లోకేష్...నిజాలు చెప్పాలి కదా !
డైనమిక్ లీడర్ షిప్ అంటే ఉన్నది ఉన్నట్లుగా జనాలకు చెప్పడం వారిని ఒప్పించి మరీ మెప్పు పొందడం. మరి లోకేష్ అలా చేస్తున్నారా అంటే లేదనే అంటున్నారు.
By: Tupaki Desk | 5 Jun 2025 10:35 AM ISTనారా వారి అబ్బాయి నుంచి టీడీపీ అనే అతి పెద్ద రాజకీయ వట వృక్షానికి కొత్త యజమానిగా మారుతున్న లోకేష్ అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో తనదైన జోరుని చూపిస్తున్నారు అన్నీ తానే అయి అంతటా నడిపిస్తున్నారు. అడుగు దూరంలో ముఖ్యమంత్రి సీటుకు ఉన్నారని అనుకూల మీడియాతో సహా వందిమాగధులు అంతా వంత పాడుతున్న వేళ వెయిటింగ్ చీఫ్ మినిస్టర్ ట్యాగ్ తో ఏపీ రాజకీయాల్లో అలరారుతున్న ఈ యువ రాజకీయ కెరటం తనదైన పొలిటికల్ ట్రెండ్ సెట్ చేయడం అంటే కేవలం ప్రకటనలు చేసి ఊరుకోవడమేనా అన్న చర్చ సాగుతోంది. నాలుగు పదుల వయసులో ఉన్న ఈ నవ యవ్వన రాజకీయ నాయకత్వం నుంచి జనాలు ఆశించేది నిజాలను అంటున్నారు.
డైనమిక్ లీడర్ షిప్ అంటే ఉన్నది ఉన్నట్లుగా జనాలకు చెప్పడం వారిని ఒప్పించి మరీ మెప్పు పొందడం. మరి లోకేష్ అలా చేస్తున్నారా అంటే లేదనే అంటున్నారు. చంద్రబాబు ఓల్డ్ పొలిటీషియన్. ఆయన ఎర్లీ సెవెంటీస్ ట్రెండ్ పాలిటిక్స్ నే ఈ రోజుకీ ఫాలో అవుతారు. ఆయన మీద ప్రత్యర్ధులు చేసే అతి పెద్ద ఆరోపణ ఏమిటి అంటే కళ్ళార్పకుండా అబద్ధాలు చెబుతారు అని. సరే టీడీపీ వారు అయితే మా బాబు మా మంచి వారు అని కూడా భుజకీర్తులు తగిలించి తెగ మెచ్చుకోవచ్చు కాక. బాబు రాజకీయ జీవితంలో అనేకం ఉన్నాయి.
కానీ ప్రపంచం మారుతున్న వేళ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ షిప్ ని అంతట జనాలు కోరుకుంటున్న వేళ తాము ఏమి చేసినది జనాలకు చెబితేనే కదా కొత్త తరానికి పది కాలాల పాటు రాజకీయ మన్నన ఉండేది అని అంటున్నారు. బాబు నాటి కాలం వేరు, ఈనాటి కాలం వేరు. ఇది సోషల్ మీడియా యుగం. కృత్రిమ మేధతో కవి కాంచనిది కూడా సగటు మనిషి చూస్తున్న లోకమిది.
మరి ఇంతలా అడ్వాన్స్డ్ గా ఉన్న రోజులలో లోకేష్ బాబు ఏదో పేపర్ స్టేట్ మెంట్స్ గా కొన్ని అంకెలు ఇచ్చేసి అవే నిజమని చెప్పేస్తే జనాలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా అన్నదే చర్చ. మరో నాలుగు దశాబ్దాల పాటు రాజకీయం చేస్తాను అని పట్టుబట్టి వచ్చిన లోకేష్ తన రాజకీయ పంధాను మార్చుకోవాలి కదా అని అంటున్నారు. ఆయన యువ నేత. చాలా ఆయన నుంచి జనాలు ఆశిస్తారు. అందుకే ప్రపంచానికి నిజాలు చెప్పు లోకేష్ అని అంతా అంటున్నారు.
ఇదేదో ప్రత్యర్థి పార్టీ వైసీపీకి బదులు చెప్పినట్లు కాదు అలా అనుకోకూడదు కూడా. వైసీపీకి చెప్పినా చెప్పకపోయినా జనాలకు మాత్రం కచ్చితంగా నిజాలే చెప్పాలి అని అంటున్నారు. కానీ లోకేష్ నోటి నుంచి భారీ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. భారీ అంకెలతో ఆయన బోల్తా కొట్టించాలని చూస్తున్నారు అని విమర్శలూ వస్తున్నాయి.
