Begin typing your search above and press return to search.

మాజీ మంత్రికి మాడుగుల టీడీపీ టికెట్ ?

మొత్తానికి బండారు కనుక అంగీకరిస్తే మాడుగుల టికెట్ దక్కుతుంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది.

By:  Tupaki Desk   |   10 April 2024 10:16 AM GMT
మాజీ మంత్రికి మాడుగుల టీడీపీ టికెట్ ?
X

తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఉంటూ అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేసిన సీనియర్ మోస్ట్ లీడర్ బండారు సత్యనారాయణమూర్తికి ఈసారి పెందుర్తి టికెట్ దక్కలేదు. ఆయనకు కాకుండా పొత్తులో భాగంగా ఆ టికెట్ ని జనసేనకు టీడీపీ కేటాయించింది.

దాంతో బండారు తీవ్ర మనస్తాపానికి చెందారు. ఆయన ఆసుపత్రి పాలు కూడా అయ్యారు. ఇక ఆయన ఇటీవల తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి తన బాధను అంతా పంచుకున్నారు. తాను పార్టీకి ఎంతో సేవ చేస్తే టికెట్ దక్కలేదని ఆయన కలత చెందారు.

దాంతో పాటు ఇక తనకు రాజకీయాలు అవసరం లేదని తాను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. ఆయన వద్దకు టీడీపీ సీనియర్ నేతలు ఎంతో మంది వెళ్లి బుజ్జగించి నప్పటికీ బండారు తన పట్టు వీడడం లేదు. దాంతో ఆయన అలక వల్ల అటు పెందుర్తి సీటులో గెలుపు డౌట్ లో పడింది. అలాగే అనకాపల్లి ఎంపీ సీటు కూడా ఇబ్బందుల్లో పడింది. పెందుర్తి నుంచి వచ్చే ఓట్లు అనకాపల్లి ఎంపీ అభ్యర్ధి విజయాన్ని డిసైడ్ చేస్తాయి.

దీంతో ఇటీవల ఆయన వద్దకు అనకాపల్లిలో టీడీపీ కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ వెళ్లారు. ఆయంతో చర్చించారు. ఆ మీదట ఆయనకు ఎక్కడో ఒక చోట సీటు అకామిడేట్ చేస్తారు అని వార్తలు వచ్చాయి. ఇక బండారు వియ్యంకుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు కూడా తన వంతుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.

మరో వైపు చూస్తే బండారుకు మాడుగుల అసెంబ్లీ టికెట్ ని కేటాయిస్తారు అని అంటున్నారు. మాడుగుల అసెంబ్లీ టికెట్ కి ఇప్పటికే ఎన్నారై పైలా ప్రసాదరావుకు కేటాయించారు. ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఆయన ఎన్నారై అని ఆయన అందుబాటులో ఉండరని వైసీపీ ప్రచారం చేస్తోంది. దాంతో అది నెగిటివ్ గా మారే ప్రమాదం ఉందని అంటున్నారు.

దాంతో పాటు ఆయనకు టికెట్ ఇవ్వడం వల్ల మాడుగులకు గత అయిదేళ్లుగా ఇంచార్జిగా ఉంటున్న పీవీజీ కుమార్ తీవ్ర నిరాశకు గురి అయ్య్యారు. తనకే టికెట్ అని ఆయన ఆశలు పెట్టుకున్నారు. అలాగే 2009లో టీడీపీ నుంచి గెలిచి 2014, 2019లలో రెండు సార్లూ అదే పార్టీ టికెట్ మీద పోటీ చేసి ఓటమిని చూసిన బలమైన మరో నేతగా గవిరెడ్డి రామానాయుడు ఉన్నారు.

ఆయన కూడా తనకే టికెట్ అని నమ్ముతున్నారు. ఆయనకు బలమైన అనుచర గణం ఉంది. ఈ ఇద్దరిలో ఒకరికి టికెట్ ఇచ్చినా పనిచేస్తామని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. ఇపుడు పెందుర్తి నుంచి మాజీ మంత్రి బండారుని దిగుమతి చేస్తే పార్టీ శ్రేణులు ఎంతవరకూ సహకరిస్తాయన్నది కూడా చర్చగా ఉంది.

అంతే కాదు బండారుకు మాడుగుల నుంచి పోటీ చేయలన్న ఆసక్తి ఎంతమేరకు ఉంది అన్నది కూడా చర్చగా ఉంది. బండారు అయితే పెందుర్తి టికెట్ నే అడుగుతున్నారు అని అంటున్నారు. ఎందుకంటే ఆయన తన రాజకీయ భవిష్యత్తు కోసం కాదు కుమారుడు అప్పలనాయుడు కోసం అని అంటున్నారు. ఇప్పుడు ఈ సీటు జనసేనకు ఇస్తే రేపటి రోజున ఆ పార్టీకే మళ్ళీ తీసుకుంటుందని ఆ విధంగా సొంత నియోజకవర్గాన్ని కోల్పోయినట్లు అవుతుందని కూడా బండారు వర్గంలో చర్చ నడుస్తోంది.

అయితే ఇపుడున్న పరిస్థితులల్లో పొత్తుల నేపధ్యంలో ఏదో ఒక చోట పోటీ చేసి రాజకీయ ఉనికి నిలబెట్టుకోవడం ముఖ్యమని చెబుతున్న వారూ ఉన్నారు. మొత్తానికి బండారు కనుక అంగీకరిస్తే మాడుగుల టికెట్ దక్కుతుంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. బండారు మాడుగుల నుంచి పోటీ చేయకుండా తన కుమారుడికి ఆ సీటు అడుగుతారు అని ప్రచారం లో ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో. అటూ ఇటూ అంతా ఓకే చేస్తే మాడుగుల సీటు నుంచి బండారు ఫ్యామిలీ పోటీ చేయడం ఖాయం అంటున్నారు.