19 రోజుల తర్వాత 'ఎల్ఓసీ'లో రాత్రి ఎలా గడిచింది?
ఏప్రిల్ 22న పహల్గాం దాడి తర్వాత కాల్పుల విరమణ ఉల్లంఘనలలో మొదటి పూర్తి విరమణను మే 11 రాత్రి తీసుకువచ్చింది.
By: Tupaki Desk | 12 May 2025 10:31 AM ISTఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి.. మే 6 అర్ధరాత్రి ఆపరేషన్ సిందూర్ చేపట్టినప్పటి నుంచి.. శనివారం సాయంత్రం 5 గంటలకు కాల్పుల విరమణ ఒప్పందం జరిగే వరకూ నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా, నిప్పుల వర్షం కురుస్తున్న ఆకాశంలా, బాంబుల మోతతో ఉన్న సంగతి తెలిసిందే.
అవును... శనివారం సాయంత్రం భారత్ – పాక్ లు కాల్పుల విరమణకు అంగీకరించిన అనంతరం.. ఆదివారం - సోమవారం మధ్య రాత్రి జమ్మూ కశ్మీర్, అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి ఉన్న ప్రాంతాల్లో చాలా వరకూ ప్రశాంతంగా ఉందని.. నో షెల్లింగ్, నో ఫైరింగ్.. కారణంగా 19 రోజుల తర్వాత మొదటి ప్రశాంతమైన రాత్రిని ఇది సూచిస్తుందని తెలిపింది.
ఏప్రిల్ 22న పహల్గాం దాడి తర్వాత కాల్పుల విరమణ ఉల్లంఘనలలో మొదటి పూర్తి విరమణను మే 11 రాత్రి తీసుకువచ్చింది. ఏప్రిల్ 22 నుంచి నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడని రాత్రి లేదని అంటారు. ప్రధానంగా మే 7 నుంచి 11 మధ్య అయితే ఫిరంగుల మోతలు, వైమానిక దాడులతో ఆ ప్రాంతం అట్టుడికిపోయింది.
అయితే... ఇప్పుడు పూంచ్ లోని సూరాన్ కోట్ లో సాధారణ పరిస్థితులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇటీవల తీవ్ర కాల్పులు, కాల్పుల ఉల్లంఘనల భారాన్ని ఎదుర్కొన్న తర్వాత ఆ సరిహద్దు ప్రాంతం భయానకంగా తయారైంది. అయితే... ఆదివారం రాత్రి మాత్రం ఎలాంటి తుపాకుల మోతలు, బాంబుల శబ్ధాలు లేకుండా ప్రశాంతంగా గడిచింది.
వాస్తవానికి శనివారం సాయంత్రమే కాల్పుల విరమణ జరిగినప్పటికీ.. పలు ప్రాంతాల్లో పాక్ తన వక్ర బుద్ధిని చూపించింది. ఈ క్రమంలో సూరన్ కోట్ మొదలైన ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. దీంతో.. నివాసితులు పట్టణం నుంచి పారిపోయారు. కొంతమంది సమీప కొండ గ్రామాల్లో ఆశ్రయం పొందారు. అయితే.. అదివారం అంతా ఇళ్లకు తిరిగి చేరుకున్నారు.
ఏది ఏమైనా... కాల్పుల మోత మోగిన సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం కొనసాగుతోంది. కాల్పుల విరమణ జరిగిన శనివారం రాత్రి కూడా సైరన్ల మోతలు, పేలుళ్ల శబ్ధాలతో దద్దరిల్లిన జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లోనూ బ్లాక్ అవుట్ ఎత్తివేశారు. జమ్మూ నగరంలోనూ పరిస్థితి సాధారణ స్థితికి వచ్చినట్లు చెబుతున్నారు.
