సైలెంట్ వేవ్‌లో... మాచర్ల పాలిటిక్స్...!
ఎన్నికలకు ముందు.. తర్వాత కూడా.. ఈ నియోజకవర్గం ఒక ఏడాది పాటు మీడియా సహా.. ప్రజల మధ్య కూడా తీవ్ర చర్చనీయాంశం అయింది.
By: Garuda Media | 1 Jun 2026 7:00 AM ISTపల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం అంటేనే.. పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉంటాయి. ఎన్నికలకు ముందు.. తర్వాత కూడా.. ఈ నియోజకవర్గం ఒక ఏడాది పాటు మీడియా సహా.. ప్రజల మధ్య కూడా తీవ్ర చర్చనీయాంశం అయింది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు కావడం.. ఆయన జైలుకు వెళ్లడం.. సహా.. నియోజకవర్గంలో రాజకీయాలు హాట్‌గానే ఉన్నాయి. అయితే.. గత ఆరు మాసాల నుంచి నియోజకవర్గంలో పెద్దగా రాజకీయాలు కనిపించడం లేదు.
పైగా... క్షేత్రస్థాయిలో పనులు జరుగుతుండడం గమనార్హం. మాచర్ల పరిధిలోని వరికపూడి సెల ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి సంబంధించిన నిధులను కూడా రెండు మాసాల కిందట ప్రభుత్వం కేటాయించింది. ఈ పనులు ప్రస్తుతం వడివడిగా సాగుతున్నాయి. అదే సమయంలో నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. రహదారులు, తాగునీటి సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
దీంతో నియోజకవర్గంలో రాజకీయాలు సైలెంట్ అయిపోయి.. అభివృద్ధి పనులు సాగుతున్నాయని స్పష్ట మవుతోంది. ఎన్నో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న పనులు కూడా త్వరగా పూర్తవుతుండడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఎమ్మెల్యే ఆలోచన కూడా.. అభివృద్ధి ద్వారా.. ఇక్కడ మరోసారి విజయం దక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎప్పుడూ.. రాజకీయాలు వేడెక్కి.. దానిని ఆసరా చేసు కుని విజయం దక్కించుకునే పరిస్థితి కాకుండా.. మంచి చేసి.. మార్కులు పొందాలన్న ఉద్దేశంతో ఉన్నా రు.
ఇక, వైసీపీ నాయకులు కూడా.. ఎవరూ పెద్దగా నోరు విప్పడం లేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టు షరతుల నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ప్రస్తుతం వైసీపీ కార్యక్రమాలు కూడా చేపట్టడం లేదు. ఒకవేళ చేపట్టినా.. ఆయన అనుచరులు తూతూ మంత్రంగానే పనులు పూర్తి చేస్తున్నారు. గతంలో ఉన్నంత హవా కానీ.. దూకుడు కానీ.. ఎక్కడా కనిపించడం లేదు. మరోవైపు టీడీపీ నాయకులు కూడా రాజకీయాలను పక్కన పెట్టి ఎక్కువగా డెవలప్‌మెంటుపైనే దృష్టి పెట్టారు. దీంతో మాచర్లలో పాలిటిక్స్ సైలెంట్ వేవ్‌లోనే సాగుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
