Begin typing your search above and press return to search.

7000 కోట్ల ఆదాయంతో ఆసియాలోనే ధ‌నిక గ్రామం!

భారతదేశంలో 284 మంది బిలియనీర్లు ఉన్నారు. అమెరికా, చైనా తర్వాత భార‌త‌దేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది.

By:  Tupaki Desk   |   1 April 2025 9:19 AM IST
Madhapar Asia Wealthiest Village is in India
X

భారతదేశంలో 284 మంది బిలియనీర్లు ఉన్నారు. అమెరికా, చైనా తర్వాత భార‌త‌దేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. కానీ ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామం జపాన్, చైనా లేదా దక్షిణ కొరియాలో కాకుండా మన దేశంలోనే ఉందనే విష‌యం తెలుసా? ఆ గ్రామం మాధపర్ గ్రామం.. ఇది గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని ఒక చిన్న కుగ్రామం. ఇక్కడ దాదాపు 32,000 మంది జనాభా ఉన్నారు.

మాధపర్ భారతదేశంలోనే కాకుండా ఆసియాలోనే `ధనిక గ్రామం`గా గుర్తింపు పొందింది. ఈ గ్రామ‌ నివాసితులు వారి బ్యాంకుల్లో రూ.7000 కోట్ల విలువైన ఫిక్స్ డ్ డిపాజిట్లు చేశారు. ఆస‌క్తిక‌రంగా.. మహాత్మా గాంధీ జన్మస్థలమైన గుజరాత్‌లోని పోర్‌బందర్ నగరం నుండి 200 కి.మీ దూరంలో ఉన్న మాధపర్‌లో దాదాపు 32,000 మంది నివ‌శిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పటేల్ కమ్యూనిటీకి చెందినవారు. వారంతా గ్రామ అభివృద్ధిలో భాగం.

అయితే ఇంత ధ‌నం ఉన్నా కానీ, అది ఇంకా ప‌ట్ట‌ణంలా మార‌లేదు. కానీ ప‌ట్ట‌ణం ఫీచ‌ర్స్ అన్నీ ఉన్నాయి. మాధపర్ స్థిరమైన గ్రామీణ అభివృద్ధికి ఒక మార్గదర్శిగా విక‌శిస్తోంది. ప‌రిశుభ్ర‌మైన‌ రోడ్లు, స్థిరమైన నీటి సరఫరా, మంచి పారిశుధ్య వ్యవస్థ, పాఠశాలలతో బాగా అభివృద్ధి చెందిన పట్టణాలు, చిన్న నగరాలతో పోల్చితే మంచి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను కలిగి ఉంది. ఈ గ్రామంలో అనేక గొప్ప దేవాలయాలు కూడా ఉన్నాయి.

మాధ‌ఫ‌ర్ గ్రామంలో దాదాపు అన్ని ప్రధాన బ్యాంకులు ఉన్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ యాజమాన్యంలోని హెచ్.డి.ఎఫ్‌.సి బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ స‌హా అన్ని బ్యాంకుల శాఖలు ఉన్నాయి. గ్రామంలోని 17 బ్యాంకులలో రూ. 7000 కోట్లకు పైగా స్థిర డిపాజిట్లు గ్రామస్తులకు ఉన్నాయి. ఇది అభివృద్ధి చెందుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తుంది.

మాధాపర్ సంపద ఎక్కడి నుండి వస్తుంది? అంటే.. వీరంతా విదేశాల నుంచి ఎక్కువ డ‌బ్బు సంపాదిస్తారు. గ్రామంలోని సుమారు 1200 కుటుంబాలు విదేశాలకు వెళ్లాయి. వాటిలో ఎక్కువ భాగం ఇప్పుడు ఆఫ్రికన్ దేశాలలో స్థిరపడ్డాయి. ఇతర దేశాలకు వలస వెళ్ళినా కానీ, త‌మ గ్రామంలోని స్థానిక బ్యాంకులు, పోస్టాఫీసులలో ఎక్కువ డ‌బ్బును జమ చేస్తున్నాయి. ఆ ర‌కంగా విదేశీ డ‌బ్బు ఇక్క‌డ ఆదాయంగా మారింది. మాధపర్ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం చుట్టూ తిరుగుతుంది. మామిడి, మొక్క‌జొన్న‌, చెర‌కు పండిస్తారు. ఎక్కువ మంది రైతులు ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. ముఖ్యంగా ఇతర దేశాలకు వలస వచ్చిన మాధపూర్ స్థానికులు 1968లో లండన్‌లో మాధపర్ విలేజ్ అసోసియేషన్‌ను స్థాపించారు. ఈ గ్రామ‌స్తులంతా మంచి స‌త్సంబంధాల‌ను కొన‌సాగించ‌డం ద్వారా ఆర్థిక పురోభివృద్ధిని సాధించారు.