Begin typing your search above and press return to search.

భార్య మృతికి భర్తే కారణమని వేధింపులు.. మనస్తాపంతో భర్త సూసైడ్

ప్రేమపెళ్లి.. అంతలోనే కుటుంబ కలహాలు.. చాలా కుటుంబాల్లో కనిపించేదే. కాకుంటే.. దాన్ని డీల్ చేసే విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తుంటారు.

By:  Tupaki Desk   |   27 May 2025 10:55 AM IST
భార్య మృతికి భర్తే కారణమని వేధింపులు.. మనస్తాపంతో భర్త సూసైడ్
X

ప్రేమపెళ్లి.. అంతలోనే కుటుంబ కలహాలు.. చాలా కుటుంబాల్లో కనిపించేదే. కాకుంటే.. దాన్ని డీల్ చేసే విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తుంటారు. కొందరు రాజీ పడితే.. మరికొందరు తీవ్రమైన నిర్ణయాలు తీసుకొని తమ సంతానానికి తీరని కష్టాన్ని కలిగేలా చేస్తారు. గొడవలు ఏ కుటుంబంలో ఉండవు. అంత మాత్రానికే బలవన్మరణాలకు పాల్పడటం ద్వారా.. తమ సంతానానికి తీరని నష్టాన్ని కలిగిస్తున్నామన్న విషయాన్ని మర్చిపోతుంటారు. ఇప్పుడు చెప్పే ఉదంతం ఈ కోవకు చెందిందే. ఇందులో భార్య మాత్రమే కాదు భర్త కూడా అదే తీరులో ప్రవర్తించటం.

చౌటుప్పల్ మండలం కొయ్యలగూడానికి చెందిన 42 ఏళ్ల భాస్కర్ చేనేత కార్మికునిగా పని చేస్తాడు. కొన్నేళ్ల క్రితం తమ ఊరికే చెందిన నవ్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. పెళ్లి తర్వాత కొన్నేళ్లకు వీరి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. అవి ఇటీవల కాలంలో పెరిగి పెద్దవి అయ్యాయి.

ఇటీవల జరిగిన గొడవలతో తీవ్ర మనస్తాపానికి గురైన నవ్య ఇంట్లోని చేనేత వస్త్రాలకు అద్దే నైట్రేట్ ను తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో.. ఆమె తరపు కుటుంబ సభ్యులు భర్త.. ఆడపడుచు వరకట్నం కోసం వేధింపులకు గురి చేశారని.. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదుచేశారు. ఇది సరిపోదన్నట్లు నవ్య బంధువులు కూడా మానసిక వేధింపులకు గురి చేయటం మొదలు పెట్టారు.

ఈ ఒత్తిళ్లను తట్టుకోలేని భాస్కర్ తాజాగా నైట్రేట్ ద్రావణాన్ని తాగి సూసైడ్ చేసుకున్నాడు. తెల్లారిన తర్వాత ఎంత సేపటికి కొడుకు నిద్ర లేవకపోవటంతో అతడి గదిలోకి వెళ్లిన భాస్కర్ తల్లి కొడుకు సూసైడ్ చేసుకున్న విషయాన్ని గుర్తించారు. తల్లి ఆత్మహత్యతో ఒంటరైన పిల్లలు.. ఇప్పుడు తండ్రి కూడా సూసైడ్ చేసుకోవటంతో వారు అనాధలు అయ్యారు. ఈ ఉదంతంలో తల్లిదండ్రులు ఇద్దరు తమ పిల్లల బాధ్యతను మరిచి.. బలవన్మరణాలకు పాల్పడటం ద్వారా వారికి తీరని ద్రోహం చేశారని చెప్పక తప్పదు.