పార్లమెంటులో కీలక పరిణామం.. మహిళా బిల్లుకు తొలగిన అడ్డంకి!
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం)ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
By: Tupaki Political Desk | 16 April 2026 3:50 PM ISTలోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం)ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మేరకు 131 రాజ్యాంగ సవరణకు ప్రతిపాదించింది. బిల్లుపై చర్చించాలా? వద్దా? అన్న అంశంపై ఓటింగ్ జరిగింది. మెజార్టీ సభ్యులు ఆమోదించడంతో బిల్లుపై చర్చకు మార్గం సుగమమైంది. రాజ్యాంగ సవరణ బిల్లులను సభలో చర్చించేందుకు మెజార్టీ సభ్యుల ఆమోదం అవసరమని చెబుతున్నారు. దీంతో గురువారం ప్రారంభమైన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మహిళా బిల్లుతోపాటు డీలిమిటేషన్ బిల్లులను ప్రతిపాదిస్తూ 131 రాజ్యాంగ సవరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
కేంద్రం ప్రతిపాదించిన బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మహిళా రిజర్వేషన్లకు అనుకూలమని చెప్పిన సమాజ్ వాదీతోపాటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, సీపీఎం, ఆప్నాదళ్, ఎంఐఎం వంటి పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. బిల్లుపై రాజ్యాంగపరమైన సందేహాలు ఉన్నట్లు విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం సవరణ బిల్లు చాలా అవసరమైన వాదనలు వినిపించింది. పరిపాలన, ఎన్నికల సంస్కరణలకు బిల్లు అవసరమని ప్రభుత్వం చెప్పింది.
ఈ నేపథ్యంలో ఓటింగ్ చేపట్టగా, 333 ఓట్లు పోలయ్యాయి. ఇందులో బిల్లుకు అనుకూలంగా 207 మంది ఓటేశారు. విపక్షాలకు చెందిన 126 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. మెజార్టీ సభ్యుల ఆమోదంతో బిల్లుపై చర్చించేందుకు తొలి దశ పూర్తయినట్లైంది. ఈ బిల్లుపై సుమారు 12 గంటల పాటు చర్చిస్తారు. అనంతరం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఇక మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. విపక్షాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి 2023లో మహిళా రిజర్వేషన్ల కోసం బిల్లు ప్రవేశపెట్టారు. దీనిప్రకారం కొత్తగా జనగణన, నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన తర్వాతే రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉంది.
అయితే, తాజా సవరణ ద్వారా ఈ జాప్యాన్ని నివారించి, 2029 సాధారణ ఎన్నికల నుంచే రిజర్వేషన్లు అమలయ్యేలా నిబంధనలను మార్చారు. దీనిని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు ఆమోదం పొందితే, భారత పార్లమెంటరీ చరిత్రలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరగనుంది. ముఖ్యంగా 2029 ఎన్నికల నాటికి లోక్‌సభలో దాదాపు 280 కంటే ఎక్కువ మంది మహిళా ఎంపీలు అడుగుపెట్టే అవకాశం ఉంది.
