Begin typing your search above and press return to search.

ఇదేం అలేఖ్య చిట్టి లొల్లి.. హీరోయిన్ ఘాటు కౌంటర్

తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపుతోంది.

By:  Tupaki Desk   |   8 April 2025 6:33 PM IST
ఇదేం అలేఖ్య చిట్టి లొల్లి..  హీరోయిన్ ఘాటు కౌంటర్
X

తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఒక పచ్చళ్ల వ్యాపారిగా తనదైన శైలిలో గుర్తింపు పొందిన అలేఖ్య, ఇటీవల ఒక కస్టమర్‌తో దురుసుగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె మాటల తీరును చూసి నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ట్రోలింగ్, విమర్శలు కేవలం అలేఖ్య వరకు మాత్రమే కాకుండా ఆమె కుటుంబసభ్యుల వరకూ వెళ్లినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సినీ నటి మాధవీలత స్పందన సోషల్ మీడియాలో మరింత చర్చనీయాంశమైంది. నెటిజన్ల తీరుపై ఆమె కాస్త ఘాటుగానే స్పందించారు. “చైనా, జపాన్ వంటి దేశాల్లో యువత నూతన ఆవిష్కరణలతో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కానీ మన యువత మాత్రం పచ్చళ్ల వ్యాపారం చేసే మహిళలపై సమయం ఖర్చు పెడుతున్నారు,” అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆమె యువతకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మాధవీలత వ్యాఖ్యలు నెటిజన్ల మధ్య చర్చకు దారి తీస్తున్నాయి. కొందరు ఆమె వాదనను సమర్థిస్తున్నా, మరికొందరు మాత్రం ఆమె అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నారు. పచ్చళ్ల వ్యాపారంలో ఉన్న వ్యక్తులపై ఈ స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేయడం అవసరమా అనే చర్చ కూడా వెలుగులోకి వచ్చింది.

ఈ వివాదం మరోసారి సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శల పరిమితులపై చర్చను తెరపైకి తెచ్చింది. ఒక వ్యక్తి ప్రవర్తన తప్పైతే, దానికి స్పందనగా విమర్శలు రావడంలో తప్పేమీ లేదు. కానీ, అది వ్యక్తిగత స్థాయిని దాటి కుటుంబం వరకు వెళ్తే, అది అభ్యర్థనీయమా? అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.

అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం, దానిపై వచ్చిన మాధవీలత కౌంటర్.. ఇవన్నీ యువత, నెటిజన్లు, సోషల్ మీడియా వినియోగం గురించి సమకాలీన చర్చకు దారి తీస్తున్నాయి. విమర్శలు చేయడమో, అభిప్రాయం చెప్పడమో తప్పు కాదు. కానీ అది వ్యక్తిగత స్థాయిని దాటి ద్వేషానికి దారితీస్తే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.