Begin typing your search above and press return to search.

చెట్లను చూసి జగన్ భయపడేవారా? లోకేశ్ కోట కొత్త మాట

తన మాటల పదును అంతకంతకూ పెంచుతున్నారు ఏపీ మంత్రి నారా లోకేశ్.

By:  Tupaki Desk   |   1 Jun 2025 4:53 AM
చెట్లను చూసి జగన్ భయపడేవారా? లోకేశ్ కోట కొత్త మాట
X

తన మాటల పదును అంతకంతకూ పెంచుతున్నారు ఏపీ మంత్రి నారా లోకేశ్. రెడ్ బుక్ అంటూ ఎన్నికల ముందు ఆయన తీసుకొచ్చిన కాన్సెప్టు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు అదే అంశాన్ని పదే పదే చెబుతున్నారు. ఎవరి నోట విన్నా.. రెడ్ బుక్ రాజ్యాంగం.. రెడ్ బుక్ రాక్షసం.. రెడ్ బుక్ న్యాయం.. ఇలాంటి ప్రతిదీ రెడ్ బుక్ చుట్టూనే తిరిగే పరిస్థితి. వీటన్నింటికి కర్త.. కర్మ.. క్రియ మాత్రం లోకేశ్ గా చెప్పాలి.

అధికారం చేతికి వచ్చిన నాటి నుంచి తన మాటల్లో మరింత పదును పెంచటమే కాదు.. పుచ్చుకున్న వాయనానికి ఏ మాత్రం తీసిపోకుండా డబుల్ సైజులో తీసుకున్నది ఇచ్చేస్తున్న వైనంగా మాట వాయినం పెడుతున్న లోకేశ్ వైఖరి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా ఆయన కొంత ఎటకారపు వ్యాఖ్యలు చేశారని చెప్పాలి.

టూర్లకు వెళుతూ రోడ్ల పక్కనున్న చెట్లను చూసి భయపడిన విచిత్ర ముఖ్యమంత్రి గతంలో ఉండేవారని.. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రజల మనిషిగా పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసమీ జిల్లాల్లో చంద్రబాబు పర్యటన సందర్భంగా రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను నరికేస్తున్నట్లుగా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ.. వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

‘పచ్చదనం పరిశుభ్రత అనే నినాదంతో మొక్కలు నాటించిన నాయకుడు చంద్రబాబు. నేచర్ ను ప్రేమించే ఆయన.. తన పర్యటన కోసం చెట్లను నరకమంటారా? మీజీ ముఖ్యమంత్రికి ఉన్న భయాలేవీ చంద్రబాబుకు లేవు. సాధారణంగా విద్యుత్తు సరఫరా నిర్వహణలో అడ్డొచ్చే కొమ్ముల్ని అధికారులు తొలగిస్తుంటారు. దీన్ని వైసీపీ పేటీఎం బ్యాచ్ తప్పుడు ప్రచారానికి వాడుతున్నారు. ఇందులో నిజం ఏ మాత్రం లేదు’’ అంటూ స్పష్టం చేశారు. ప్రత్యర్థిని ఉద్దేశించి నాలుగు మాటలు అనే ఏ అవకాశాన్ని వదలకపోవటమే కాదు.. తమను ఉద్దేశించి అన్న దానికి రెట్టింపుగా బదులు తీర్చుకునే యువనేతగా లోకేశ్ నిలుస్తారని చెప్పాలి.