తాజాగా మంత్రి లోకేష్ ప్రకటనలు చూస్తే అదే అనిపిస్తోంది అంటున్నారు. కేవలం పదకొండు నెలల వ్యవధిలో 9.20 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని మంత్రి లోకేష్ అంటున్నారు. అంతే కాదు 8.5 లక్షల ఉద్యోగాల కల్పన వీటి వల్ల సాధ్యపడుతుందని చెబుతున్నారు. ఇక ఎంటీసీపీ, రిలయెన్స్, టాటా పవర్ వంటి సంస్థలతో పరిశ్రమల వారీగా ఈడీబీలో ప్రాజెక్ట్ మానిటరింగ్ య్హూనిట్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించామని చెబుతున్నారు.
అంతా బాగానే ఉంది కానీ ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి ఎలా వచ్చాయో పూర్తి వివరణతో కూడిన ప్రకటన లోకేష్ చేసి ఉంటే బాగుండేది కదా అని అంటున్నారు. ఆయన చెప్పినట్లుగానే 9.20 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వస్తే చాలా సంతోషమే. కానీ అది అంతా కలిపి గంప గుత్తగా ఒక భారీ నంబర్ గా చెప్పడం కంటే పరిశ్రమల వారీగా ఎన్ని కోట్లు ఎవరు పెట్టుబడి పెడుతున్నారు ఎపుడు ఒప్పందం కుదిరింది. దానికి ప్రభుత్వం ఎంత వారికి రాయితీలు ఇస్తోంది అన్నది కూడా ఆయన వివరించాలి కదా అని అంటున్నారు.
అంతే కాదు ఆయా పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యేది ఎపుడు దానికి డెడ్ లైన్ ప్రభుత్వం పెట్టిందా లేదా అన్నది కూడా జనాలకు లోకేష్ వివరిస్తే బాగుంటుంది కదా అని అంటున్నారు. ఇక పరిశ్రమలు పెట్టడం వరకూ ఒకే అయినా ఏ ఏ పరిశ్రమలో ఎంత ఎంత ఉద్యోగాలు లభిస్తాయన్నది కూడా ఆయా పరిశ్రమల వారీగా డేటాను రిలీజ్ చేస్తే ఏపీ జనాలు సంతోషిస్తారు కదా అని అంటున్నారు.
అలా కాకుండా తనను కలసిన ప్రతీ వారూ పరిశ్రమలు పెడతామని హామీ ఇచ్చిన వారూ అందరినీ ఒకే గాటన కట్టేసి ఆ మొత్తాలను లక్షల కోట్లకు హెచ్చించి వాటిని భారీ నంబర్ తో జనాలకు చెప్పేస్తే అది నమ్మబుల్ గా ఉందా యువ నాయకా అని అంటున్నారు. ఈ రోజు ఏది చేసినా పారదర్శకత ఉండాలి అన్నదే జనాల నుంచి వస్తున్న మాట. పెద్దగా పలుకుబడి లేని సంస్థలు ఏ మాత్రం ట్రాక్ రికార్డు లేని కంపెనీలకు కూడా వేల కోట్ల విలువ అయిన ప్రభుత్వ భూములను దారాదత్తం చేయడం వల్ల అటు పరిశ్రమలకూ చెడి ఇటు వ్యవసాయానికి చెడి జనాలు పోతారు అన్నది మేధావుల మాటగా ఉంది.
ఎవరికి ఎంత కావాలో ఆచీ తూచీ లెక్క వేసి మరీ రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాదు ప్రభుత్వం ధర్మకర్తగా మారి ప్రజల ఆస్తులను ఎంతో బాధ్యతగా ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఇవ్వాలి. ఇక పరిశ్రమల విషయంలో గత ప్రభుత్వాలు ఆ మాటకు వస్తే దేశంలోని అంతా కూడా ఇదే పాట పాడతారు ఒప్పందంలో కుదిరాయని అవి లక్షల కోట్లు చూపిస్తారు కానీ తీరా అవి గ్రౌండింగ్ అయ్యేనాటికీ ఏళ్ళూ పూళ్ళూ గడచిపోతాయి. ముందు చెప్పిన అతి పెద్ద నంబర్ కూడా మాయం అవుతుంది.
అందువల్ల ఇకనైనా ఈ రొటీన్ స్టేట్మెంట్స్ కి బదులుగా నిజాలు చెబుతూ జనాలకు కళ్ళ ముందు అన్ని వివరాలు ఉంచితే లోకేష్ ఈ తరానికి తగిన లీడర్ గా ఉంటారని అంటున్నారు. ఇక టీడీపీ నాయకత్వం అంటున్న ఇంటికో పారిశ్రామికవేత్త అన్నది పక్కన పెడితే ప్రతీ ఇంటికో తాగుబోతు తయారు అయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి లాంటి వారు అంటున్నారు. మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపులతో ప్రతీ ఇంటికీ మందు బాబులను బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు అని ఆయన విమర్శిస్తున్నారు.
