Begin typing your search above and press return to search.

విశాఖ తర్వాత అమరావతిలోనూ లులూ గ్రూప్....ఎన్సీపీకి హైకోర్టు, ఎల్ అండ్ టీకి అసెంబ్లీ

శుక్రవారం లులూ గ్రూప్ ప్రతినిధులు అమరావతిలో పర్యటించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

By:  Tupaki Desk   |   5 April 2025 12:49 PM IST
విశాఖ తర్వాత అమరావతిలోనూ లులూ గ్రూప్....ఎన్సీపీకి హైకోర్టు, ఎల్ అండ్ టీకి అసెంబ్లీ
X

హైపర్ మార్కెట్లు, మాల్స్, మల్టీప్లెక్స్‌ల నిర్మాణంలో ప్రపంచ ఖ్యాతి గాంచిన లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విశాఖపట్నంలో రూ. 1,500 కోట్లతో మాల్, కన్వెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఈ సంస్థ, తాజాగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది.

శుక్రవారం లులూ గ్రూప్ ప్రతినిధులు అమరావతిలో పర్యటించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. సీఆర్డీఏ అధికారులు వారికి అమరావతిలోని పలు కీలక ప్రాంతాలను చూపించారు. విశాఖలో పెట్టుబడుల గురించి చర్చించే సమయంలో లులూ గ్రూప్ అధినేత యూసుఫ్ అలీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అమరావతి గురించి కూడా ఆరా తీసినట్లు సమాచారం. అమరావతిని ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు చెప్పడంతో, అక్కడ కూడా పెట్టుబడులు పెట్టేందుకు అలీ ఆసక్తి చూపారట. ఈ క్రమంలోనే అమరావతిలో పర్యటించాలని చంద్రబాబు కోరగా, లులూ బృందం శుక్రవారం అమరావతికి వచ్చింది.

అమరావతిలో పర్యటన సందర్భంగా లులూ బృందం నగర భవిష్యత్తు ప్రణాళికలు, రానున్న నిర్మాణాలు, నవ నగరాల రూపురేఖలు, జనాభా పెరుగుదల వంటి వివరాలను సీఆర్డీఏ అధికారుల ద్వారా తెలుసుకుంది. అనంతరం అమరావతిలోనూ హైపర్ మాల్, కన్వెన్షన్ సెంటర్, మల్టీప్లెక్స్, ఐమ్యాక్స్ వంటి వాటిని ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. విశాఖలో మాదిరిగానే అమరావతిలోనూ దాదాపు రూ. 1,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు లులూ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒప్పందం త్వరలోనే కుదిరే అవకాశం ఉంది.

మరోవైపు, నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో శాశ్వత భవనాల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. గతంలో తాత్కాలిక భవనాలు నిర్మించినప్పటికీ, ప్రస్తుతం టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం హైకోర్టు మరియు అసెంబ్లీ శాశ్వత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వీటి టెండర్లను ఏపీసీఆర్డీఏ ఇటీవలే ఆహ్వానించగా, శుక్రవారం వాటిని ఖరారు చేశారు. హైకోర్టు భవన నిర్మాణ కాంట్రాక్టును నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ (ఎన్సీసీ) దక్కించుకోగా, అసెంబ్లీ భవన నిర్మాణ కాంట్రాక్టును లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) దక్కించుకుంది. ఈ రెండు భవనాల నిర్మాణానికి ప్రభుత్వం మొత్తం రూ. 1,649.33 కోట్లు ఖర్చు చేయనుంది.