పరువు హత్యకు పోలీసు అధికారి సాయం!
ప్రేమించినోడ్ని పెళ్లి చేసుకుందున్న కోపం.. పరువు పోయిందన్న భావన.. కలగలిసి ఆ తండ్రిని దుర్మార్గుడిగా మార్చాయి.
By: Garuda Media | 4 April 2026 9:42 AM ISTప్రేమించినోడ్ని పెళ్లి చేసుకుందున్న కోపం.. పరువు పోయిందన్న భావన.. కలగలిసి ఆ తండ్రిని దుర్మార్గుడిగా మార్చాయి. దానికి పోలీసు అధికారి సాయం చేయటంతో ఇవేమీ తెలియని చౌడేశ్వరి ప్రాణాలు పోయాయి. మాచర్ల పరువుహత్యగా సంచలనంగా మారిన ఉదంతంలో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. తనను కాదని ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్నకోపంతో పక్కాగా ప్లాన్ చేసి మరీ కన్నకూతురి ప్రాణాలు తీసిన వైనం వెలుగు చూసింది.
గత నెల 18న మాచర్లలో చౌడేశ్వరి అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి పోలీసు విచారణలో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. మాచర్లకు చెందిన వ్యాపారి చంద్రశీను కుమార్తె చౌడేశ్వరి. వారి ఇంటి పక్కన ఇంటికి వచ్చే నాగరాజు అనే యువకుడి ప్రేమలో పడింది. అయితే.. ఆమె తండ్రి మాత్రం ఒక గవర్నమెంట్ టీచర్ కు ఇచ్చి పెళ్లి చేయాలని భావించాడు. మరికొన్ని రోజుల్లో ఎంగేజ్ మెంట్ ఉందన్న సమయంలో చౌడేశ్వరి తాను ప్రేమించిన నాగరాజుతో వెళ్లిపోయింది. దీన్ని జీర్ణించుకోలేని చంద్రశ్రీను కూతురిపై కక్ష పెంచుకున్నాడు. తన కుమార్తె కారణంగా తన పరువు పోయిందని భావించాడు.
తాను ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోయిన ఉదంతాన్ని తన ఇంట్లో బంగారం పోయిందని చంద్రశ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు చౌడేశ్వరి ఆచూకీ కోసం ప్రయత్నించారు. చివరకు కొత్త దంపతుల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. తాను బంగారు నగలను తీసుకెళ్లలేదని ఆమె స్పష్టం చేసింది. పెళ్లి గురించి అడగ్గా.. తాను మేజర్ అని.. తనకు నచ్చిన వ్యక్తితో తాను పెళ్లి చేసినట్లుగా చెప్పింది.
ఇదే సమయంలో పెద్దల మధ్య జరిగిన చర్చల అనంతరం ఐదు రోజుల పాటు పుట్టింట్లో ఉండి.. ఆ తర్వాత భర్త వద్దకు వెళ్లేలా ఒప్పందం జరిగింది. పోలీస్ స్టేషన్ లో ఒప్పందంలో భాగంగా మార్చి 19న భర్త వద్దకు ఆమె వెళ్లాల్సి ఉంది. అందుకు భిన్నంగా ఒక రోజే ఆమె విగతజీవిగా మారింది. దీన్ని చౌడేశ్వరి తండ్రి ఆత్మహత్యగా చెప్పగా.. ఆమెను పెళ్లాడిన నాగరాజు మాత్రం పరువు హత్యగా ఆరోపించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఉదంతంపై విచారణ చేపట్టారు.
చౌడేశ్వరి ఆచూకీని కనిపెట్టి.. తండ్రితో పంపిన వైనంలో ఒక పోలీసు అధికారి డబ్బులు తీసుకొని ఆమెను ఇంటికి పంపినట్లుగా గుర్తించారు. ఇందులో భాగంగా పోలీసు అధికారికి భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్లుగా చౌడేశ్వరి తండ్రి ఒప్పుకున్నాడు. ప్రేమ పెళ్లి చేసుకున్న నాగరాజు.. చౌడేశ్వరి జంట నరసరావుపేట మండలం పెదతురకపాలేనికి చెందిన ఖాజా సాయంతో నరసరావుపేటలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. బంగారం పోయిందన్న ఫిర్యాదులో భాగంగా ఖాజాను తీసుకొచ్చిన పోలీసులు విచారించి.. కొత్త జంట అడ్రస్ ను సేకరించారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని వెళ్లగా.. తాను మేజర్ నని.. తన భర్తతోనే ఉంటానని చౌడేశ్వరి స్పష్టం చేసింది. అయితే.. పోలీసు అధికారి పెద్ద మనిషి మాదిరి వ్యవహరించి..తల్లిదండ్రులకు చౌడేశ్వరిని అప్పగించారు.
కూతుర్ని ఇంటికి తీసుకెళ్లిన చంద్రశీను.. మార్చి 18న తన భార్య..కొడుకును బలవంతంగా పొలానికి పంపాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. తన మేనల్లుడు పచ్చిపాల శీనుతో కలిసి నిద్రపోతున్న చౌడేశ్వరిపై దాడి చేశారు. ఆమె ముఖంపై దిండును గట్టిగా అదిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఆమె ఉరేసుకున్నట్లుగా చిత్రీకరించారు. అయితే.. ఆమెను పెళ్లాడిన నాగరాజు అనుమానం వ్యక్తం చేయటం.. చౌడేశ్వరి ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోదని.. ఆమె తండ్రే చంపేశాడని ఆరోపించారు.
ఈ ఉదంతం సంచలనంగా మారింది. దీంతో పోలీసులు ఈ వ్యవహరాన్ని విచారించేందుకు రంగంలోకి దిగారు. చివరకు చంద్రశీనును తమదైన శైలిలో విచారించగా.. తాను చేసిన దారుణాన్ని ఒప్పుకున్నాడు. బాగా డబ్బున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటే ప్రేమపెళ్లి చేసుకొని నా పరువు తీసిందని అందుకే చంపేసినట్లుగా ఒప్పుకున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని పరువు కోసం బలి ఇచ్చిన వైనం స్థానికంగా విషాదంగా మారింది. చంద్రశీనుకు సహకరించిన పోలీసు అధికారి.. ఆమెను హత్య చేసిన రోజు సెలవులో ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారం పోలీసు శాఖలోనూ కలకలాన్ని రేపింది. ఈ అంశంపై మరింత లోతుగా విచారణ జరపేలా పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
