Begin typing your search above and press return to search.

పార్లమెంట్ లో హైడ్రామా.. రాజ్యాంగ సవరణ బిల్లుపై వీడని సస్పెన్స్!

రాజ్యాంగ సవరణ బిల్లు నేపథ్యంలో ఢిల్లీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు విపక్షాలు ప్రకటించాయి.

By:  Tupaki Political Desk   |   17 April 2026 1:46 PM IST
పార్లమెంట్ లో హైడ్రామా.. రాజ్యాంగ సవరణ బిల్లుపై వీడని సస్పెన్స్!
X

రాజ్యాంగ సవరణ బిల్లు నేపథ్యంలో ఢిల్లీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు విపక్షాలు ప్రకటించాయి. దీంతో బిల్లు చట్టంగా మారడానికి తప్పనిసరిగా ఓటింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. విపక్షంలోని తటస్థంగా ఉన్న పార్టీలు ప్రభుత్వానికి అనుకూలంగా బిల్లుకు మద్దతు ప్రకటిస్తున్నా, 2/3 వంతు మెజార్టీ సాధించడానికి ఇంకా కొందరు ఎంపీలను సమీకరించాల్సివుందని అంటున్నారు. దీంతో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల ఆమోదం తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్నట్లు చెబుతున్నారు.

మహిళా రిజర్వేషన్ల కోసం 131వ రాజ్యాంగ సవరణ ప్రతిపాదిస్తూ కేంద్రం గురువారమే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది. అంతేకాకుండా మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చినట్లు ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించింది. సాంకేతిక సమస్యను అధిగమించి, 2026 ఏప్రిల్ 16ను చట్టం అమలు తేదీగా భావించాలని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. దీంతో 2/3 వంతు మెజార్టీపై కేంద్రంగా ధీమాగా ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

నిజానికి 543 మంది సభ్యుల పార్లమెంటులో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 540 మంది సభ్యుల బలం ఉండగా, 2/3 వంతు మెజార్టీకి 361 మంది సభ్యులు అవసరం. ప్రస్తుతం సభలో ఎన్డీఏకి కేవలం 293 మంది సభ్యుల బలం ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించుకోవడానికి ప్రభుత్వం 68 మంది ఎంపీల మద్దతు కూడగట్టాల్సివుంటుందని అంటున్నారు. వైసీపీ వంటి కొన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇంకా మిగిలిన సభ్యులను ఎలా సమీకరిస్తారన్నది ఉత్కంఠకు గురిచేస్తోందని అంటున్నారు.

అయితే గురువారం సభలో చోటుచేసుకున్న పరిణామాలతో బిల్లు ఆమోదంపై ప్రభుత్వం ధీమాగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ వంటి విపక్షాలు బిల్లును వ్యతిరేకిస్తున్నా, ప్రత్యేక వ్యూహంతో బిల్లు ఆమోదానికి ప్రభుత్వం పావులు కదుపుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. గురువారం బిల్లుల చర్చించేందుకు సభలో ప్రవేశపెట్టిన సందర్భంలో ఓటింగ్ నిర్వహించగా, 251 మంది అనుకూలంగా ఓటేశారు. 185 మంది వ్యతిరేకిస్తున్నట్లు ఓట్లు వేశారు. దాంతో విపక్షాల అభ్యంతరం వీగిపోయింది. అయితే 104 మంది సభ్యులు హాజరుకాకపోవడం వల్లే బిల్లుపై చర్చ సజావుగా మొదలైంది.

ఈ రోజు 2/3 వంతు మెజార్టీతో బిల్లును ఆమోదించుకోవాలంటే ప్రభుత్వం 361 సభ్యుల మద్దతు తీసుకోవాలి. లేదంటే 540 మంది సభ్యుల లోక్ సభలో 104 మంది సభకు గైర్హాజరైతే, ప్రస్తుత బలంతో బిల్లు ఆమోదించుకోవచ్చునని అంటున్నారు. విపక్షానికి చెందిన కొందరు ఎంపీలు సభకు హాజరుకాకుండా చూసి బిల్లును చట్టం చేసుకోవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని చెబుతున్నారు. అయితే బిల్లుపై జరిగిన సభకు తప్పనిసరిగా రావాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే విప్ జారీ చేశాయి. ఈ పరిస్థితుల్లో బిల్లుల ఆమోదంపై సస్పెన్స్ కొనసాగుతోంది.