Begin typing your search above and press return to search.

లోకేష్ పగ్గాలు అందుకునే సమయం...అదే ముహూర్తం

టీడీపీలో మూడవ తరం నాయకత్వం బాధ్యతలు స్వీకరించేందుకు లోకేష్ సిద్ధంగా ఉన్నారు.

By:  Satya P   |   20 April 2026 9:21 AM IST
లోకేష్ పగ్గాలు అందుకునే  సమయం...అదే ముహూర్తం
X

తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఆశా కిరణంగా నారా లోకేష్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి ప్రవేశించి ఈ రోజున ఇంతింతై వటుడింతై అన్నట్లుగా టీడీపీలో సర్వం తానై అన్నట్లుగా ఎదిగారు. ఆయన గడచిన దశాబ్ద కాలంలో రాష్ట్రం మీద తనదైన ముద్రను బలంగా వేశారు. నారా లోకేష్ ని పప్పు అన్న వారే నిప్పు అనుకునేలా ఆయన తనను తాను సాన పట్టుకున్నారు. అందుకే నారా లోకేష్ కి టీడీపీ వర్కింగ్ ప్రెసిండెంట్ పదవిని ఇచ్చినా ఏ ఒక్కరి నుంచి వ్యతిరేక స్వరం కానీ అసంతృప్తి గళం కానీ వినిపించలేదు. పైగా ఎక్కడా ఎలాంటి రిమార్క్స్ కూడా సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ రాకపోవడం చూస్తూంటే ఒక విధంగా లోకేష్ సాధించిన విజయం ఏమిటో అర్థం అవుతుంది.

బాబు నుంచి సాఫీగా :

టీడీపీలో మూడవ తరం నాయకత్వం బాధ్యతలు స్వీకరించేందుకు లోకేష్ సిద్ధంగా ఉన్నారు. ఇక ఆ బాధ్యతల స్వీకరణ అన్నది కూడా చాలా సాఫీగా సాగిపోవడం విశేషం. ఒక్కసారి మూడు దశాబ్దాల వెనక్కి వెళ్తే ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు పగ్గాలు దక్కడం వెనక ఒక పెద్ద రాజకీయ సమరమే సాగింది. కానీ ఇపుడు అలా కాదు చాలా స్మూత్ గా ఇదంతా సాగింది అంటే నారా లోకేష్ కి దక్కిన అదృష్టంగానే అంతా భావిస్తున్నారు. మరో వైపు చూస్తే లోకేష్ కూడా ఎప్పటికపుడు తనను తాను సమర్థుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ అందులో సక్సెస్ కావడం కూడా ఆయనకు ఆ పదవి వరించేందుకు ఆస్కారం ఇచ్చింది అని చెప్పాలి.

మొత్తం కార్యవర్గంతో :

ఇదిలా ఉంటే టీడీపీ అధినాయకత్వం తాజాగా ప్రకటించిన జాతీయ రాష్ట్ర కార్యవర్గం ప్రమాణ స్వీకరణ ఘట్టం ఈ నెల 29న అట్టహాసంగా సాగుతుంది అని అంటున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అది జరుగుతుందా లేదా వేరే వేదికను చూస్తారా అన్నది పక్కన పెడితే ఆ రోజున మంచి ముహూర్తంగా భావించి పార్టీ పగ్గాలను లోకేష్ స్వీకరించనున్నారు అని అంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే అన్ని విషయాలు లోకేష్ చూస్తారు, అత్యంత ముఖ్యమైనవి తప్పితే చంద్రబాబు దాదాపుగా పార్టీ విషయాలు అన్నీ లోకేష్ కి అప్పగించినట్లే అని అంటున్నారు.

మహానాడు డిజైన్ :

ఈసారి మహానాడు రూపకల్పన బాధ్యత అంతా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతుంది అని అంటున్నారు. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక చేసే అతి పెద్ద పార్టీ కార్యక్రమంగా ఇది ఉండబోతోంది. ఉత్తరాంధ్రాలోని నెల్లిమర్లలో ఈసారి మహానాడుని నిర్వహిస్తున్నారు. దాంతో నెల రోజులు మాత్రమే సమయం ఉన్నందున లోకేష్ పార్టీ మొత్తాన్ని సమాయత్తం చేస్తారు అని అంటున్నారు. అదే విధంగా ఈసారి మహానాడు లో ఏ తీర్మానాలు చేయాలి, ఏ అంశాలను ఫోకస్ చేయాలి అన్న విషయాలు కూడా చంద్రబాబుతో చర్చించి మరీ లోకేష్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తారు అని అంటున్నారు. ఇక రానున్న రోజులలో పార్టీ పరంగా ఏమి చేయాలన్నా కూడా నారా లోకేష్ దే అతి ముఖ్య పాత్ర అని చెబుతున్నారు. మొత్తం మీద టీడీపీలో మూడు దశాబ్దాల తరువాత నాయకత్వం విషయంలో అతి పెద్ద మార్పు రాబోతోంది. ఈసారి దానిని భారీ ఎత్తున వేడుకగా జరుపుకోవడానికి పార్టీ మొత్తం సిద్ధంగా ఉండడమే అసలైన విశేషంగా చూడాల్సి ఉంది.