Begin typing your search above and press return to search.

లేడీ ఫైర్ బ్రాండ్ దెబ్బకు కిషన్ రెడ్డికి భారీషాక్ రెఢీ?

ఇప్పుడు బీజేపీలో మాధవీలత హాట్ టాపిక్ గా మారారు. జాతీయ స్థాయి నేతలు సైతం ఆమెతో మాట్లాడేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

By:  Tupaki Desk   |   28 April 2024 12:30 PM GMT
లేడీ ఫైర్ బ్రాండ్ దెబ్బకు కిషన్ రెడ్డికి భారీషాక్ రెఢీ?
X

అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి తన మాటలతో జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారారు హైదరాబాద్ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీలత. సొంత కార్పొరేట్ ఆసుపత్రి.. వ్యాపారాలు.. సేవా కార్యక్రమాలు.. హిందూయిజం గురించి.. హిందూ ధర్మం గురించి ఆమె చెప్పే మాటలు.. వినిపించే లాజిక్కులు అందరిని ఆకర్షిస్తున్నాయి. అన్నింటికి మించి హైదరాబాద్ లోక్ సభా స్థానంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పించి మరెవరూ ఎందుకు గెలవరలేరన్న అంశంపై ఆమె ప్రస్తావించిన అంశాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

ఇప్పుడు బీజేపీలో మాధవీలత హాట్ టాపిక్ గా మారారు. జాతీయ స్థాయి నేతలు సైతం ఆమెతో మాట్లాడేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఎన్నికల్లో ఆమె ఓటమి ఖాయమైనప్పటికీ.. ఆమె రాజకీయ భవిష్యత్తు మాత్రం దివ్యంగా ఉంటుందన్న వాదన పెరిగింది. అన్నింటికి మించి.. మాధవీలత పుణ్యమా అని కిషన్ రెడ్డికి తొలి షాక్ తగులుతుందని చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ ఎదగకపోవటానికి.. బలమైన నాయకుడు రాకపోవటానికి కారణం.. కిషన్ రెడ్డి.. డాక్టర్ లక్ష్మణ్ తో పాటు మరికొందరన్న ఆరోపణ ఉంది.

బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ ఒక స్థాయికి తీసుకొచ్చారని.. కారణం ఏమైనా.. ఆయన్ను పక్కన పెట్టేయటంతో పార్టీ గ్రాఫ్ పడిపోయిందన్న వాదన తెలిసిందే. రానున్న రోజుల్లో తెలంగాణ బీజేపీకి మాధవీలత ఫేస్ గా మారతారని చెబుతున్నారు. వివిధ అంశఆల మీద ఆమెకున్న పట్టు.. హిందీ.. ఇంగ్లిష్.. తెలుగు.. ఇలా అది ఇది కాదన్నట్లుగా పలు భాషల మీద ఉన్న ప్రావీణ్యం ఆమెకు కలిసి వస్తుందంటున్నారు. హార్డ్ కోర్ హిందుత్వ అన్నట్లు కాకుండా.. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే నేర్పు.. విషయాన్ని నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా చెప్పి కన్వీన్స్ చేయటం ఆమెకున్న సానుకూలాంశాలుగా చెబుతున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో మాధవీలత ఓటమి ఖాయమని.. ఆమె గెలిస్తే మాత్రం అద్భుతమని చెబుతున్నారు. ఆమె పుణ్యమా అని.. హైదరాబాద్ పాతబస్తీలో మజ్లిస్.. ఎంబీల మధ్యనున్న శత్రుత్వం కరిగిపోవటమే కాదు.. ఓవైసీ గెలుపు కోసం ఎంబీటీ పోటీ నుంచి తప్పుకోవటం మాధవీలత నైతిక విజయంగా అభివర్ణిస్తున్నారు. అంతేకాదు.. అసద్ కు వచ్చే రెగ్యులర్ మెజార్టీ ఈసారి గణనీయంగా తగ్గుతుందని.. అది కూడా మాధవీలత పుణ్యమేనని చెబుతున్నారు. మాధవీలతలోని సానుకూలాంశాల్ని పార్టీ జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అందుకే.. సార్వత్రిక ఎన్నికల్లో మాధవీలత ఓటమితో సంబంధం లేకుండా.. మోడీ సర్కారు ఏర్పడితే ఆమెకు కేంద్ర మంత్రిగా చోటు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వాదన చిన్న.. చితకా స్థాయిలో కాకుండా పార్టీకి చెందిన జాతీయ స్థాయి నేతల మాటల్లో రావటం ఆసక్తికరమని చెప్పాలి. ఒకవేళ అదే జరిగితే.. కిషన్ రెడ్డికి ఎన్డీయే సర్కారులో చోటు దక్కదంటున్నారు. అదే జరిగితే..కిషన్ రెడ్డికి మాధవీలత షాకిస్తున్నట్లుగా చెప్పక తప్పదు. మరేం జరుగుతుందో చూడాలి.