Begin typing your search above and press return to search.

త‌ల్లిదండ్రుల స‌మాధులు ఉన్నాయంటూ టికెట్ కోరుతున్న కాంగ్రెస్ సీనియ‌ర్

నిజామాబాద్ జిల్లా నుంచి గతంలో ఎంపీగా ఎన్నికైన మధుయాష్కి ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ఈ ద‌ఫా బ‌రిలో దిగేందుకు టీపీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   4 Sep 2023 1:56 PM GMT
త‌ల్లిదండ్రుల స‌మాధులు ఉన్నాయంటూ టికెట్ కోరుతున్న కాంగ్రెస్ సీనియ‌ర్
X

ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌ కంటే ముందే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి తెలంగాణ ఎన్నికల సైరన్‌ మోగించారు గులాబీ దళపతి కేసీఆర్‌. ఆయనను ఎదుర్కొనేందుకు టికెట్ ఆశావాహుల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గట్టిగా మొదలుపెట్టింది. అయితే, గత ఏడాదే అనైక్యత వల్ల ప్రజల్లో ప్రభ కోల్పోయిన కాంగ్రెస్ ఈసారిలో కూడా కొంతవరకు అలాంటి అనైక్యత కనిపిస్తోంది. టికెట్ ఆశావ‌హులు, వారి ప్రత్యర్థులు చేస్తున్న వ్యాఖ్యలు, జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలని చాటి చెప్తున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ లో ఇన్నాళ్లపాటు జరిగిన సీనియర్ల రచ్చకు తోడు ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అంశం తెరమీదకి వచ్చింది. షర్మిల పార్టీ విలీన చర్చలతో మొదలైన ఈ యవ్వారంలో ఇపుడు మరో పేరు తెరపైకి వచ్చింది. హైదరాబాద్ లోని కీలక నియోజకవర్గం అయినా ఎల్బీనగర్ నుంచి పోటీ కోసం ఎదరుచూస్తున్న మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మధు య‌ష్కీ గురించి నాన్ లోకల్ చర్చ జరుగుతోంది.

నిజామాబాద్ జిల్లా నుంచి గతంలో ఎంపీగా ఎన్నికైన మధుయాష్కి ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ఈ ద‌ఫా బ‌రిలో దిగేందుకు టీపీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ‌లో ఓ చివ‌రన ఉన్న నియోజ‌క‌వ‌ర్గం నుంచి న‌గరంలోని కీల‌క‌మైన ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆయ‌న ఎంచుకోవడం సహజంగానే ఆసక్తిని రేకెత్తించింది. అయితే కాంగ్రెస్‌లోని ఆయ‌న ప్ర‌త్య‌ర్థి శ్రేణులు మాత్రం దీనిపై భగ్గుమన్నాయి. మ‌ధు యాష్కీ ఎల్బీన‌గ‌ర్ ఎంట్రీని నిరసిస్తూ కొందరు పార్టీ నేతలు ఏకంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయమైన గాంధీభవన్లో వ్యతిరేక పోస్టర్లు వేశారు. సేవ్ కాంగ్రెస్... సేవ్ ఎల్బీనగర్.. నాన్ లోక‌ల్ లీడ‌ర్ల‌కు టికెట్లు వ‌ద్దు అంటూ ఈ పోస్టర్లలో మధు యాష్కీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశారు. సహజంగానే ఈ వార్తలు మీడియాలో రావ‌డం, దీనికి మధుయాష్కి స్పందించక తప్పని ప‌రిస్థితి క‌ల్పించింది.

తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ప్రచారంపై మధుయాష్కి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నేతలు ఒక నియోజకవర్గ నుంచి మరో నియోజకవర్గంలోకి మారడం కొత్త కాద‌ని అన్నారు. తాను పారాషూట్ లీడర్‌ కాదని చెప్పారు. త‌న‌ అమ్మ నాన్న సమాధులు ఎల్బీ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉన్నాయని వెల్ల‌డించారు. తనపై కొందరు కుట్ర చేస్తున్నారని మధు యాష్కీ ఆవేదన వ్యక్తం చేశారు తమ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ కుట్రకు కారకుడు కాగా కొందరు కాంగ్రెస్ నేతలే దీనికి మద్దతు ఇవ్వడం దురదృష్టకరమని వాపోయారు.

తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి కి నివాళిగా ఎల్బీనగర్లో తాను బరిలో నిలిచి గెలిచి చూపిస్తానని పేర్కొన్నారు. బీసీలకే అధికంగా టికెట్లు కేటాయిస్తామని టీపీసీసీ ర‌థ‌సార‌థి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సైతం ఈ సందర్భంగా మధు యాష్కీ ఉటంకించారు. కాగా, పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే ఈ విధంగా ఒక నేతకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలవడం దానికి అధికార బీఆర్ఎస్ ప్రోత్సాహం ఉందని కామెంట్లను సదరు నేత వ్యక్తీకరించడం చర్చనీయాంశంగా మారింది.