Begin typing your search above and press return to search.

ఫ్రెండ్ చెప్పాడని థ్రిల్ కోసం డ్రగ్స్.. డోస్ ఎక్కువై చచ్చిపోయింది!

థ్రిల్ కోసం డ్రగ్స్ తీసుకున్న పద్దెనిమిదేళ్ల అమ్మాయి.. డోస్ ఎక్కువైన కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంది. విన్నంతనే అయ్యో అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే

By:  Tupaki Desk   |   11 April 2024 4:41 AM GMT
ఫ్రెండ్ చెప్పాడని థ్రిల్ కోసం డ్రగ్స్.. డోస్ ఎక్కువై చచ్చిపోయింది!
X

చెప్పేవాళ్లు చెబుతుంటారు. మన బుద్ధి ఏమైందన్నది ప్రశ్న. క్షణిక ఆనందం కోసం.. థ్రిల్ తో వచ్చే సంతోషం కోసం నానాపాట్లుపడుతున్న ఇప్పటి యువత కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. తాజా ఉదంతం గురించి తెలిస్తే అయ్యో అనుకోకుండా ఉండలేం. అంతేకాదు.. ఇలా స్నేహితుల థ్రిల్ మాటల ఉచ్చులో పడితే ఎంతటి ముప్పు పొంచి ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. థ్రిల్ కోసం డ్రగ్స్ తీసుకున్న పద్దెనిమిదేళ్ల అమ్మాయి.. డోస్ ఎక్కువైన కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంది. విన్నంతనే అయ్యో అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన పద్దెనిమిదేళ్ల యువతి బెంగళూరులో ఒక ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తోంది. సెలవుల్లో భాగంగా ఏప్రిల్ మూడున లక్నోలోని ఇంటికి వచ్చింది. తిరిగి ఏప్రిల్ 7న ఇంటి నుంచి బెంగళూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో ఆమె తన స్నేహితుడైన వివేక్ మౌర్యను కలిసింది. వారిద్దరు కలిసి డ్రగ్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. డ్రగ్స్ తో వచ్చే కిక్కు కోసం వారిద్దరూ ఒక ఖాళీ ప్లాట్ కు వెళ్లారు.

డ్రగ్స్ తో వచ్చే థ్రిల్ గురించి చెబుతూ.. ఆమెకు సిరింజిని ఇంజెక్టు చేశాడు. డ్రగ్స్ మోతాదు ఎక్కువ కావటంతో ఆ అమ్మాయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో భయపడిన సదరు యువకుడు తాను డ్రగ్స్ మత్తులో ఉండటంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సాయం కోరారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వారిద్దరిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. అక్కడ చికిత్స పొందుతూ ఆ యువతి మరణించింది.

ఈ సంగతి తెలుసుకున్న యువకుడు భయంతో ఆసుపత్రి నుంచి పారిపోయాడు. దీంతో పోలీసులు మళ్లీ రంగంలోకి దిగి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. తమ కుమార్తె మరణానికి కారణమైన ఆ యువకుడ్ని శిక్షించాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. తమ కుమార్తెను కావాలనే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ ఉదంతంపై విచారిస్తున్న పోలీసులు.. తమ విచారణ పూర్తి తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు. థ్రిల్ కోసం తప్పుడు పనులు చేసే వారికి చివరకు విషాదమే మిగులుతుందన్నది మర్చిపోకూడదు.