VIP పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..! చూడలే..! జగన్ పై లోకేశ్ ట్రోలింగ్
మంగళవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపలపాయలో నిర్వహించిన కార్యక్రమానికి మాజీ సీఎం జగన్ వచ్చారు
By: Tupaki Desk | 2 Sept 2025 2:21 PM ISTవైసీపీ అధినేత జగన్ ను ట్రోల్ చేస్తూ మంత్రి లోకేశ్ ఎక్స్ లో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మంగళవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపలపాయలో నిర్వహించిన కార్యక్రమానికి మాజీ సీఎం జగన్ వచ్చారు. ఈ సందర్భంగా ఇడుపలపాయకు వచ్చే వైసీపీ కార్యకర్తలకు వీఐపీ పాస్ లు జారీ చేశారు. దీనిని టీడీపీ సోషల్ మీడియాతోపాటు కొన్ని పత్రికలు విమర్శిస్తూ కథనాలు ప్రచురించాయి. ఇక మంత్రి లోకేశ్ కూడా వైసీపీ తీరును ఎండగడుతూ మాజీ సీఎం జగన్ ను ట్రోల్ చేస్తూ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు రాశారు.
‘‘ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు VIP పాసులు విన్నాం గానీ.... సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి VIP పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..! చూడలే..! ’’ అంటూ మాజీ సీఎం జగన్ ను ట్యాగ్ చేస్తూ లోకేశ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. దీనికి మద్దతుగా టీడీపీ సోషల్ మీడియా, లోకేశ్ ట్వీట్ ను తప్పు పడుతూ వైసీపీ కార్యకర్తలు ట్విటర్ వేదికగా ఆన్ లైన్ యుద్ధం చేస్తున్నారు. విమర్శలు, ప్రతివిమర్శలుతో ఉదయం నుంచి ట్విటర్ మోత మోగిపోతోంది.
అధికార పర్యటన నిమిత్తం కడప జిల్లాలోనే ఉన్న మంత్రి లోకేశ్ ఈ రోజు ఉదయం 11.19 నిమిషాలకు ఈ ట్వీట్ వదిలారు. కేవలం మూడు గంటల్లో 50 వేల మంది ఆ ట్వీట్ ను వీక్షించగా, సుమారు 500 మంది రీ ట్వీట్ చేశారు. మరోవైపు లోకేశ్ ట్వీట్ కు మద్దతుగా టీడీపీ సోషల్ మీడియాలో వైసీపీ జారీ చేసిన వీఐపీ పాసులను ఉద్దేశించి అనేక రకాలుగా పోస్టులు కనిపిస్తున్నాయి. కొంతమంది జగన్ తీరును నిరసిస్తూ వ్యంగ్యంగా తమ వ్యాఖ్యలను జోడిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ కూడా పెద్ద ఎత్తున కౌంటర్ అటాక్ చేస్తోంది.
మంత్రి లోకేశ్ టార్గెట్ గా వైసీపీ కార్యకర్తలు వంద సంఖ్యలో కామెంట్లు చేస్తున్నారు. లోకేశ్ ను కలవాలన్నా పాస్ లు కావాలని కొందరు, ఆయన డబ్బు తీసుకుంటారని మరికొందరు ట్విటర్ లో ఆరోపిస్తున్నారు. ఈ కామెంట్స్ పై టీడీపీ కార్యకర్తలు దీటుగా స్పందిస్తుండటంతో ఉదయం నుంచి ట్విటర్ వార్ ఆసక్తికరంగా సాగుతోంది. మరోవైపు కడప యాసలో లోకేశ్ చేసిన ట్వీట్ పైన ఆసక్తికర చర్చ జరుగుతోంది. లోకేశ్ మూలాలు రాయలసీమలో ఉన్నప్పటికీ ఆయన ఎక్కువగా హైదరాబాద్ లోనే పెరిగారు. అదేసమయంలో జగన్ ఎక్కువగా రాయలసీమ యాసలో మాట్లాడుతుంటారు. ఈ నేపథ్యంలో జగన్ ను ట్రోల్ చేయడానికి లోకేశ్ మాస్ డైలాగ్ ఎంచుకోవడం కూడా ఆసక్తికరంగా చెబుతున్నారు.
