తండ్రికి తగ్గ తనయుడు.. పెట్టుబడుల ఆకర్షణలో లోకేష్ మార్క్
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నారు.
By: A.N.Kumar | 28 April 2026 3:04 PM ISTఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ పటంలో నిలిపిన ఘనత నారా చంద్రబాబు నాయుడుది అయితే.. ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, గ్లోబల్ డేటా సెంటర్ల వేదికగా ఏపీని మార్చే బాధ్యతను లోకేష్ భుజానికెత్తుకున్నారు. "తండ్రికి తగ్గ తనయుడు" అనే నానుడిని నిజం చేస్తూ పెట్టుబడుల ఆకర్షణలో ఆయన తనదైన ముద్ర వేస్తున్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. కొత్త మంత్రం
రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణాన్ని సమూలంగా మార్చేందుకు లోకేష్ ప్రవేశపెట్టిన "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" విధానం ఇన్వెస్టర్లలో నూతన ఉత్తేజాన్ని నింపింది. కేవలం అనుమతులు ఇవ్వడమే కాకుండా పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన కల్పించడంలో ఆయన యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా లోకేష్ మాత్రం అభివృద్ధి అజెండాతోనే ముందుకు సాగుతున్నారు. స్వార్థం, కుట్రలకు తావులేకుండా కేవలం ప్రజాసేవ, రాష్ట్ర ఆర్థిక ప్రగతే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్న తీరు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
గ్లోబల్ విజన్.. లోకల్ ఇంపాక్ట్
స్టాన్‌ఫర్డ్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించిన లోకేష్‌కు అంతర్జాతీయ టెక్నాలజీ రంగంపై అపారమైన అవగాహన ఉంది. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుల్లో పాల్గొన్నప్పుడు.. అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో ఆయన సంభాషించే తీరు, ఆంధ్రప్రదేశ్ ప్రాముఖ్యతను వివరించే విధానం అద్భుతమనే చెప్పాలి. అనర్గళమైన ఇంగ్లీష్ ప్రసంగాలు, టెక్నికల్ అంశాలపై ఆయనకు ఉన్న పట్టు గ్లోబల్ సీఈవోలను ఆకట్టుకుంటోంది. దీని ఫలితమే నేడు ఏపీకి క్యూ కడుతున్న దిగ్గజ సంస్థలు.
విశాఖకు 'గూగుల్' కళ.. ఏఐ హబ్‌గా ఆంధ్రప్రదేశ్
నారా లోకేష్ ప్రత్యేక చొరవతో గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇది కేవలం ఒక కార్యాలయం మాత్రమే కాదు.. రాబోయే రోజుల్లో వేలమంది యువతకు ఉపాధి కల్పించే ఒక విజ్ఞాన కేంద్రం. విశాఖకు ఉన్న భౌగోళిక అనుకూలతను, మానవ వనరుల లభ్యతను గూగుల్ వంటి సంస్థలకు వివరించడంలో లోకేష్ సఫలీకృతులయ్యారు.
అదానీ, ఎయిర్‌టెల్ భాగస్వామ్యంతో గిగా వాట్ ప్రాజెక్ట్
రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా అదానీ గ్రూప్, ఎయిర్ టెల్ సంస్థల భాగస్వామ్యంతో భారీ స్థాయి ఏఐ, క్లౌడ్ హబ్ ఏర్పాటవుతోంది. సుమారు ఒక గిగా వాట్ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్ద వాటిలో ఒకటి. డేటా సెంటర్ల రంగంలో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లోకేష్ వ్యూహం ఈ ప్రాజెక్టు ద్వారా సాకారం కాబోతోంది. "రాజకీయాలు కేవలం ఎన్నికల వరకు మాత్రమే.. అభివృద్ధి అనేది తరతరాలకు అందాలి" అనే సిద్ధాంతాన్ని లోకేష్ ఆచరణలో చూపిస్తున్నారు.
నాడు హైటెక్ సిటీ నిర్మాణంతో చంద్రబాబు నాయుడు ఐటీ విప్లవానికి నాంది పలికారు. నేడు అదే వారసత్వాన్ని లోకేష్ ఏఐ, డేటా సైన్స్ వైపు మళ్లిస్తున్నారు. తరం మారినా.. అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత మాత్రం చెక్కుచెదరలేదు. లోకేష్ మార్క్ పాలిటిక్స్ .. ఆయన పారిశ్రామిక విజన్ ఆంధ్రప్రదేశ్‌ను రాబోయే రోజుల్లో దేశానికే తలమానికంగా నిలపడం ఖాయంగా కనిపిస్తోంది.
