రావోయి విజయసాయి.. మాజీ ఎంపీ కోసం సిట్ ఎదురుచూపులు
లిక్కర్ స్కాంలో విచారణకు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కోసం సిట్ అధికారులు ఎదురుచూస్తున్నారు.
By: Tupaki Desk | 18 April 2025 11:07 AM ISTలిక్కర్ స్కాంలో విచారణకు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కోసం సిట్ అధికారులు ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఈ రోజు రమ్మంటూ మూడు రోజుల క్రితం విజయసాయికి సిట్ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ముందస్తు కార్యక్రమాల వల్ల 18వ తేదీ శుక్రవారం రాలేనంటూ విజయసాయి సిట్ కు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో 17న గురువారం వస్తానని చెప్పారు. అయితే ఆయన చెప్పిన మాటను ఆయనే తప్పారు. గురువారం సిట్ విచారణకు గైర్హాజరయ్యారు. ఈ రోజు వస్తానంటూ వర్తమానం పంపారు. నిన్న విజయసాయి కోసం మధ్యాహ్నం వరకు సిట్ చీఫ్, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ఎదురుచూశారు. ఇక ఈ రోజు వస్తానంటూ విజయసాయిరెడ్డి చెప్పడంతో పోలీసులు ఎదురుచూస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకే విజయసాయిరెడ్డి సిట్ విచారణకు రావాల్సివుంది. కానీ, ఆయన 11 గంటల వరకు రాలేదు. దీంతో విజయసాయిరెడ్డి వస్తారా? రారా? అన్న చర్చ జరుగుతోంది. మద్యం స్కాంలో కీలక సాక్షిగా విజయసాయిరెడ్డిని పరిగణిస్తున్నందున ఆయన హాజరుపై ఆసక్తి నెలకొంది. విజయసాయిరెడ్డి తన వాంగ్మూలంలో ఏం చెబుతారనే విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. స్కాంపై విజయసాయిరెడ్డి వాంగ్మూలమే ప్రధాన ఆధారంగా భావిస్తున్నారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. విజయసాయిరెడ్డిని ప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
ఇప్పటికే మద్యం స్కాంలో కర్త, కర్మ, క్రియ అంటూ విజయసాయిరెడ్డి ఆరోపించిన కసిరెడ్డి రాజ్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. గత నెలలోనే మద్యం గుట్టు రట్టు చేసిన వైసీపీ.. పోలీసులు విచారణకు పిలిస్తే తనకు తెలిసిన నిజాలన్నీ చెప్పేస్తానని అప్పట్లోనే హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే నాలుగుసార్లు విచారణకు రమ్మని రాజ్ కసిరెడ్డికి సిట్ నోటీసులు పంపింది. రేపటి వరకు నాలుగో నోటీసుకు గడువు ఉంది. దీంతో ఈ రోజు విజయసాయిరెడ్డి విచారణకు వస్తే ఆయన వాంగ్మూలం ఆధారంగా రాజ్ కసిరెడ్డితోపాటు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిస్థితుల్లో విజయాసాయిరెడ్డి విచారణపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.
