షాకింగ్... టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిన మరో విమానం!
అవును... లండన్ లోని సౌథెండ్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం క్రాష్ అయ్యింది.
By: Tupaki Desk | 14 July 2025 11:51 AM ISTఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా ప్రమాదం ఇంకా కళ్ల ముందు కదలాడుతున్న వేళ మరో విమాన ప్రమాదం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... లండన్ లో మరో విమానం టెకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ సమయంలో పెద్ద శబ్ధంతో మంటలు వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. అయితే.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
అవును... లండన్ లోని సౌథెండ్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం క్రాష్ అయ్యింది. దీంతో... సౌథెండ్ విమానాశ్రయం అన్ని కార్యకలాపాలను నిలిపివేసింది. తదుపరి నోటీసు వచ్చేవరకు విమానాశ్రయానికి వచ్చే, వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసినట్లు అధికారులు ధృవీకరించారని స్థానిక మీడియా వెల్లడించింది.
ఈ ప్రమాదానికి గురైన విమానాన్ని నెదర్లాండ్స్ లోని జ్యూష్ ఏవియేషన్ నిర్వహిస్తోందని.. ఇది ఆదివారం గ్రీస్ లోని ఏథెన్స్ నుండి క్రొయేషియాలోని పులాకు నుంచి సౌథెండ్ కు వెళ్లాల్సి ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం నెదర్లాండ్స్ లోని లెలిస్టాడ్ కు తిరిగి రావాల్సి ఉందని అంటున్నారు.
జ్యూష్ ఏవియేషన్ తన సుజి1 విమానం ప్రమాదంలో చిక్కుకుందని ధృవీకరించింది. ఇదే సమయంలో దర్యాప్తుకు కంపెనీ ఆదేశించింది. అయితే ప్రమాదానికి గురైన విమానం బీచ్ క్రాఫ్ట్ బీ200 సూపర్ కింగ్ ఎయిర్ అని, రోగులను రవాణా చేయడానికి వైద్య వ్యవస్థలను కలిగి ఉందని చెబుతున్నారు. ఇది 12 మీటర్లు పొడవున్న టర్బోప్రాప్ విమానం అని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తదుపరి నోటీసు వచ్చే వరకు కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ఎసెక్స్ లోని లండన్ సౌథెండ్ విమానాశ్రయం తెలిపింది. పోలీసులు, అత్యవసర సేవలు, విమాన ప్రమాద దర్యాప్తు అధికారులు ఈ సంఘటనకు హాజరవుతున్నందున అన్ని విమానాలను రద్దు చేసినట్లు లండన్ సౌథెండ్ విమానాశ్రయం ఎక్స్ లో వెల్లడించింది.
ఇదే సమయంలో... విమాన ప్రమాదం తర్వాత నాలుగు అంబులెన్స్ లు, సహాయ సిబ్బందిని పంపినట్లు తూర్పు ఇంగ్లాండ్ అంబులెన్స్ సర్వీస్ తెలిపింది. అయితే... కూలిపోయిన విమానంలో ఎంతమంది ఉన్నారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. మృతుల సంఖ్యపై ఇంకా ఎటువంటి సమాచారం లేదని అంటున్నారు.
