లైవ్ కట్ అయ్యాక అప్పట్లో ఏం జరిగిందో చెప్పి షాకిచ్చిన ఏపీ మండలి మాజీ ఛైర్మన్
ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఛైర్మన్ గా వ్యవహరించిన సీనియర్ నేత ఎం.ఎ.షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Garuda Media | 3 April 2026 9:07 AM ISTఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఛైర్మన్ గా వ్యవహరించిన సీనియర్ నేత ఎం.ఎ.షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న వేళలో మండలి సభలో తనకు ఎదురైన దారుణ చేదు అనుభవాల్ని ఏకరువు పెట్టారు. ఏపీ శాశ్వత రాజధాని అమరావతిగా పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లోనూ భారీ ఎత్తున వేడుకలు నిర్వహించారు.
ఈ వేడుకలకు పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. అలా హాజరైన వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ ఛైర్మన్ ఎం.ఎ. షరీఫ్. తాను మండలి ఛైర్మన్ గా వ్యవహరించిన సమయంలో వైసీపీ సర్కారు మూడు రాజధానుల బిల్లును ప్రవేశ పెట్టారని.. ఆ సమయంలో 29 మంది టీడీపీ సభ్యులు ఉన్నారని.. లోకేశ్ మొదలు కొని యనమల.. అశోక్ బాబు ఇలా పలువురు ఉన్నారంటూ నాడు జరిగిన విషయాల్ని గుర్తు చేసుకున్నారు. మూడు రాజధానుల బిల్లు మండలిలోకి వచ్చి చర్చ జరిగినప్పుడు.. సభలో చంద్రబాబు ఉన్నారని.. మండలి ఛైర్మన్ గా తాను న్యాయంగా ఏం చేయాలో అదే చేశానే తప్పించి.. ఒత్తిళ్లకు లొంగలేదన్నారు.
తన రాజకీయ జీవితంలో పైసా ఖర్చు చేయకుండా పదవుల్నిచేపట్టానని.. తాను ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదన్నారు. మూడు రాజధానుల బిల్లు ప్రవేశ పెట్టిన సమయంలో అసలేం జరిగిందో ఎప్పుడూ చెప్పని ఆయన తాజాగా గుర్తు చేసుకున్నారు. తనకు తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చాయని.. మూడు రాజధానులకు అనుగుణంగా వ్యవహరించాలని తనను కోరారని చెప్పారు. అయితే.. తాను ధర్మం తప్పలేదన్నారు.
దీంతో.. మూడు రాజధానుల బిల్లుపై చర్చ జరిగిన సందర్భంగా.. సభ ముగిసిన తర్వాత కెమేరాలు లైవ్ ఆగిన తర్వాత తన చుట్టూ వైసీపీ నేతలు చుట్టుముట్టారని.. తీవ్ర పదజాలంతో తిట్టిపోశారన్నారు. ఒకదశలో తన పుట్టుక మీదా దారుణ వ్యాఖ్యలు చేశారన్నారు. ఒక మంత్రి తనను కులం పేరుతో దూషిస్తే.. మరొకరు నా పుట్టుకను నిందించారు. అయినా.. తాను బెదర్లేదన్నారు. తనను అప్పట్లో టీడీపీ సభ్యులు కాపాడారన్నారు. వైసీపీ సభ్యులంతా తన మీదకు వచ్చేశారని.. కుర్చీలు.. బెంచీలు ఎక్కి తన టేబుల్ మీద కూర్చున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
తన చుట్టూ చేరిన సభ్యులు తనను బెదిరింపులకు గురి చేయటం.. ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసినా తాను వెరవలేదన్నారు. తన దగ్గర డబ్బుల్లేవు కాబట్టి.. డబ్బుల కోసం వస్తారని ఆశించారని.. కానీ తాను మాత్రం కట్టు తప్పలేదన్నారు. తనకు మంచి బతుకుదెరువు చూపిస్తామన్న ప్రలోభాలకు గురి చేశారన్నారు. అయినా తాను బెదర్లేదని చెప్పాలి. ఈ క్రమంలో అప్పటి ఒక మంత్రి తన గుండెల మీద చేయి వేసి నెట్టారన్నారు. తనను బతకనివ్వనని బెదిరించారన్నారు.
ఇలా ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా తాను లొంగలేదన్న ఆయన.. ‘‘నాకున్న అధికారంతో మూడు రాజధానుల బిల్లు ఆమోదించలేదు. నమాజ్ చేసుకుని అల్లాని ప్రార్థించుకుని.. 'అల్లా సత్యం వైపు ఉండేటట్లుగా నా కళ్లు తెరువు' అని కోరా. ఎన్ని ఒత్తిడిలు ఉన్నా.. బెదిరించినా ధర్మం వైపు నిలబడాలనే అల్లా మాటలకు ఆరోజు కట్టుబడి ఉన్నా. ఆ తర్వాతా నన్ను చైర్మన్ స్థానం నుంచి దింపేందుకు అనేక కుట్రలు చేశారు. ఇప్పుడు అమరావతి రాజధానిగా చట్టం చేయడం ఆనందంగా ఉంది'’ అంటూ నాడు జరిగిన దారుణాల్ని కళ్లకు కట్టినట్లుగా వివరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారాయి.
