వైరల్ వీడియో - 'నా సింధూరం దేశం కోసం’..పెళ్లైన రెండ్రోజులకే భర్తను సరిహద్దుకు పంపిన వధువు
ఆ వీడియోలో యామిని ఏ మాత్రం దుఃఖం లేకుండా, గర్వంగా నిలబడి కనిపించింది. ఆమె కళ్లలో భర్తను విడిచి వెళ్తున్న బాధ ఉన్నప్పటికీ, దేశం పట్ల ఆమెకున్న ప్రేమ కనిపించాయి.
By: Tupaki Desk | 11 May 2025 12:42 PM ISTఒక హృదయానికి హత్తుకునే ఓ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పెళ్లైన రెండో రోజే భర్త దేశసేవ కోసం సరిహద్దుకు వెళ్లాల్సి రావడంతో, ఆ నవ వధువు చేసిన ఒక పని దేశవ్యాప్తంగా అందరినీ కదిలించింది. తన సింధూరాన్నే దేశ రక్షణకు పంపుతున్నానంటూ ఆమె చేసిన భావోద్వేగపూరిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఆ కొత్త పెళ్లికూతురు ఏం చేసిందో, ఆమె మాటల్లో ఎంతటి దేశభక్తి నిండి ఉందో తెలుసుకుందాం.
మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్ అనే ఆర్మీ జవాన్‌కు యామినితో మే 5న సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. ఇప్పుడిప్పుడే వారి కొత్త జీవితం ఆరంభమవుతున్న తరుణంలో, ఊహించని పిలుపు వచ్చింది. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో.. సైన్యం తన సిబ్బందిని వెంటనే విధుల్లోకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో మనోజ్‌కు పెళ్లైన కేవలం మూడు రోజులకే తన భార్యను విడిచి వెళ్లక తప్పలేదు.
భార్యాభర్తలు ఇద్దరూ పచోరా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. మనోజ్ రైలు ఎక్కుతుండగా, యామిని కళ్లలో దుఃఖం నిండినా కూడా గట్టిగా నిలబడింది. ఆమె తన భర్తకు వీడ్కోలు చెబుతూ దేశ ప్రజలందరి హృదయాలను తాకే ఒక మాట అందింది: "నేను నా సింధూరాన్ని దేశాన్ని రక్షించడానికి పంపుతున్నాను." ఆమె పలికిన ఈ పవర్ ఫుల్ పదాలు, ఆమె చూపించిన అచంచలమైన ధైర్యం క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆ వీడియోలో యామిని ఏ మాత్రం దుఃఖం లేకుండా, గర్వంగా నిలబడి కనిపించింది. ఆమె కళ్లలో భర్తను విడిచి వెళ్తున్న బాధ ఉన్నప్పటికీ, దేశం పట్ల ఆమెకున్న ప్రేమ కనిపించాయి. ఆన్‌లైన్‌లో ఈ వీడియో చూసిన వారంతా యామిని ధైర్యాన్ని కొనియాడారు. ఆమె చూపించిన దేశభక్తికి సెల్యూట్ చేశారు.
మనోజ్ వంటి సైనికులు దేశం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధంగా ఉంటారు. వారి వెనుక వారి కుటుంబాలు కూడా ఎన్నో త్యాగాలు చేస్తుంటాయి. యామిని వంటి భార్యలు తమ భర్తలను దేశసేవ కోసం పంపుతూ, వారి క్షేమం కోసం నిరంతరం ప్రార్థిస్తూ ఉంటారు. కాబట్టి, మనోజ్ వంటి సైనికులను గౌరవించడంతో పాటు, యామిని వంటి వారి కుటుంబాలకు సామాజికంగా అన్ని విధాలా మద్దతు ఇవ్వడం మనందరి బాధ్యత.
