బీజేపీని మోసిన అద్వానీ త్యాగ పురుషుడిగానే !
పార్టీని పటిష్టం చేయడంతో సిద్ధాంతాలను జనాల్లోకి బలంగా వినిపించడంతో ప్రత్యర్థుల మీద రాజీ లేని పోరు చేయడంతో అద్వానీ లోహ పురుషుడే.
By: Satya P | 7 April 2026 9:33 AM ISTబీజేపీ అంటే రెండే పేర్లు ఠక్కున అందరిలో మెదులుతాయి. ఒకటి అటల్ బిహారీ వాజ్ పేయి రెండవ వారు లాల్ కృష్ణ అద్వానీ. ఇక వాజ్ పేయి రాజకీయ నాయకుడు కంటే భావుకుడు కవి, మంచి వక్త. అందరి వాడిగా గుర్తింపు అందుకున్న వారు, బీజేపీలో ఉదారవాదిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన బీజేపీకి సారధ్యం వహించిన కాలంలో ఆ పార్టీ పెద్దగా విజయాలు సాధించలేదని గుర్తు చేస్తారు. వాజ్ పేయిని తక్కువ చేయడం కాదు ఆయనకు అపరిమితమైన జనాదరణ ఉంది. అది బీజేపీకి గ్లామర్ అయితే గ్రామర్ అద్ది పార్టీని పటిష్టం చేసి ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిన వారు అయితే కచ్చితంగా లాల్ కృష్ణ అద్వానీ అని చెప్పక తప్పదు.
జన సంఘ్ నుంచి :
అద్వానీ జన సంఘ్ కాలం ముంచే కాషాయం పార్టీతో వెన్నంటి ఉన్నారు అరవై డెబ్బై దశకంలో ఆయన వాజ్ పేయి తో కలసి జన సంఘ్ ఎదుగుదలకు విశేష కృషి చేశారు. ఇక 1980లో బీజేపీ ఆవిర్భవించడంతో వాజ్ పేయి తో పాటు అద్వానీ పాత్ర కీలకంగా ఉంది. 1986లో బీజేపీ అధ్యక్షుడుగా అద్వానీ అయ్యాకనే 2 ఎంపీ సీట్ల నుంచి బీజేపీ ఏకంగా 85 సీట్లకు ఎగబాకింది. ఆ తరువాత 120 సీట్లకు 160 సీట్లకు అలాగే 182 సీట్లకు పెరిగింది అంటే దాని వెనక ఉన్నది అద్వానీ వ్యూహాలు చతురత అని చెప్పాల్సి ఉంటుంది. నిజానికి బీజేపీ 1998లో అధికారంలోకి వచ్చినపుడు చాలా మంది అద్వానీని ప్రధాని కావాలని కోరారు ఆ సమయంలో బీజేపీలో అద్వానీ ప్రభ ఆ తీరున వెలిగింది అని చెప్పాలి. అయితే దానిని సున్నితంగా తిరస్కరించిన అద్వానీ తన మిత్రుడు గురువు అన్నీ అయిన వాజ్ పేయ్ కి పీఠం అప్పగించారు. ఇక 1999 నుంచి 2004 మధ్యలో అయిదేళ్ళ పాటు సాగిన పాలనలో సైతం చివరి రెండేళ్ళూ అద్వానీ ప్రధాని అయితే బాగుండు అన్న వారూ ఉన్నారు. కానీ ఆయన 2002లో ఉప ప్రధాని పదవిలో కుదురుకుని అది చాలు అనుకున్నారు.
గెలిస్తే ప్రధానిగా :
ఇక 2004లో కచ్చితంగా గెలుస్తామని బీజేపీ రంగంలోకి దిగింది. అది కూడా ఆరు నెలల అధికారం ఉంటూండగానే ముందస్తు ఎన్నికలు పెట్టి మరీ బరిలోకి దూకింది దేశం వెలిగిపోతోంది అన్న నినాదాలతో బీజేపీ దేశమంతా ప్రచారం చేసింది. అయితే ఆ ఎన్నికల్లో ఊహించని విధంగా బీజేపీ చతికిల పడాల్సి వచ్చింది. దాంతో వాజ్ పేయ్ రాజకీయాల నుంచి విరామం ప్రకటించగా లోక్ సభలో బీజేపీ తరఫున ప్రధాన ప్రతిపక్ష నాయక పాత్రను అద్వానీ పోషించారు. ఇక 2009లో కచ్చితంగా బీజేపీ గెలుస్తుంది అని అద్వానీ ప్రధాని అని అంతా అనుకున్నారు. కానీ అక్కడా సీన్ రివర్స్ అయింది. దాంతో అద్వానీకి ప్రధాని పదవి అందని పండుగా మారిపోయింది.
రాజకీయ వైచిత్రం :
ఇక 2014లో డ్యాం ష్యూర్ గా బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నయని రెండేళ్ల ముందే సంకేతాలు కనిపించాయి. కానీ ఆ సమయంలో అనూహ్యంగా మోడీ గుజరాత్ నుంచి జాతీయ రాజకీయాల్లోకి రావడం ఆయన ప్రధాని అభ్యర్ధిగా ముందుకు సాగడం అద్వానీ అనుచరులు శిష్యులు సహచరులు అనుకున్న వారే ఈ మార్పుని అంగీకరించి మోడీతో కలసి పయనించడంతో కురు వృద్ధుడు అద్వానీ కృంగిపోయారు అని అంటారు. అలా అద్వానీకి 2014 ఎన్నికల్లో ప్రధాని కావాల్సిన చివరి అవకాశం కూడా కాకుండా పోయింది అని అంటారు.
లోహ పురుషుడు అయినా :
పార్టీని పటిష్టం చేయడంతో సిద్ధాంతాలను జనాల్లోకి బలంగా వినిపించడంతో ప్రత్యర్థుల మీద రాజీ లేని పోరు చేయడంతో అద్వానీ లోహ పురుషుడే. కానీ అదే సమయంలో ఆయన సున్నిత మనస్కుడు అని అంటారు. ఎంతో మంది శిష్యులను పార్టీలో ఆయన తయారు చేశారు. కొత్త నాయకత్వాన్ని పెంచి పోషించారు. ఈ రోజున బీజేపీలో మోడీ సహా టాప్ లీడర్లు అంతా అద్వానీ ఆశీస్సులతోనే బీజేపీలో ఎదిగారు అని అంటారు. ఆ విధంగా బీజేపీకి నాయకత్వ కొరత తీరుస్తూ మంచి భవిష్యత్తుని ఇచ్చిన అద్వానీ మాత్రం ప్రధాని కాకుండానే తన రాజకీయ జీవితాన్ని ముగించడం అభిమానులకు ఎంతగానో బాధకరంగా ఉంటుంది. 98 ఏళ్ళ వయసులో ఉన్న అద్వానీ తాను పెంచి పోషించిన బీజేపీ ఈ రోజున 47వ ఏట అడుగు పెట్టి అప్రతిహత విజయాలు సాధిస్తూంటే సంతోషిస్తూండవచ్చు. కానీ బీజేపీ కోసం జీవిత కాలం పనిచేసిన ఆయన మాత్రం త్యాగ పురుషుడుగానే మిగిలిపోవడం కాషాయ విషాదంగానే చూడాల్సి ఉంటుంది.
