Begin typing your search above and press return to search.

తెనాలి విషయంలో చినబాబు ఓపెన్ అయిపోయారా?

ఈ నేపథ్యంలో నారా లోకేష్ తాజాగా ఈ విషయాంపై స్పష్టత ఇచ్చినట్టు కథనాలొస్తున్నాయి. ఈ క్రమంలో గుంటూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆలపాటిని పోటీ చేయాలని లోకేష్ సూచించారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   21 Feb 2024 7:17 AM GMT
తెనాలి విషయంలో చినబాబు ఓపెన్ అయిపోయారా?
X

ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా ఇప్పటికీ సీట్ల సర్దుబాట్లపై క్లారిటీ రాలేదనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో అటు చంద్రబాబు, ఇటు పవన్ లు ఎవరికి వారు సీట్లు ప్రకటించేసుకుంటున్న పరిణామాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో తెనాలి టిక్కెట్ విషయంలో చినబాబు ఒక క్లారిటీకి వచ్చేశారని చెబుతున్నారు.

అవును... టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా తమ్ముళ్ల త్యాగాలు తప్పవనే చర్చ గతకొంతకాలంగా బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విచిత్రంగా టీడీపీ కంచుకోట లాంటి స్థానాల్లో తమ్ముళ్లకు హ్యాండ్ ఇస్తూ.. ఆ టిక్కెట్లను జనసేనకు కేటాయిస్తున్నారనే చర్చ తెరపైకి రావడంతో... ఇది టీడీపీ ఆత్మహత్యా సదృశ్యమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తుంది. ఈ క్రమంలో టీడీపీ ఇటువంటి నిర్ణయాలే తీసుకుందని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో... తెనాలి అసెంబ్లీ టిక్కెట్ విషయంలో టీడీపీ సమర్పించేసుకుందని అంటున్నారు! ఈ క్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఆశలు అడియాసలయ్యాయనే చర్చ తెరపైకి వచ్చేసింది. పొత్తులో భాగంగా ఆయనకు టికెట్‌ లేదని సాక్షాత్తూ నారా లోకేష్ తేల్చి చెప్పేశారనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తుంది. వాస్తవానికి ఇక్కడ నాదెండ్ల మనోహర్ కంటే ఆలపాటికే కొన్ని సర్వే ఫలితాలు పాజిటివ్ గా వచ్చాయని గతంలో చర్చ జరిగింది. స్థానికంగా ఈ విషయంపై తమ్ముళ్లు టిక్కెట్ కోసం బలంగా పోరాడే ప్రయత్నం కూడా చేశారు!

గెలిచే టిక్కెట్ ను చేజేతులా పాడుచేసుకోవద్దని అధినేతకు చిన్నపాటి హెచ్చరికలు కూడా జారీచేసినట్లు వార్తలొచ్చాయి. అయినప్పటికీ పవన్ కల్యాణ్ ఒత్తిడితో పాటు.. నాదేండ్ల మాటను బాబు, చినబాబు కాదనే పరిస్థితి ఇప్పుడు టీడీపీలో లేదని అంటున్నారు. దీంతో... 2024 ఎన్నికలకు టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తెనాలి నుంచి జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పూర్తిస్థాయిలో రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తుంది.

వాస్తవానికి.... తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాదెండ్ల మనోహర్‌ పోటీచేస్తారని, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రెండు నెలల క్రితమే మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో స్పష్టం చేశారు. అంతకు ముందే ఈ విషయంలో అనధికారికంగా మనోహర్ కూడా నియోజకవర్గంలో క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. అయితే... చివరి నిముషంలో తనకే టికెట్‌ వస్తుందని ఆలపాటి చాలా ఆశలుపెట్టుకున్నారనే చర్చ నడిచింది.

ఈ నేపథ్యంలో నారా లోకేష్ తాజాగా ఈ విషయాంపై స్పష్టత ఇచ్చినట్టు కథనాలొస్తున్నాయి. ఈ క్రమంలో గుంటూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆలపాటిని పోటీ చేయాలని లోకేష్ సూచించారని అంటున్నారు. అయితే ఈలోపే... బుర్రిపాలెంకు చెందిన ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరు ఎంపీ స్థానానికి పోటీచేసేందుకు సన్నాహాల్లో ఉన్నారని.. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల పవన్ తోనూ భేటీ అయ్యారని అంటున్నారు! దీంతో... ఆలపాటివారికి ఈసారికి ఫుల్ రెస్ట్ అని అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు, అభిమానులు నాదేండ్లకు ఏ మేరకు సపోర్ట్ చేస్తారనేది వేచి చూడాలి!