ట్రంప్ గాలి తీసేసిన లూలా డిసిల్వా... గట్టి కౌంటరే ఇచ్చారు!
ట్రంప్ పరిస్థితి ఇలా అయిపోయిన నేపథ్యంలో తాజాగా బ్రెజిల్ అధ్యక్షుడు స్పందించారు.
By: Tupaki Desk | 9 July 2025 5:00 AM IST14 దేశాలకు ట్రంప్ టారిఫ్ లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఇవి 25% నుంచి మొదలై 40% వరకూ ఉన్నాయి. ఇదే సమయంలో... అమెరికా విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించే బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనంగా 10 శాతం సుంకం విధిస్తానంటూ ట్రంప్ హెచ్చరించిన పరిస్థితి. అయితే.. ఈ బెదిరింపులపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డిసిల్వా స్పందిస్తూ.. ట్రంప్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
అవును... ప్రపంచానికి పెద్దన్నగా పిలవబడే అమెరికా ఇప్పుడు పలు దేశాలకు సమస్యగా మారుతుంది! ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న వ్యవహార శైలి ఇటీవల విమర్శల పాలవుతుంది! తాను ఏది చెబితే అది జరగాలి, అంతా అదే పాటించాలి.. లేకపోతే టారిఫ్ లతో కొడతా.. లేదా, బంకర్ బ్లస్టర్ బాంబులు వేస్తాం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది!
ఒక్కమాటలో చెప్పాలంటే... ఉత్తరకొరియాకు కిమ్ నియంత అయితే, ప్రపంచ దేశాలకు తానే నియంత అన్నట్లుగా ట్రంప్ వ్యవహార శైలి మారిపోయిందని చెబుతున్నారు. ఆయన విబేధించాల్సి వస్తే మస్క్ ను అయినా పక్కనపెడుతున్నారు.. స్నేహం చేయాలనుకుంటే పాకిస్థాన్ తో అయినా చేస్తున్నారు.. ఐ లవ్ పాకిస్థాన్ అని చెబుతున్నారు.
ట్రంప్ పరిస్థితి ఇలా అయిపోయిన నేపథ్యంలో తాజాగా బ్రెజిల్ అధ్యక్షుడు స్పందించారు. ఈ సందర్భంగా ట్రంప్ కు గట్టి కౌంటర్ వేశారు. ఇందులో భాగంగా... ప్రపంచం ఇంతకుముందులా లేదని.. అందువల్ల ఇప్పుడు చక్రవర్తి అవసరం లేదని వ్యాఖ్యానించారు. బ్రెజిల్ లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ముగింపు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... ప్రపంచం మునుపటిలా లేదు. అందువల్ల మనకు చక్రవర్తి అవసరం లేదు. మన దేశాలు సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాయి. ట్రంప్ సుంకాలను జారీ చేస్తే.. ఇతర దేశాలకు అదే చేసే హక్కు ఉంది. అగ్రరాజ్యానికి అధ్యక్షుడైన ఆయన సుంకాల గురించి ప్రపంచాన్ని బెదిరించడం బాధ్యతారాహిత్యంగా భావిస్తున్నా అని రియాక్ట్ అయ్యారు.
ఇలా సోషల్ మీడియాలోని పోస్టులతో ప్రపంచ దేశాలను టారిఫ్ ల పేరు చెప్పి బెదిరించడం బాధ్యతారాహిత్యమే అని అంటూ... ఇలాంటి అంశాలపై ఇతర దేశాలతో మాట్లాడేందుకు చాలా వేదికలు ఉన్నాయని ట్రంప్ కు సూచించారు. దీంతో.. బ్రెజిల్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలకు నెట్టింట మద్దతు దొరుకుతుందని అంటున్నారు.
కాగా... ట్రంప్ ఇటీవల ఏ విషయాన్ని అయినా, ఎంత ముఖ్యమైన విషయాన్ని అయినా సోషల్ మీడియా వేదికగానే ప్రకటిస్తున్నారు.. తనను తాను పొగుడుకుంటున్నారు.. లేని క్రెడిట్ ని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఉదాహరణకు భారత్ - పాక్ మధ్య యుద్ధాన్ని తనే ఆపానని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. వాణిజ్యం పేరు చెప్పి ఆ దేశాల మధ్య యుద్దాన్ని ఆపినట్లు ప్రకటించుకుంటున్నారు. ఈ విషయంపై ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చినా.. మానినటే మాని మళ్లీ అదే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
