Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేలుగా అక్కడ ఓడితే.. ఎమ్మెల్సీలు కావడం

తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో నామినేటెడ్ పదవుల నియామకం మొదలుకానుంది.

By:  Tupaki Desk   |   19 Jan 2024 12:30 PM GMT
ఎమ్మెల్యేలుగా అక్కడ ఓడితే.. ఎమ్మెల్సీలు కావడం
X

తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో నామినేటెడ్ పదవుల నియామకం మొదలుకానుంది. దీనికిముందు రెండు శాసన మండలి ఖాళీలకు ఎన్నికలు జరగనుండడం.. అవి కూడా కాంగ్రెస్ కే దక్కనుండడం డబుల్ బొనాంజా అయింది. వాస్తవానికి ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలు బీఆర్ఎస్ వే. జనగామ నుంచి గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, హుజూరాబాద్ నుంచి నెగ్గిన పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీలుగా రాజీనామా చేయడంతో తాజా ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే, ఈ రెండు స్థానాలకు విడివిడిగా ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించడం అనూహ్యంగా కాంగ్రెస్ కు కలిసివచ్చింది. తద్వారా.. శాసన సభలో మెజార్టీ సీట్లున్న పార్టీగా రెండు ఎమ్మెల్సీ స్థానాలనూ కైవసం చేసుకునే అవకాశం దక్కింది.

తెలంగాణ ఉద్యమ గడ్డ

తెలంగాణ మలి దశ ఉద్యమంలో అత్యంత కీలకంగా నిలిచింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఇక్కడి హుజూరాబాద్ నియోజకవర్గం మరింత ప్రత్యేకమైనది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్ ను గెలిపించింది. మొదట కమలాపూర్ తర్వాత హుజూరాబాద్ గా మారిన ఈ నియోజకవర్గంలో 2021 వరకు మరో నాయకుడు గెలవలేదు. అయితే, 2021లో ఈటల బీజేపీ నుంచి నెగ్గి హుజూరాబాద్ పై తన పట్టును చాటుకున్నారు. కానీ, ఇటీవలి ఎన్నికల్లో అనూహ్యంగా పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు.

అప్పుడు ఆయన.. ఇప్పుడు ఈయన

ఈటలపై ఉప ఎన్నికలో ఓటమి అనంతరం కౌశిక్ రెడ్డిని 2021 నవంబరులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీని చేసింది. కాగా, ఇటీవలి ఎన్నికల్లో ఆయన గెలుపుతో రాజీనామా సమర్పించారు. వీరిద్దరి మధ్యలో 2021 ఉప ఎన్నిక సందర్భంగా వినిపించిన పేరు బల్మూరి వెంకట్. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడైన వెంకట్.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేవలం 3 వేల ఓట్లను మాత్రమే తెచ్చుకోగలిగారు. ఇటీవలి ఎన్నికల్లో వొడితెల ప్రణవ్ కు టికెట్ దక్కడంతో పోటీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు వెంకట్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నారు.

ఇద్దరూ ఎమ్మెల్యేల కోటాలోనే..

ఒకే నియోజకవర్గానికి చెందిన కౌశిక్ రెడ్డి, బల్మూరి వెంకట్ ఇద్దరూ ఎమ్మెల్యేల కోటాలోనే ఎమ్మెల్సీలుగా అవకాశం పొందడం గమనార్హం. అందులోనూ హుజూరాబాద్ లో పోటీ చేసి ఓడిపోయిన అనంతరం ఈ అవకాశం రావడం అనుకోకుండా జరిగినదనే అనుకోవాలి. అంటే.. హుజూరాబాద్ లో పోటీ చేసి ఓడినవారికి ఎమ్మెల్సీ ఖాయం అని అనుకోవాలన్న మాట.