Begin typing your search above and press return to search.

భార్య కాంగ్రెస్ ఎమ్మెల్యే.. భర్త బీఎస్పీ ఎంపీ అభ్యర్థి.. కట్ చేస్తే?

రాజకీయం మహా చెడ్డది. ఎంతంటే.. భార్యభర్తల మధ్య బంధాన్ని సైతం బీటలు వారేలా చేస్తుంది. తండ్రిపై కొడుకు కత్తులు నూరేలా చేస్తుంది

By:  Tupaki Desk   |   7 April 2024 4:50 AM GMT
భార్య కాంగ్రెస్ ఎమ్మెల్యే.. భర్త బీఎస్పీ ఎంపీ అభ్యర్థి.. కట్ చేస్తే?
X

రాజకీయం మహా చెడ్డది. ఎంతంటే.. భార్యభర్తల మధ్య బంధాన్ని సైతం బీటలు వారేలా చేస్తుంది. తండ్రిపై కొడుకు కత్తులు నూరేలా చేస్తుంది. సొంత సోదరుడికి షాకిచ్చేందుకు వెనుకాడని విధంగా మారుస్తుంది. మొత్తంగా బంధం ఏదైనా రాజకీయం ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం బూడిదే.తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వేళ ఇదే తరహా ఉదంతం ఒకటి మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. భార్య కాంగ్రెస్ ఎమ్మెల్యే కాగా.. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో భర్తకు బీఎస్పీ ఎంపీగా టికెట్ ఇచ్చింది. దీంతో ఎన్నికల బరిలో ఉన్న సదరు భర్త.. పార్టీ పంచాయితీతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు. ఇంతకూ ఆ భార్యభర్తలు ఎవరు? అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..

మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ లోక్ సభ స్థానానికి బీఎస్పీ అభ్యర్థిగా కంకర్ ముంజరే పోటీ చేస్తున్నారు. ఆయన మాజీ ఎమ్మెల్యేగా.. ఎంపీగా పని చేసిన అనుభవం ఉంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా పోటీ చేసి.. ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె (అనుభ ముంజరే) ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల వేళ ఒకే ఇంట్లో భార్యభర్తలు వేర్వేరు పార్టీలో ఉండటం సరికాదన్న ఉద్దేశంతో సదరు భర్త కం ఎంపీ అభ్యర్థి తాజాగా ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ఒకే ఇంట్లో తామిద్దరం ఉండకూడదని భర్త డిసైడ్ కావటం ఆసక్తికరంగా మారింది.

ఎందుకిలా? అంటే.. ఓటర్లు తామిద్దరం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్న భావనకు గురి కాకూడదనే ఉద్దేశంతోనే తాను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి విడిగా ఉంటున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటికి దూరంగా ఒక గుడిసెలో ఉంటున్నారు. ఈ రాష్ట్రంలో పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యాక ఇంటికి వెళతానని ఆయన చెబుతున్నారు. అయితే.. భర్త నిర్ణయంపై భార్య మాత్రం విభేదిస్తున్నారు. గతంలో తన భర్త గోండ్వానా గణతంత్ర పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నప్పుడు.. తాను బాలాఘాట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచానని.. అప్పుడు కలిసి ఉన్నప్పుడు ఇప్పుడెందుకు విడిగా ఉండాలన్నది ఆమె ప్రశ్న.

గడిచిన 33 ఏళ్లుగా తాము సంసారం చేస్తున్నామని.. ఎంతో సంతోషంగా జీవించినట్లుగా చెబుతున్న ఆమె.. తాజా ఎన్నికల వేళ తన భర్త తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంటి నుంచి దూరంగా ఉండాలన్న తన భర్త నిర్ణయం తనకు నచ్చలేదన్న ఆమె.. తాజా ఎన్నికల్లో తన పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థికే మద్దతు ఇస్తానని.. అతడి గెలుపు కోసమే తాను పని చేస్తానని చెప్పిన ఆమె.. ఎన్నికల ప్రచారంలో భర్త గురించి ఎక్కడా ప్రస్తావించనంటూ స్పష్టం చేస్తున్నారు. చూశారా.. మాయదారి రాజకీయం 33 ఏళ్లుగా భార్యభర్తలుగా ఉన్న వారిని సైతం ఎంతలా దూరం చేసిందో? అంటూ పలువురు మాట్లాడుకోవటం కనిపిస్తోంది.