తిరుమల ప్రసాదంలో తప్పు జరగలేదని బొంకుతారా? మాజీ సీఎస్ ఎల్వీ సంచలన వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిపై ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Political Desk | 7 Feb 2026 3:40 PM ISTదేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిపై ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ఈ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గత ప్రభుత్వంలో టీటీడీకి నెయ్యి సేకరించిన విధానంలో చోటుచేసుకున్న లోటుపాట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వాళ్లు తిరుమలకు వచ్చి పొర్లు దండాలు పెట్టాలని, తలనీలాలు అర్పించి పశ్చాత్తాపం చెల్లించుకోవాలని సూచించారు. ప్రముఖ తెలుగు దినపత్రికకు మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఇంటర్వ్యూ హాట్ డిబేట్ గా మారింది. ఇప్పటికే ఈ అంశంపై రాష్ట్రంలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరుగుతోంది. సీబీఐ సిట్ లో తమకు క్లీన్ చిట్ లభించినట్లు విపక్ష పార్టీ ప్రచారం చేసుకుంటుండగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం వైసీపీ వాదనను తోసిపుచ్చుతూ వెల్లడించిన అభిప్రాయాలు భక్తుల్లో విస్తృత చర్చకు దారితీస్తున్నాయని అంటున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యిని అనుమతించడాన్ని ఎల్వీ సుబ్రహ్మణ్యం తీవ్రంగా తప్పుపట్టారు. తిరుమల దేవస్తానంలో ఈవో, చైర్మన్ ఇందుకు నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. టీటీడీలో ఈవో పాత్ర చాలా కీలకం, ఆ స్థానంలో ఉన్నవారు సాధారణ అధికారి కాదు. సాక్ష్యాత్తూ శ్రీవారికి అనుంగు సేవకుడు. ఏదైనా తప్పు గుర్తించినా, తప్పు జరుగుతోందని భావించినా ఈవో వెంటనే చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లాలి. వారు వినకపోతే ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి. దేవదేవుడి సేవలో ఎలాంటి తప్పు జరగకుండా నిరోధించనందుకే ప్రభుత్వం ఈవో సింఘాల్ పై చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు ఎల్వీ సుబ్రహ్మణ్యం.
తిరుమలలో తప్పులు జరగకుండా టీటీడీ చైర్మన్ బాధ్యత వహించాల్సివుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రసాయనాలు కలిపేసి నెయ్యి కాని నెయ్యి తయారు చేసి తిరుమల స్వామి వారి ముందు దీపారాధన చేశారని, లడ్డూ ప్రసాదం తయారీకి, ఇతర నైవేద్యాలకు ఆ నెయ్యి వినియోగించడం తప్పుకాదని ఎలా అనుకుంటున్నారని రిటైర్డ్ ఐఏఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. ‘‘మహాపచారం జరిగిపోయింది. ఇది మానవాళికే శాపం. ఇప్పటికైనా మీ వాదనలు, సమర్థనలు ఆపేసి ప్రాయశ్చిత్తం చేసుకోండి’’ అంటూ వైసీపీ నేతలకు ఆయన సలహా ఇచ్చారు.
అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కొనుగోళ్ల కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు కరుణాకరరెడ్డి తాజాగా చేస్తున్న వాదనలపైనా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తప్పు జరగలేదని బొంకుతున్నారంటూ సీరియస్ అయ్యారు. పక్కా ప్లాన్ చేసి ఎక్కడెక్కిడికో వెళ్లి నెయ్యి లాంటి పదార్థం తయారు చేశారని ఎల్వీ ఆరోపించారు. 2022లో నిర్వహించిన పరీక్షల్లో కల్తీ తేలిందని నివేదికలు వచ్చాయి. అప్పుడే చర్యలు తీసుకోకుండా అదే నెయ్యిని కొనసాగించడం చూస్తే, ఇది కావాలని చేసినట్లు అర్థం అవుతోందని మాజీ సీఎస్ అనుమానం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో సుదీర్ఘకాలంపాటు పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం టీటీడీ ఈవోగా, సీఎస్ గా పనిచేశారు. లడ్డూ ప్రసాదంలో కల్తీపై ఆయన తాజాగా వెలిబుచ్చిన అభిప్రాయాలు విపక్ష వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టేసినవిగా ఉన్నాయని అంటున్నారు. అదేసమయంలో ప్రస్తుతం వైసీపీ ఎదురుదాడి నుంచి ఉక్కిరిబిక్కిరి అవుతున్న కూటమి నేతలకు మాజీ సీఎస్ వ్యాఖ్యలు ఉపశమనం కల్పించినట్లుగా భావిస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న విషయంపైనే ఇప్పటివరకు చర్చ జరుగుతోంది. అయితే పూర్తిగా రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని వాడి మహాపచారం చేశారంటూ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలతో ఇక నుంచి చర్చ అటు కూడా మళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
