అమెరికాలో రెచ్చిపోయిన నిరసనకారులు.. లాస్ ఏంజిల్స్ అల్లర్లలో ఆపిల్ స్టోర్ లూటీ
లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్న ఈ నిరసనలు మొదట శాంతియుతంగానే మొదలయ్యాయి.
By: Tupaki Desk | 11 Jun 2025 9:35 AM ISTఅమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరం ప్రస్తుతం అల్లర్లలో అట్టుడుకుతోంది. అక్రమ వలసదారులను బహిష్కరించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ లాస్ ఏంజలెస్‌లో పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు ఐదు రోజులుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీసంఖ్యలో నిరసన కారులను అరెస్ట్ చేశారు. నిరసనలను అదుపు చేసేందుకు లాస్ ఏంజిల్స్ లో 2100 మంది నేషనల్ గార్డ్ దళ సభ్యులతోపాటు 700మంది మెరైన్ దళ సభ్యులను మోహరించారు. ఈ నిరసనలు చివరికి హింసాత్మకంగా మారిపోయాయి. ఆపిల్ స్టోర్ సహా చాలా దుకాణాలను లూటీ చేశారని వార్తలు వస్తున్నాయి.
లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్న ఈ నిరసనలు మొదట శాంతియుతంగానే మొదలయ్యాయి. కానీ క్రమంగా అవి పోలీసులతో ఘర్షణలకు దారితీశాయి. రాత్రిపూట పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ అల్లర్లలో ప్రజలు దారుణంగా ప్రవర్తిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను చూస్తే అర్థం అవుతుంది. ఆపిల్ స్టోర్‌తో పాటు జోర్డాన్ ఫ్లాగ్‌షిప్ స్టోర్ లాంటి పెద్ద పెద్ద షాపులను కూడా దోచుకుంటున్నారు. సూపర్ మార్కెట్లను కూడా లూటీ చేస్తున్నారు.
ఈ అల్లర్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిల్లో కొందరు ముసుగు వేసుకున్న నిరసనకారులు ఆపిల్ స్టోర్‌లోకి వెళ్లి గాడ్జెట్‌లను దోచుకుంటున్నట్లు కనిపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరంతా దుకాణాల అద్దాలను పగలగొట్టి, లోపలికి చొరబడి వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. షాపుల ముందు భాగాలను వారంతా టార్గెట్ చేసుకుని దాడులు నిర్వహిస్తున్నారు.పోలీసులు అక్కడికి చేరుకునేలోపు చాలా మంది స్టోర్ నుంచి వెళ్లిపోయారు.
ఈ నిరసనల కారణంగా లాస్ ఏంజిల్స్‌లో ఇప్పటివరకు 100 మందికి పైగా అరెస్టయ్యారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా సీరియస్‌గా చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో భద్రతను పెంచడం కోసం అదనంగా సైనికులను పంపించడానికి ట్రంప్ అనుమతి ఇచ్చారు. ఈ పరిస్థితుల వల్ల అక్కడి వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారి దుకాణాలు ధ్వంసం కావడం, వస్తువులు పోవడం వల్ల భారీగా నష్టాలు చవిచూస్తున్నారు. అదేసమయంలో నగరంలో నివసిస్తున్న ప్రజలు తమ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.