Begin typing your search above and press return to search.

నెల్లిమ‌ర్ల‌లో కొత్త ర‌చ్చ‌.. జ‌నసేన వ‌ర్సెస్ టీడీపీ.. !

జనసేన పార్టీ ఎమ్మెల్యే, నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం మాధవి వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చకు వచ్చింది.

By:  Tupaki Desk   |   25 July 2025 7:00 PM IST
నెల్లిమ‌ర్ల‌లో కొత్త ర‌చ్చ‌.. జ‌నసేన వ‌ర్సెస్ టీడీపీ.. !
X

జనసేన పార్టీ ఎమ్మెల్యే, నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం మాధవి వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చకు వచ్చింది. గత ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించిన లోకం మాధవి ఐటీ రంగంలో వ్యాపారస్తురాలన్న విషయం అందరికీ తెలిసిందే. అమెరికా సహా స్విట్జర్లాండ్, దుబాయ్ వంటి దేశాల్లో లోకం మాధవి కుటుంబం ఐటి రంగంలో వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో తరచుగా ఆమె విదేశీ పర్యటన‌లో ఉంటున్నారు అన్నది జనసేన వర్గాల్లోనే చర్చి నడుస్తోంది. అయితే, స్థానికంగా పనులు మాత్రం ఎవరు చేయాలన్న విషయం ఆమె చెప్పకుండా విదేశాలకు వెళ్లిపోతుండడంతో టిడిపి నాయకులు జోక్యం చేసుకుంటున్నారు.

తాజాగా 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని నెల్లిమర్ల నియోజకవర్గంలో గత 5 రోజులుగా చేపట్టారు. సహజంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో టిడిపి బ‌లంగా ఉంది. అయినప్పటికీ గత ఎన్నికల్లో జనసేనకు కేటాయించారు. అప్పట్లోనే రెండు పార్టీల మధ్య వివాదాలు రావడం, వీటిని చంద్రబాబు, నారా లోకేష్ జోక్యం చేసుకుని సరిదిద్దడం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకటికి రెండుసార్లు చర్చలు, సంప్రదింపుల ద్వారా ఇరు పార్టీల నాయకుల మధ్య ప్రశాంత వాతావరణ ఏర్పడేలాగా ప్రయత్నాలు అయితే జరిగాయి.

కానీ... ఈ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. ప్రస్తుతం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నెల్లి మర్ల నియోజకవర్గంలో చేపట్టడంతో లోకం మాధవి తీవ్ర‌స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ''నా నియోజకవర్గంలో మీరు ఎలా నిర్వహిస్తారు. ఇది మీ పార్టీ కార్యక్రమం. మాది కాదు.'' అంటూ ఆమె స్థానిక టిడిపి నాయకుల పై ఆగ్రహం వ్యక్తం చేయ‌డం.. స్థానికంగా రాజకీయాలను వేడెక్కేలా చేసింది. ఈ విషయంపై మంత్రి అచ్చంనాయుడు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు.

'మన పార్టీ వాళ్లు కార్యక్రమం నిర్వహిస్తే జనసేన ఎమ్మెల్యే గా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారని, దీనిపై తనకు ఫిర్యాదులు అందాయని' ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇది అంతర్గత వ్యవహారమని, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు సర్ది చెప్పారు. కానీ వాస్తవానికి టిడిపి నాయకులు కొన్ని కొన్ని ప్రాంతాల్లోనే పర్యటించాలని తమ తమ నియోజకవర్గాలకే పరిమితం కావాలని చంద్రబాబు ఎవరికి చెప్పలేదు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించాలని మాత్రమే ఆయన సూచించారు. ఈ క్ర‌మంలోనే జనసేన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ టిడిపి నాయకులు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదే వివాదానికి దారి తీసింది. మరి భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయి? అన్నది చూడాలి.