Begin typing your search above and press return to search.

రూ.1.19 లక్షల కోట్లు విరాళం ఇచ్చిన ఆమె ఎవరంటే?

డబ్బులు సంపాదించటం ఎంత కష్టమో.. అంతే సులువని చెబుతారు. ఆ కిటుకు ఒకసారి వంటబడితే డబ్బులకు కొదవ ఉండదని చెబుతారు.

By:  Tupaki Desk   |   13 Feb 2024 12:30 PM GMT
రూ.1.19 లక్షల కోట్లు విరాళం ఇచ్చిన ఆమె ఎవరంటే?
X

డబ్బులు సంపాదించటం ఎంత కష్టమో.. అంతే సులువని చెబుతారు. ఆ కిటుకు ఒకసారి వంటబడితే డబ్బులకు కొదవ ఉండదని చెబుతారు. ఈ ట్రిక్ సంగతి పక్కన పెడితే.. సంపాదించిన డబ్బును ఖర్చు చేసే వారు కొందరు అయితే.. వాటిని ఇతరుల సాయం కోసం విరాళాల రూపంలో దానం చేసే వారు అతి కొద్దిమంది ఉంటారు. అయితే.. అందులోనూ పరిమితులు పెట్టుకుంటారు. అందుకు భిన్నంగా సాయం చేయటమే లక్ష్యంగా పని చేసే వారు అతి కొద్దిమంది ఉంటారు. ఇప్పుడు చెప్పే మహిళ ఆ కోవలోకే వస్తారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మహిళల్లో ఒకరిగా చెప్పే ఆమె ఇప్పటివరకు విరాళాల రూపంలో అందించిన మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల రూ.1.19 లక్షల కోట్లు. ఈ మొత్తాన్ని పేపర్ మీద రాయటానికి తక్కువలో తక్కువ 2 నిమిషాలు తీసుకోవటం ఖాయం.

ఇంతకు ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఎవరు? ఏం చేసి ఇంత డబ్బును ఆమె సంపాదించారు? ఆమె దేని కోసం ఇంత భారీగా విరాళాలు ఇస్తున్నారన్న విషయాల్లోకి వెళితే.. ఆమె పేరు మెకంజీ స్కాట్. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉందే? అన్న అనుమానం కొందరికి రావొచ్చు. నిజమే.. మీ సందేహం కరెక్టే. ఆమె.. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య. అయితే.. అమెజాన్ వ్యవస్థాపకుడి మాజీ భార్య అన్న ట్యాగ్ కంటే కూడా తనను రచయిత్రిగా గుర్తించటాన్ని ఇష్టపడతారు. అమెజాన్ ఈ స్థాయికి రావటంలో ఆమె చేసిన కష్టం తక్కువేం కాదు. అందుకే ఆమె అలా అనటం తప్పు కాదు.

ప్రముఖ నవలా రచయిత్రిగా పేరున్న ఆమె ఇప్పటివరకు అందించిన విరాళం ఎంతో తెలుసా? రూ.1,19,522 కోట్లు. తాను బతికి ఉన్నంతవరకు చేతనైనంత సాయం చేస్తూనే ఉంటానని.. విరాళాలు ఇస్తూనే ఉంటానని శపథం చేసిన అరుదైన వ్యక్తిత్వం ఆమె సొంతం. 1993లో జెఫ్ బెజోస్ ను పెళ్లాడిన ఆమె 2019లో విడాకులు తీసుకున్నారు. ఆ టైంలో భరణంగా ఆమెకు అందిన డబ్బు (అత్యధికంగా అమెజాన్ స్టాక్స్ ) ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళల్లో ఒకరుగా మారారు. 1970లో కాలిఫోర్నియాలో పుట్టిన మెకంజీ స్కాట్ ఆరేళ్ల వయసులోనే కథలు రాయటం షురూ చేసింది.

సాహిత్య రంగంలో నోబెల్ గ్రహీత టోని మోరిసన్ వద్ద చదువుకున్న ఆమె.. న్యూయార్క్ నగరంలో ఒక కంపెనీలో పని చేసింది. ఆ సంస్థలోనే జెఫ్ బెజోస్ పని చేశారు. ఆ టైంలోనే వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం తర్వాత ప్రేమగా మారి చివరకు 1993లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అమెజాన్ స్థాపించి దానిని బాగా డెవలప్ చేశారు. 2019లో విడాకులు తీసుకున్న తర్వాత భరణంలో భాగంగా ఆమె చేతికి రూ.2.53లక్షల కోట్ల విలువైన స్టాక్స్ అందుకున్నారు. విద్య.. ఆరోగ్యం.. సామాజిక న్యాయం.. పర్యావరణం.. లాంటి అంశాలకు మద్దతు పలుకుతూ భారీ ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. ప్రపంచంలో అత్యధికంగా విరాళాలు ఇస్తున్న జాబితాలో ఆమె ఒకరు. డబ్బులు ఉండటం గొప్పేం కాదు. కానీ.. వాటిని అవసరమైన వారికి అందించేందుకు వెనుకాడకుండా ఉండటమే గొప్పతనంగా చెప్పక తప్పదు.