Begin typing your search above and press return to search.

చిన్న వయస్సులోనే బిలియనీర్.. సొంతంగా సంపాదించిన లారా..

లారా కథ ఒక సాధారణ విజయగాథ కాదు. ఇది కళ, విజ్ఞానం, వ్యాపార దృష్టి అనే మూడు విభిన్న రంగాల కలయికతో రూపుదిద్దుకున్న అసాధారణ ప్రయాణం.

By:  Tupaki Political Desk   |   4 Dec 2025 7:00 PM IST
చిన్న వయస్సులోనే బిలియనీర్.. సొంతంగా సంపాదించిన లారా..
X

లువానా లోప్స్ లారా 29 ఏళ్లకే బిలియనీర్.. ఒక స్పూర్తిదాయక గాథ

‘కోరుకున్న రంగంలో ఎదగాలంటే.. వయసు అడ్డంకి కాదు, ఆలోచనలే భవిష్యత్తును మలుస్తాయి’ అన్న మాటలను నిజం చేసిన యువతి ఆమె. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన స్వయంకృషి బిలియనీర్‌గా నిలిచిన ఈ బ్రెజిలియన్ యువ పారిశ్రామికవేత్త, కేవలం 29 ఏళ్లకే లక్ష కోట్ల విలువైన కంపెనీని నిర్మించి చరిత్ర సృష్టించింది.

ఇదొక అసాధారణ విజయం..

లారా కథ ఒక సాధారణ విజయగాథ కాదు. ఇది కళ, విజ్ఞానం, వ్యాపార దృష్టి అనే మూడు విభిన్న రంగాల కలయికతో రూపుదిద్దుకున్న అసాధారణ ప్రయాణం. చిన్ననాటి నుంచే ఆమెకు కఠినమైన శిక్షణ, పట్టుదల, క్రమశిక్షణ అలవాటయ్యాయి. బోల్షోయ్ థియేటర్ స్కూల్‌లో బ్యాలెట్ శిక్షణ పొందిన లారా, ఆస్ట్రియాలో ప్రొఫెషనల్ డ్యాన్సర్‌గా ప్రదర్శనలు ఇచ్చింది. అదే సమయంలో మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్‌లలో పతకాలు సాధించి, విద్యలోనూ రాణించింది.

ఉన్నత చదువులు..

ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి MITలో కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్ లో డిగ్రీలు పూర్తి చేసుకుంది. అక్కడే ఆమె ఆర్థిక రంగంలోని అగ్రశ్రేణి సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌లు చేసి, క్వాంటిటేటివ్ ట్రేడింగ్‌లో అనుభవాన్ని సొంతం చేసుకుంది. ఈ అనుభవమే ఆమెకు వ్యాపార ఆలోచనలకు పునాది వేసింది.

2018లో తారెక్ మన్సూర్‌తో కలిసి స్థాపించిన కాల్షి అనే ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్‌ఫారమ్, రియల్ వరల్డ్ సంఘటనల ఫలితాలపై ప్రజలకు ట్రేడింగ్ చేసే అవకాశం కల్పించింది. అమెరికా ఎన్నికల ట్రేడింగ్‌కు సంబంధించిన కీలక దావాలో విజయం దక్కించుకొని కాల్షి ఎదుగుదలకు మలుపు తీసుకువచ్చింది. 2025, డిసెంబర్ నాటికి ఆమె కంపెనీ విలువ 11 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో, లారాకు ఉన్న 12% వాటా ఆమెను ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన స్వయంకృషితో ఎదిగిన బిలియనీర్‌గా నిలిపింది.

యువతకు పెద్ద సందేశం..

లారా విజయం కేవలం వ్యక్తిగత ఘనత కాదు. ఇది యువతకు ఒక సందేశం ప్రతిభ, కృషి, పట్టుదల ఉంటే వయసు అడ్డు కాదు. కళలలోనూ, విజ్ఞానంలోనూ, వ్యాపారంలోనూ సమానంగా రాణించగల సామర్థ్యం ఉన్నవారు ప్రపంచ వేదికపై తమ ముద్ర వేయగలరు. లారా కథ, ప్రతి కలలుగన్న యువతకు ఒక ప్రేరణగా నిలుస్తుంది.

క్రమ శిక్షణతోనే ఇంతటి విజయం..

ఈ విజయగాథలో రెండు ముఖ్యమైన అంశాలు కనిపిస్తాయి. మొదటిది క్రమశిక్షణ. బ్యాలెట్ శిక్షణలో పొందిన క్రమశిక్షణ, ఆమెను వ్యాపారంలోనూ కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా చేసింది. రెండవది సాహసం. కొత్త ఆలోచనను ప్రపంచానికి పరిచయం చేయడం, చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొని గెలవడం, ఇవన్నీ సాహసమని చెప్పవచ్చు. భారతీయ యువతకు లారా కథ ఒక స్ఫూర్తి దాయక పాఠం. గ్లోబల్ స్థాయిలో అవకాశాలు విస్తరిస్తున్న ఈ కాలంలో, నైపుణ్యం, ధైర్యం ఉంటే ఏ రంగంలోనైనా కొత్త చరిత్ర రాయవచ్చు. అమెరికా, యూరప్, ఆసియా ఎక్కడైనా ప్రతిభను నిరూపించగల సామర్థ్యం ఉన్నవారికి ప్రపంచం తలుపులు తెరిచి ఉంది.