్వే స్టేషన్ లో దారుణం.. సిలిండర్ పేలి 9మంది మృతి

ప్రమాదం జరిగిన ప్రదేశంలో 63 మంది ఉన్నట్లుగా చెబుతున్నారు. గాయపడిన పలువురిని సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు

By:  Tupaki Desk   |   26 Aug 2023 11:38 AM IST
మధురై రైల్వే స్టేషన్ లో దారుణం.. సిలిండర్ పేలి 9మంది మృతి
X

ఘోర ప్రమాదానికి వేదికగా మారింది మధురై రైల్వే స్టేషన్. రైల్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఉదంతంలో.. తొమ్మిది మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. షాకింగ్ గా మారిన ఈ ఉదంతానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం ఒకదానికి మరొకటి విరుద్ధంగా ఉంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం రైల్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఉదంతంలో తొమ్మిది మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుంచి తమిళనాడులోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన రామేశ్వరానికి ప్రత్యేక రైలు వెళుతోంది.

అయితే.. ఈ ఘోర ప్రమాదం ప్రత్యేక రైల్లోని ప్యాంట్రీ కార్ లో చోటు చేసుకుందని కొందరు చెబుతుంటే.. అదేమీ కాదని.. రైల్లో ప్రయాణిస్తున్న కొందరు నిబంధనలకు విరుద్దంగా సిలిండర్ తీసుకొచ్చారని.. టీ కాచే ప్రయత్నంలో సిలిండర్ పేలినట్లుగా చెబుతున్నారు.ఈ ప్రమాదంలో రైలు బోగీ పూర్తిగా దగ్థమైంది. మంటల్లో చిక్కుకున్న పలువురు ప్రమాదం జరిగిన చోటునే మృత్యువాత పడ్డారు.

ప్రమాదం జరిగిన ప్రదేశంలో 63 మంది ఉన్నట్లుగా చెబుతున్నారు. గాయపడిన పలువురిని సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. పెద్ద శబ్దంతో సిలిండర్ పేలినంతనే మంటలు చెలరేగటంతో.. పలువురు ప్రయాణికులు హుటాహుటిన ట్రైన్ లోని నుంచి కిందకు దిగేసినట్లుగా చెబుతున్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన నేపథ్యంలో ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘోర ఘటనపై రైల్వే అధికారులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.