Begin typing your search above and press return to search.

మంజీరా మాల్ లూలు చేతికి వెళ్లిపోయిందోచ్

నిజానికి లూలూ మాల్ ఏర్పాటు చేసిన భవనం మంజీరా రిలెయిల్ హోల్డింగ్స్ కు సంబంధించింది.

By:  Tupaki Desk   |   11 April 2025 9:42 AM IST
Lulu Mall Takes Full Ownership of Manjeera Mall in Hyderabad
X

హైదరాబాద్ లోని లూలూ మాల్ గురించి తెలియనోళ్లు ఉండరు. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్ బీ)లో ఏర్పాటు చేసిన ఈ మాల్ ప్రారంభమే ఒక సంచలనం. ఈ మాల్ ఓపెనింగ్ వేళ.. జనాల నుంచి వచ్చిన ఆదరణ.. పదుల కిలోమీట్ల మేర ట్రాఫిక్ జాం కావటం మొదలు.. మాల్ రద్దీ ఒక కొలిక్కి వచ్చేందుకు దగ్గర దగ్గర మూడు నెలల సమయం పట్టిన సంగతి తెలిసిందే. మాల్ అనుభవం హైదరాబాదీయులకు కొత్తేం కాకున్నా.. భిన్నమైన అనుభూతిని పంచిన లూలూ మాల్ హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి లూలూ మాల్ ఏర్పాటు చేసిన భవనం మంజీరా రిలెయిల్ హోల్డింగ్స్ కు సంబంధించింది. దీన్ని మంజీరా మాల్ గా వ్యవహరిస్తూ ఉంటారు. లూలూ మాల్ ఏర్పాటుతో అంతకు మందున్న మంజీరా మాల్ కంటే కూడా లూలూ మాల్ అని పిలవటం ఎక్కువైంది. లీజు పద్దతిలో లూలూ మాల్ ను ఏర్పాటు చేసినప్పటికి.. తాజాగా ఆ భవనానికి లూలూ సంస్థ యజమానిగా మారింది.

దీనికి కారణం మంజీరా రిటెయిల్ హోల్డింగ్స్ దివాలా ప్రక్రియలో భాగంగా ఈ భవనాన్ని సొంతం చేసుకోవటానికి పెద్ద ఎత్తున సంస్థలు పోటీ పడినా చివరకు లూలూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ సంస్థ రూ.318.42 కోట్లకు సొంతం చేసుకుంది. కేటలిస్ట్ ట్రస్టీషిస్ సంస్థ నుంచి మంజీరా రిటెయిల్ హోల్డింగ్స్ రుణాన్ని తీసుకుంది.

దీన్ని తిరిగి చెల్లించే విషయంలో మంజీరా సంస్థ ఫెయిల్ అయ్యింది. దీంతో దివాలా ప్రక్రియ షురూ అయ్యింది. ఈ నేపథ్యంలో బిడ్లు పిలవటం.. ఆసక్తి ఉన్న సంస్థలతో సంప్రదింపులు జరపటం.. సీఓసీ సమావేశాల్ని నిర్వహించటం లాంటివి చేశారు. ఈ దశలన్నింటిని లూలూ సంస్థ అధిగమించింది. తాజాగా మంజీరా మాల్ ను సొంతం చేసుకొని యజమానిగా మారింది.