అత్యాచార నిందితుడిని హతమార్చారు
మైనర్ బాలికలపై అత్యాచార కేసులో అరెస్టయిన 19 ఏళ్ల రియాజ్ ఉల్ కురిమ్ అనే వ్యక్తిపై ఆగ్రహించిన ప్రజలు దారుణంగా కొట్టి చంపారు.
By: Tupaki Desk | 14 July 2025 3:00 PM ISTఅరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని రోయింగ్ పట్టణంలో జరిగిన దారుణ సంఘటన ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. మైనర్ బాలికలపై అత్యాచార కేసులో అరెస్టయిన 19 ఏళ్ల రియాజ్ ఉల్ కురిమ్ అనే వ్యక్తిపై ఆగ్రహించిన ప్రజలు దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటనతో రోయింగ్ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అధికారులు కర్ఫ్యూ విధించారు.
రియాజ్ ఉల్ కురిమ్, అస్సాం రాష్ట్రంలోని బోంగైగావన్‌కు చెందిన వలస కార్మికుడు. రోయింగ్‌లోని మౌంట్ కార్మెల్ స్కూల్ సమీపంలో నిర్మాణ పనుల్లో పనిచేస్తున్నాడు. రియాజ్ మౌంట్ కార్మెల్ స్కూల్‌కు సంబంధించిన హాస్టల్‌లోకి చొరబడి పలు రోజులు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. బాధిత బాలికల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
- ప్రజల ఆగ్రహం.. నేరస్తుడిని లిన్చింగ్
రియాజ్ అరెస్టు అనంతరం, పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. కోపంతో ఉన్న ఆ గుంపు పోలీస్ స్టేషన్‌లోకి చొరబడి రియాజ్‌ను బయటకు ఎత్తుకుపోయారు.. అనంతరం అతన్ని రోడ్డుపై ఉన్న ఒక చెట్టుకు కట్టేసి అత్యంత దారుణంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు రియాజ్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించినప్పటికీ, ప్రజలు ఆసుపత్రి వద్దకు కూడా చేరుకుని అతన్ని మళ్ళీ చితకబాదడంతో అతను అక్కడే మృతి చెందాడు.
- కర్ఫ్యూ విధింపు.. ప్రభుత్వ స్పందన
ఈ ఘటనతో రోయింగ్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతలు పెరిగాయి. శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి అధికారులు తక్షణమే పట్టణంలో కర్ఫ్యూ విధించారు. అలాగే, సెక్షన్ 144 అమలులో ఉంది. సంఘటన జరిగిన మౌంట్ కార్మెల్ స్కూల్ హాస్టల్‌ను కూడా తాత్కాలికంగా మూసివేశారు. విద్యార్థుల భద్రతపై స్థానికులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-న్యాయ వ్యవస్థపై ప్రశ్నలు
న్యాయ నిపుణులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం న్యాయ వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని వారు పేర్కొన్నారు. చట్టాల అమలు, బాధితుల హక్కులు, నిందితుల విచారణ.. ఇవన్నీ సమర్థవంతంగా, చట్టబద్ధంగా జరగాల్సిన అవసరం ఉందని వారు పునరుద్ఘాటించారు.
- హాస్టల్ భద్రతపై విచారణ
మౌంట్ కార్మెల్ స్కూల్ హాస్టల్‌లో భద్రతా చర్యలు లేకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని ఆరోపిస్తూ, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ దురదృష్టకర సంఘటన చట్టాన్ని గౌరవించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. ఎంతటి దారుణమైన నేరం జరిగినప్పటికీ, చట్ట ప్రకారం మాత్రమే శిక్ష అమలుకావాలి. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలు న్యాయాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం సమాజానికి మంచిది కాదు.
