నెంబర్ 2 చెప్పిన వారే ఏ1 చేసిన ఏపీ పోలీసులు
లిక్కర్ స్కాంలో ఏ1 పేరును పోలీసులు ప్రకటించారు. ఇన్నాళ్లు ఏ1 ఎవరు అవుతారనే టెన్షన్ కు తెరదించారు.
By: Tupaki Desk | 22 April 2025 10:50 PM ISTలిక్కర్ స్కాంలో ఏ1 పేరును పోలీసులు ప్రకటించారు. ఇన్నాళ్లు ఏ1 ఎవరు అవుతారనే టెన్షన్ కు తెరదించారు. సాక్షులు, అనుమానితులు అంటూ చాలా మందిని విచారించిన పోలీసులు.. నిందితుల నెంబర్లను ఎట్టకేలకు విడుదల చేశారు. మొత్తం 29 మంది నిందితులుగా పేర్కొన్న పోలీసులు ఏ1గా వైసీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి సమీప బంధువు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని తేల్చేశారు. సోమవారం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసిన రాజ్ కసిరెడ్డిని లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా సిట్ అధికారులు ప్రకటించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కసిరెడ్డిని లిక్కర్ స్కాంలో పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డిని సుదీర్ఘంగా విచారించిన పోలీసులు.. సాయంత్రం వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి అతడికి రిమాండ్ విధించారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ కు రాజ్ కసిరెడ్డి సమీప బంధువుగా చెబుతున్నారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చిన రాజ్ కసిరెడ్డి.. గత ఎన్నికల వరకు ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారుగా పనిచేశారు. అయితే తన పదవీకాలంలో ఎక్కువగా లిక్కర్ వ్యవహారాలనే పర్యవేక్షించేవారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మద్యం విక్రయాలు, కొనుగోలు మొత్తాన్ని ఆయనే నిర్దేశించావారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం స్కాంపై ముందుగా సీఐడీ, ఆ తర్వాత సిట్ విచారణకు ఆదేశించింది. అనేక మందిని విచారించిన పోలీసులు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వాంగ్మూలంతో ప్రధాన నిందితుడిగా రాజ్ కసిరెడ్డి పేరును నమోదు చేశారు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అంతా రాజ్ కసిరెడ్డే అంటూ విజయసాయిరెడ్డి గతంలో ప్రకటించారు. అయితే రాజ్ కసిరెడ్డి పాత్రధారి మాత్రమేనని, అసలు సూత్రధారి వేరొకరు ఉన్నారని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా, అందుకు ఆధారాలు లభించలేదని చెబుతున్నారు. దీంతో బిగ్ బాస్ స్థానంలో రాజ్ కసిరెడ్డిని ఏ1గా పేర్కొన్నట్లు చెబుతున్నారు.
