Begin typing your search above and press return to search.

పెళ్లి అంటేనే భయపడుతున్న అబ్బాయిలు.. వరుస ఘటనతో మీమ్స్ హల్‌చల్

మేఘాలయా, గద్వాల మర్డర్ కేసులు వెలుగు చూశాక పెళ్లికెందుకు తొందర అన్నట్లు యువత ఆలోచన మారిపోయిందని మీమ్స్ వదులుతున్నారు.

By:  Tupaki Desk   |   28 Jun 2025 8:58 AM IST
పెళ్లి అంటేనే భయపడుతున్న అబ్బాయిలు.. వరుస ఘటనతో మీమ్స్ హల్‌చల్
X

పెళ్లంటే నూరేళ్లు పండుగ.. రెండు మనసులు, రెండు కుటుంబాల కలయిక పెళ్లి. అంతేకాదు పెళ్లి ఒక పవిత్రమైన బంధం, ఆనందం, బాధ్యత, ప్రేమ, నమ్మకం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇటీవల వివాహ బంధంలో చోటుచేసుకుంటున్న సంఘటనలతో మూడు ముళ్లు బంధాన్ని ముళ్ల కిరీటంగా భావిస్తున్నారు యువకులు. ఇంతకుముందు పెద్దలు కుదర్చిన వివాహంలో మనసులు కలవడానికి సమయం తీసుకున్నా ఆ బంధం కలకాలం కొనసాగేది. అయితే ఇప్పుడు ఇష్టపడి చేసుకున్న పెళ్లిళ్లు కూడా పెటాకులవుతున్నాయి. కొన్ని సందర్బాల్లో ప్రాణాలే పోతున్నాయి. గతంలో మహిళలపై ఇలాంటి నేరాలు జరగగా, ఇప్పుడు కాలం మారినట్లు కనిపిస్తోందంటున్నారు నెటిజన్లు. మేఘాలయా హనీమూన్ మర్డర్ కేసు, గద్వాలలో సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసుతోపాటు ఇటీవల యూపీలో ఫస్ట్ నైట్ నాడు టచ్ చేస్తే కత్తితో ముక్కలు చేసేస్తానని నవ వధువు బెదిరింపులు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో పెళ్లిళ్లపై యువకులు సోషల్ మీడియాలో సరదా మీమ్స్ పోస్టు చేస్తున్నారు.

మేఘాలయా, గద్వాల మర్డర్ కేసులు వెలుగు చూశాక పెళ్లికెందుకు తొందర అన్నట్లు యువత ఆలోచన మారిపోయిందని మీమ్స్ వదులుతున్నారు. వాస్తవానికి గత కొన్నేళ్లుగా వివాహం అవ్వడమే పెద్ద సవాల్ గా మారిపోయింది. అమ్మాయిలు తక్కువ అయిపోవడం, చదువు, మంచి ఉద్యోగం ఉన్నవారిని కోరుకుంటుండటంతో మామూలు ఉద్యోగాలు చేస్తున్నవారికి పెళ్లిళ్లు అవ్వడం చాలా కష్టంగా మారిందని అంటున్నారు. అయితే ఇప్పుడు తాజా సంఘటనలతో కష్టపడి వదువును వెతుక్కుని ప్రాణాలు తీసుకోవడం ఎందుకు? అంటూ యువత జోక్ చేస్తున్నారు.

గద్వాల ఘటన తర్వాత ఎక్స్(ట్విటర్) లో వీజే అనే యువకుడు వివాహ బంధంపై చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వివాహం అవసరమా? అంటూ ప్రశ్నించడమే కాకుండా.. పెళ్లి ఎప్పుడు చేసుకోవాలన్న ప్రశ్నకు సరదాగా కామెంట్స్ వస్తున్నాయి. ఆ వీడియోలో పెళ్లి ఎప్పుడు చేసుకోవాలనే ప్రధాన ప్రశ్నకు రకరకాల సమాధానాలు ఉన్నాయి. బయోలాజికల్ గా అయితే 15 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలి.. చట్టబద్ధంగా అయితే 18 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలి.. సోషల్లీ 26 ఏళ్లకు, కల్చరల్లీ 24 నుంచి 28 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలి. అదే ఎకనామికల్లీ అయితే 30 దాటాకే పెళ్లి అంటూ సమాధానాలు ఉన్నాయి. ఇక చివరగా లాజికల్ గా అయితే ‘‘అసలు పెళ్లి చేసుకోకూడదు’’ అనే సమాధానంతో వీడియో ముగించాడు.

వీడియోలో లాజికల్ సమాధానంపై ఎక్కువ మంది రియాక్ట్ అవుతున్నారు. వరుస ఘటనల నేపథ్యంలో పెళ్లికి దూరంగా ఉండటమే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోలో బతుకే సో బెటర్ అంటూ సాంగ్ వేసుకుని జీవితాన్ని హాయిగా గడిపేద్దామని భావిస్తున్నారు. అయితే పెద్ద వయసు వారు మాత్రం ప్రతి వ్యక్తికి జీవన సహచరి ఉండాల్సిన అవసరం ఉందని, ఏవో సంఘటనతో పెళ్లిపై విరక్తి పెంచుకోవడం కరెక్టు కాదని అంటున్నారు.