Begin typing your search above and press return to search.

లోకేష్ అడుగులు ఏపీ వైపు పడతాయా ...?

ఇక ఢిల్లీ నుంచి లోకేష్ ఏపీకి కదలి వస్తే టీడీపీకి జోష్ వస్తుందని సైకిల్ పరుగులు తీస్తుందని అంటున్నవారు ఉన్నారు.

By:  Tupaki Desk   |   3 Oct 2023 4:47 PM GMT
లోకేష్  అడుగులు ఏపీ వైపు పడతాయా ...?
X

నారా లోకేష్ ఢిల్లీలోనే గడచిన ఇరవై రోజులుగా గడుపుతున్నారు. ఆయన చంద్రబాబు కేసు విషయంలో న్యాయ వాదులతో చర్చిస్తున్నారు అని టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం సాగింది. ఇపుడు చంద్రబాబు కేసు సుప్రీం కోర్టులో విచారణ దశలో ఉంది. ఉద్ధండులైన న్యాయవాదులు వాదిస్తున్నారు.

దాంతో ఈ కేసు విషయంలో నారా లోకేష్ చేయాల్సింది ఏమీ లేదు అనే అంటున్నారు. మరో వైపు ఆయనకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఢిల్లీ వెళ్ళి మరీ నోటీసులు ఇచ్చింది సీబీఐ. దాంతో ఆయన విచారణ మామూలుగా అయితే అక్టోబర్ 4న విజయవాడ సీఐడీ వద్ద సాగాలి.

దాని మీద హై కోర్టులో పిటిషన్ వేసిన కారణంగా ఆయనకు మరికొంత ఊరట దక్కింది. ఈ కేసులో సీఐడీ విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేస్తూ హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాంతో లోకేష్ కి ఇపుడు ఏ విధమైన ఇబ్బందులు లేవు. ఆయన ఎంచక్కా ఢిల్లీ నుంచి బయల్దేరి ఏపీకి రావచ్చు.

మరి లోకేష్ ఏపీకి వస్తారా అన్నదే చర్చగా ఉంది. ఇక్కడ గల్లీలో తెలుగుదేశం క్యాడర్ దీక్షలు చేస్తోంది. పోరాడుతోంది. మరి లోకేష్ కూడా గల్లీలో ఉంటూ వారికి సరైన దిశా నిర్దేశం చేస్తే బాగుంటుంది అని అంతా అంటున్నారు. లోకెష్ పాదయాత్ర సెప్టెంబర్ 29న మొదలెడతారు అని పార్టీ స్వయంగా ప్రకటించింది. కానీ అది అర్ధాంతరంగా ఆగింది.

ఇపుడు మళ్లీ పాదయాత్రకు లోకేష్ ఓకే చెబుతారా అన్నది మరో చర్చగా ఉంది. ఎందుకంటే వారం రోజుల దాకా కోర్టు పరంగా ఎలాంటి అప్ డేట్స్ లేవు అంటున్నారు. చంద్రబాబు కేసు అక్టోబర్ 9న విచారణకు వస్తే లోకేష్ అక్టోబర్ పదిన సీఐడీ ముందు హాజరవుతారు. అలా ఆయనకు విలువైన సమయం మిగిలింది.

ఇక ఢిల్లీ నుంచి లోకేష్ ఏపీకి కదలి వస్తే టీడీపీకి జోష్ వస్తుందని సైకిల్ పరుగులు తీస్తుందని అంటున్నవారు ఉన్నారు. అయితే లోకేష్ ఢిల్లీ నుంచి ఇప్పట్లో వచ్చేలా కనిపించడంలేదు అన్న మరో ప్రచారం కూడా ఉంది. క్వాష్ పిటిషన్ లో బాబుకు అనుకూలంగా తీర్పు రాకపోతే బెయిల్ పిటిషన్ కూడా అత్యున్నత న్యాయ స్థానం దాకా వసే అపుడు ఏం జరుగుతుంది అన్న చర్చ కూడా ఉంది.

దాంతో పాటు లోకేష్ కి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఉపశమనం దక్కినా ఫైబర్ నెట్ కేసు ఉండనే ఉంది అంటున్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా లోకేష్ పాత్ర ఉంది అని సీఐడీ అధికారులు చెబుతున్నారు. దాంతో ఒక కేసులో కాకున్నా మరో కేసులో అయినా ఆయనను అరెస్ట్ చేస్తారని ప్రచారం అయితే గట్టిగా ఉంది అంటున్నారు. దాంతో లోకేష్ ఇప్పట్లో ఢిల్లీని వదిలి రారు అన్న వారూ ఉన్నారు.

ఏది ఏమైనా జనంలో ఉంటూ పోరాటం చేస్తూ వారి మధ్యన అరెస్ట్ అయితే ఆ కిక్కే వేరు అన్నది చినబాబుకు సూచిస్తున్న వారూ ఉన్నారు. మరి రాజమండ్రిలో తల్లి భువనేశ్వరి భార్య బ్రాహ్మణి ఉన్నారు. భువనేశ్వరి అయితే తాము చెట్టుకొకరం అయిపోయామని ఆవేదన చెందుతున్నారు.

లోకేష్ అయితే అరెస్ట్ కాలేదు, జైలుకు వెళ్లలేదు. ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. సో ఆయన ఏపీకి వస్తే తల్లి బాసటగా కూడా ఉంటారని అంటున్నారు. మరి చినబాబు అడుగులు ఏపీ వైపు పడతాయా అంటే వేచి చూడాల్సిందే అంటున్నారు.