Begin typing your search above and press return to search.

ఓవర్ టూ ఢిల్లీ : గేర్ మార్చిన లోకేష్!

ఇక లోకేష్ తన మకాం రాజకీయ కార్యక్షేత్రాన్ని రాజమండ్రి నుంచి ఢిల్లీకు మార్చుతున్నారు.

By:  Tupaki Desk   |   15 Sep 2023 3:00 AM GMT
ఓవర్ టూ ఢిల్లీ : గేర్ మార్చిన లోకేష్!
X

టీడీపీ అధినేత చంద్రబాబును జైలులో కలసిన ములాఖత్ ఫలితం వెంటనే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన వెంటనే పొత్తుల ప్రకటన చేశారు. ఇక చంద్రబాబు తనయుడు టీడీపీ రాజకీయ వారసుడు నారా లోకేష్ కి ములాఖత్ సందర్భంగా పూర్తి స్థాయిలో బాబు డైరెక్షన్ ఇచ్చినట్లుగా ఉంది.

దాంతో ఇంతకాలం తండ్రి అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో ఉంటే దానికి కూతవేటు దూరంలో ఒక నివాసం తీసుకుని లోకేష్ ఉంటూ వస్తున్నారు. అలా గత నాలుగు రోజులుగా రాజమండ్రిని టీడీపీ కేంద్ర స్థానంగా చేసుకుని లోకేష్ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించారు.

అదే విధంగా పవన్ కళ్యాణ్ రాకతో ఆయన్ని వెంటబెట్టుకుని బాబు వద్దకు వెళ్లి మరీ ములాఖత్ ద్వారా పొత్తుల ప్రకటన కూడా వచ్చేలా చూశారు. ఇక బాబు జైలులో ఉండగా లోకేష్ నే డైరెక్ట్ గా అన్ని పార్టీల నేతలు సంప్రదిస్తున్నారు.

ఒక వైపు బాలయ్య ఉన్నా కానీ లోకేష్ బాబు వారసుడు అని టీడీపీకి బయట పార్టీ వారికి కీలక నేతలకు ప్రముఖులకు అర్ధం అయింది. అందుకే అందరూ ఆయనకే ఫోన్ చేస్తున్నారు. పార్టీ మొత్తం అంతా లోకేష్ వెంట తిరుగుతోంది. ఇక లోకేష్ తన మకాం రాజకీయ కార్యక్షేత్రాన్ని రాజమండ్రి నుంచి ఢిల్లీకు మార్చుతున్నారు.

ఇక లోకేష్ గురువారం రాత్రి అర్జంటుగా ఢిల్లీ బయల్దేరివెళ్ళారని తెలుస్తోంది. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అయిదు రోజుల పాటు జరగనున్నాయి. ఆ సమావేశాలలో టీడీపీ ఎంపీలు అనుసరించాల్సిన వైఖరిని నారా లోకేష్ దిశా నిర్దెశం చేస్తారని అంటున్నారు.అంతే కాదు చంద్రబాబు అరెస్ట్ మీద లోక్ సభలో టీడీపీ ఎంపీలు చర్చకు లేవనెత్తేలా లోకేష్ డైరెక్షన్స్ ఇస్తారని అంటున్నారు. అదే కనుక జరిగితే మొత్తం జాతీయ స్థాయిలో ఈ అంశం చర్చకు వస్తుంది.

అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద రియాక్ట్ కావాల్సి ఉంటుంది. ఇక కేంద్రం వైఖరి బాబు అరెస్ట్ రిమాండ్ మీద ఏంటి అన్నది కూడా తేలనుంది అని అంటున్నారు. దీని మీద కూడా బాబు నుంచి ఆయనకు సరైన డైరెక్షన్లు వచ్చి ఉంటాయని అంటున్నారు. అంతే కాదు ఒక వైపు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్న వేళ మొత్తం అన్ని పార్టీల ఎంపీలు అక్కడికి వస్తారు. వివిధ పార్టీల నేతలు అధినేతలు కూడా పార్లమెంట్ సమావేశాల వేళ ఢిల్లీలో ఉంటారు.

దాంతో చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఢిల్లీ వేదికగా ఫోకస్ చేయాలని చంద్రబాబు ప్లాన్ మేరకు లోకేష్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఢిల్లీలో మరి కొన్ని రోజులు లోకేష్ ఉంటారని అంటున్నారు. ఆయన అక్కడ నుంచే జాతీయ మీడియాను ఉద్దేశించి ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తారని అంటున్నారు. అంతే కాకుండా నేషనల్ మీడియాలో సైతం బాబు అరెస్ట్ కి మరింత ఫోకస్ వచ్చేలా వరస ఇంటర్వ్యూలకు కూడా ప్లాన్ చేసారు అని అంటున్నారు.

ఇక ఏపీ హై కోర్టులో కనుక ఊరట దక్కకపోతే సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ ని మూవ్ చేయడం మీద కూడా సుప్రీం కోర్టు న్యాయవాదులతో లోకేష్ చర్చిస్తారు అని అంటున్నారు. సో లోకేష్ ఢిల్లీ పయనం ఇపుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని పెంచుతోంది.