ఐఏఎస్ అధికారుల ‘రియల్’ దందా? రూ.7.58 కోట్ల పెట్టుబడి.. రూ.65 కోట్ల లాభం!!
మధ్యప్రదేశ్ తోపాటు తెలంగాణ, హరియాణా, మహరాష్ట్రకు చెందిన అఖిల భారత సర్వీసు అధికారులు ఒక గ్రూపుగా ఏర్పడి రూ.5 కోట్ల పెట్టుబడి పెట్టి 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.
By: Tupaki Desk | 12 May 2026 9:00 PM ISTఎన్నాళ్లు ఉద్యోగం చేస్తే కోట్లు సంపాదిస్తామని అనుకున్నారో ఏమో.. మధ్యప్రదేశ్ కు చెందిన కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఒక సిండికేట్ గా ఏర్పడి భారీ రియల్ ఎస్టేట్ దందాకు తెరతీశారని ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. మధ్యప్రదేశ్ తోపాటు తెలంగాణ, హరియాణా, మహరాష్ట్రకు చెందిన అఖిల భారత సర్వీసు అధికారులు ఒక గ్రూపుగా ఏర్పడి రూ.5 కోట్ల పెట్టుబడి పెట్టి 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2022లో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అఖిల భారత సర్వీసు అధికారులు తమ జీతం డబ్బు నుంచి ఇలా భూమి కొనుగోలు చేస్తే తప్పేంటని ఎవరైనా అనుకుంటే పొరపాటే.. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందని మధ్యప్రదేశ్ మీడియా వాదిస్తోంది.
మధ్యప్రదేశ్ తోపాటు తెలంగాణ, హరియాణా, మహారాష్ట్రల్లో పనిచేస్తున్న 41 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉమ్మడిగా భోపాల్ నగరానికి దగ్గరలోని కోలార్ ఏరియా గురాడి ఘాట్ అనే గ్రామంలో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారని చెబుతున్నారు. సింగిల్ రిజిస్ట్రీ డాక్యుమెంట్ ద్వారా ఈ వ్యవహారం జరిగింది. 2022 ఏప్రిల్ 4న ఈ రిజిస్ట్రేషన్ జరగగా, అక్కడికి 17 నెలల తర్వాత అంటే 2023 ఆగస్టు 31న మధ్యప్రదేశ్ ప్రభుత్వం భోపాల్ పశ్చిమ బైపాస్ ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేసింది. రూ.3,200 కోట్ల విలువైన ఈ బైపాస్ రోడ్డు అలైన్ మెంటు ఐఏఎస్ అధికారులు కొనుగోలు చేసిన భూమికి అత్యంత సమీపం నుంచి వెళుతుండటమే అనేక అనుమానాలకు కారణమవుతోందని అక్కడి మీడియా కథనాలు వెలువరించింది.
ఈ భూమి కొనుగోలుకు అధికారులు రూ.7.78 కోట్లు వెచ్చించగా, ఇప్పుడు దాని ధర సుమారు రూ.65 కోట్లుగా అంచనా వేస్తున్నారు. నాలుగేళ్లలో భూమి విలువ 9 రెట్లు పెరిగిందని చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజకీయాల్లో విస్తృత చర్చనీయాంశంగా మారింది. బైపాస్ అలైన్మెంట్ కోసం ముందుగా తెలుసుకున్న అధికారులు సిండికేట్ గా ఏర్పడి వ్యవసాయ భూమిని కొన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరలు పెరిగిన తర్వాత విక్రయించొచ్చనే ఆలోచనతోనే ఈ పెట్టుబడి పెట్టారని, ఇది అధికార దుర్వినియోగం కిందకి వస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రస్తుతం ఈ వివాదం మధ్యప్రదేశ్ అధికార వర్గాలను కుదిపేస్తోంది. ఒక ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని ముందే తెలుసుకుని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇలా చేయడం కరెక్టు కాదని అంటున్నారు. ఇది ఒక విధంగా ఇన్ సైడ్ ట్రేడింగ్ కిందకి వస్తుందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు ఇలాంటి పనులు చేస్తే ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుందని నిలదీస్తున్నారు. ఇక మీడియా కథనాలతో భూమిని కొనుగోలు చేసిన ఐఏఎస్ అధికారులు ఎవరంటూ ప్రభుత్వం ఆరా తీస్తోందని చెబుతున్నారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
