Begin typing your search above and press return to search.

నాటో దేశాలపై అణ్వాయుధ దాడి చేస్తాం: ఆ దేశాధ్యక్షుడి హెచ్చరిక!

ఈ నేపథ్యంలో బెలారస్‌ అధ్యక్షుడు లుకషెంకో ప్రభుత్వ రంగ వార్తాసంస్థ బెల్టాతో మాట్లాడుతూ తమపై దాడి చేస్తే నాటో దేశాలపై అణ్వాయుధ దాడికి దిగుతామని హెచ్చరించారు.

By:  Tupaki Desk   |   18 Aug 2023 1:04 PM GMT
నాటో దేశాలపై అణ్వాయుధ దాడి చేస్తాం: ఆ దేశాధ్యక్షుడి హెచ్చరిక!
X

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమై 540 రోజులు దాటిపోయింది. అయినా ఇంతవరకు దీనికి శుభం కార్డు పడలేదు. మొదట్లో రష్యా దళాల దాడికి వెంటనే లొంగిపోయేలా కనిపించింది.. ఉక్రెయిన్‌. అయితే అమెరికా, బ్రిటన్, తదితర దేశాలు అందిస్తున్న ఆయుధాలతో గట్టిగానే రష్యాపైన పోరాటం చేస్తోంది. రష్యా నుంచి తమ నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా తిరిగి చేజిక్కించుకుంటోంది.

అమెరికా, బ్రిటన్‌ తో సహా నాటో దేశాలన్నీ ఉక్రెయిన్‌ కు అండగా నిలుస్తుండగా ఒక్క బెలారస్‌ మాత్రమే రష్యాకు సాయం అందిస్తోంది. బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కు అత్యంత సన్నిహితుడు. ఈ నేపథ్యంలో రష్యా దళాలకు లాంచింగ్‌ ప్యాడ్‌ గా బెలారస్‌ వ్యవహరిస్తోంది.

మరోవైపు బెలారస్, రష్యాలకు పొరుగుదేశాలైన లిథువేనియా, పోలండ్, లాత్వియా వంటి దేశాలు నాటో కూటమిలో ఉన్నాయి. ఇవి ఎప్పటికైనా తమకు ముప్పుగా పరిణమిస్తాయని రష్యా, బెలారస్‌ భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో ఆ దేశాలకు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.

తమపై విదేశీ దాడులు జరిగితే ఆయా దేశాలపై అణ్వాయుధాలను ప్రయోగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. లుకషెంకో హెచ్చరికలకు కారణం కూడా ఉంది. రష్యా కొంతమేరకు అణ్వాయుధాలను ఇటీవల బెలారస్‌ తరలించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఇలా చేసింది. నాటో దేశాలు తమపై దాడి చేస్తే వాటిని అణ్వాయుధాలతో బెదిరించడానికి బెలారస్‌ లో అణ్వాయుధాలను ఉంచింది.

రష్యా, బెలారస్‌ దేశాల సరిహద్దుల్లో నాటో దళాల మోహరింపులు, కవ్వింపులతో ఆ దేశాల సరిహద్దులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో బెలారస్‌ అధ్యక్షుడు లుకషెంకో ప్రభుత్వ రంగ వార్తాసంస్థ బెల్టాతో మాట్లాడుతూ తమపై దాడి చేస్తే నాటో దేశాలపై అణ్వాయుధ దాడికి దిగుతామని హెచ్చరించారు.

ఉక్రెయిన్‌ సేనలు తమ హద్దులు దాటనంత వరకూ బెలారస్‌ ఈ యుద్ధంలో భాగస్వామి కాదని లుకషెంకో పేర్కొన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ తమ మిత్రదేశమైన రష్యాకు మాత్రం సాయం చేయడం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.

ఈ క్రమంలో నాటో దేశాలైన పోలాండ్, లిథువేనియా, లాత్వియా వంటి దేశాలు కవ్విస్తే బెలారస్‌ తన వద్ద ఉన్న అణ్వాయుధాలతో సహా సర్వశక్తులతో స్పందించకతప్పదన్నారు.. అంతేకానీ, తాము భయపడి దాక్కోవడం, ఎదురు చూడటం వంటివి చేయబోమని తెలిపారు. "మేము ఎవరినో బెదిరించడానికి ఇక్కడికి అణ్వాయుధాలు తీసుకురాలేదు. కానీ, అవి ప్రత్యర్థులను బాగా భయపెడతాయన్నది నిజం.. అందుకే మాపై దాడి మొదలుపెట్టిన తక్షణమే వాటిని వాడతాం" అని లుకషెంకో వెల్లడించారు.

కాగా రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బెలారస్‌.. రష్యాకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది. అంతేకాకుండా రష్యాతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలను కూడా నిర్వహించింది. వాస్తవానికి అప్పుడే బెలారస్‌ కూడా రష్యాతో కలిసి యుద్ధంలోకి దిగుతుందని భావించారు. అయితే బెలారస్‌ యుద్ధంలోకి దిగకుండా రష్యాకు మద్దతు మాత్రమే ఇచ్చింది. ఈ నేపథ్యంలో బెలారస్‌ దేశాధ్యక్షుడు అలెగ్జాండ్‌ లుకషెంకో తాజా హెచ్చరికలు చర్చకు కారణమయ్యాయి.