విశాఖ, విజయవాడల్లో లులు మాల్స్.. చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ!
లులు మాల్స్‌కు భూ కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
By: Tupaki Desk | 31 July 2025 4:07 PM ISTలులు మాల్స్‌కు భూ కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నంలో బిడ్డింగ్ నిర్వహించకుండా బిడ్డింగ్ నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ పాకా సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విజయవాడలో కూడా లులు మాల్‌కు భూమి కేటాయింపును చేర్చాలని పిటిషనర్ కు హైకోర్టు సూచించింది. ఆ తర్వాతే పిటిషన్ ను విచారిస్తామని కేసును వచ్చేవారానికి వాయిదా వేసింది.
లులు మాల్స్‌కు భూ కేటాయింపులపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విశాఖ నగరంలో షాపింగ్ మాల్ ఏర్పాటుకు సంబంధించి 13.5 ఎకరాలను తక్కువ ధరకు రాష్ట్ర ప్రభుత్వం లులు సంస్థకు కేటాయించబోతుందని పేర్కొంటూ పాకా సత్యనారాయణ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ పై విచారణ జరగా, పిటిషనర్ తరపున న్యాయవాది అశోక్ రామ్ వాదనలు వినిపించారు. లులు సంస్థకు 2018లో బిడ్డింగ్ ద్వారా భూములు కేటాయించారని, 2019 నవంబరు 8న అప్పటి వైసీపీ ప్రభుత్వం భూ కేటాయింపులను రద్దు చేసిందని పేర్కొన్నారు. బిడ్లు ఆహ్వానించకుండా, సంస్థ చైర్మన్ ప్రతిపాదన మేరకు సీఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి ఆ సంస్థకు భూములు కేటాయించారని వివరించారు.
విజయవాడలో కూడా లులు సంస్థకు భూమి కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయంగా అంగీకరించిందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం, విజయవాడలో లులు గ్రూపునకు భూమిని కేటాయిస్తూ జారీ చేసిన జీవోను కూడా సవాల్ చేయాలని పిటిషనర్‌కు సూచించింది. ఈ పరిణామంతో హైకోర్టులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వానికి షాక్ తగిలినట్లేనని అంటున్నారు. చంద్రబాబు గత ప్రభుత్వంలో విశాఖలో లులు మాల్ ఏర్పాటుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆ సంస్థ హైదరాబాద్ కు తరలిపోయింది. ఇక ఏడాది క్రితం కూడా విశాఖలో లులు మాల్ ఏర్పాటుకు ప్రభుత్వం భూములు కేటాయించింది. ఇక హైకోర్టులో పిటిషన్ దాఖలు అవడంతో లులు మాల్స్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది.
