మహిళను చేయిపట్టుకొని లాగితే.. మద్రాస్ హై కోర్టు సంచలన తీర్పు..
తమిళనాడులోని చోళవందనైకి చెందిన మురుగేశన్ పశువులు కాపరి అయిన ఒక దివ్యాంగురాలి 2015లో చేయిపట్టుకొని లాగినట్లు కేసు నమోదైంది.
By: Tupaki Desk | 13 Aug 2025 12:07 PM ISTచిన్నారుల నుంచి వృద్ధుల వరకు మహిళలపైనే ఎక్కువగా దాడులు జరగడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి ఘటనలు రోజుకోటి పత్రికల్లో, లేదంటే టీవీల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకువస్తూనే ఉన్నాయి. మన న్యాయ సంహితలో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ చట్టాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే ఇవన్నీ ఊరికే రాలేదు. పూర్వ కాలం నుంచి మహిళలు ఎదుర్కొన్న ఇబ్బందులు, బాధలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను తయారు చేశారు. ఈ చట్టాలు ఇప్పటికీ వారిని రక్షించడం లేదని మహిళా సంఘాల నేతలు వాదిస్తూనే ఉన్నారు.
స్త్రీల గురించి కఠిన చట్టాలు..
స్త్రీల గురించి వచ్చిన చట్టాలు కఠినతరంగా ఉంటాయి. కొన్ని చట్టాల గురించి తెలుసుకుంటే పురుషులకైనా ఆందోళన కలుగుతుంది. వారు పడిన బాధలు, దాడులు, చీవాట్లు వీటన్నింటికి దృష్టిలో ఉంచుకొని చట్టాలు రూపొందించబడ్డాయి. అయితే ఈ చట్టాలు ఇలానే అమలవుతాయని లేదు. ఎందుకంటే.. ఆయా కేసును బట్టి అందులో జరిగిన నేరాన్ని బట్టి న్యాయమూర్తులు తీర్పునిస్తారు. మహిళ వంక చెడు దృష్టితో చూసినా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరికలు చేసిన న్యాయమూర్తులు లేకపోలేదు. ఇక లైంగికదాడులు, లైంగిక ప్రేరణలపై చాలా తీర్పులు వచ్చాయి. ఇక్కడ ఒక న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుతో న్యాయనిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎలాంటి దురుద్దేశం లేకుండా ఒక మహిళను చేయి పట్టుకొని లాగడం నేరం కాదని సదరు న్యాయమూర్తి కేసును కొట్టేశారు. ఈ కేసు గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం.
మద్రాస్ హై కోర్టు సంచలన తీర్పు..
మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై చర్చ కూడా మొదలైంది. తమిళనాడులోని చోళవందనైకి చెందిన మురుగేశన్ పశువులు కాపరి అయిన ఒక దివ్యాంగురాలి 2015లో చేయిపట్టుకొని లాగినట్లు కేసు నమోదైంది. ఈ కేసును ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద ఆమె తల్లి ఫిర్యాదుతో నమోదు చేశారు. ఈ కేసును విచారణకు తీసుకున్న ప్రత్యేక కోర్టు నిందితుడైన మురుగేశన్ కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. రద్దు చేయాలని ఆయన మధురై ధర్మాసనంకు అప్పీల్ చేసుకున్నాడు. కేసును విచారించిన న్యాయమూర్తి మంజుల ఎలాంటి దురుద్దేశ్యం లేకుండా చేయిపట్టుకొని లాగితే నేరం కాదని వ్యాఖ్యానించింది. కేవలం బాధపెట్టే చర్య మాత్రమేనని పేర్కొంది. బాధితురాలిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతోనే లాగినట్లు ఎక్కడా ఆధారాలు లేవన్నారు. మురుగేశన్ కు దిగువ కోర్టు ఇచ్చిన శిక్షను రద్దు చేసి కేసు కొట్టివేశారు.
