Begin typing your search above and press return to search.

మెస్సీ హైదరాబాద్ ట్రిప్ కోసం అంత భారీ ప్లానింగ్

దిగ్గజ ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

By:  Tupaki Desk   |   6 Dec 2025 12:00 PM IST
మెస్సీ హైదరాబాద్ ట్రిప్ కోసం అంత భారీ ప్లానింగ్
X

దిగ్గజ ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ది గోట్ ఇండియా టూర్ లో భాగంగా దేశంలోని ప్రముఖ నగరాలకు వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కొచ్చికి వెళ్లాల్సిన మెస్సీ ట్రిప్ క్యాన్సిల్ కావటం.. దాని స్థానంలో హైదరాబాద్ చేరిన సంగతి పాతదే. ఈ నెల (డిసెంబరు) 13న మెస్సీ హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సెలబ్రిటీ మ్యాచ్ లో ఒక టీంకు ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా ప్రాతినిధ్యం వహించటమే కాదు.. ఈ మ్యాచ్ కోసం ఆయన ప్రత్యేకంగా రాత్రివేళల్లో సీరియస్ ప్రాక్టీస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మెస్సీ టూర్ గురించి ఫుట్ బాల్ అభిమానుల్లోనే కాదు.. సినీ.. రాజకీయ.. క్రీడా ప్రముఖులు సైతం అమితమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెస్సీ ట్రిప్ కు సంబంధించిన వివరాల్ని సేకరించినప్పుడు బోలెడన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఆయన షెడ్యూల్ చూస్తే.. ఒక దేశ ప్రధానమంత్రి కానీ ఒక దేశ అధ్యక్షుడు కానీ విదేశీ పర్యటనకు వస్తే.. ఎంత హడావుడి ఉంటుందో మెస్సీ విషయంలోనూ అలాంటిదే దర్శనమిస్తోంది.

మెస్సీ భారత పర్యటన వేళ.. ఆయన టీం ఏకంగా 200 మంది ఉండటం చూస్తే.. ఇంత జంబో టీం రావటమా? అని అనుకోకుండా ఉండలేం. డిసెంబరు 12 రాత్రి కోల్ కతాకు చేరుకునే మెస్సీ.. 13వ తేదీ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకుంటారు. అతడితో పాటు 200 మందితో కూడిన భారీ టీం హైదరాబాద్ కు రానుంది. వారందరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించనుంది.

మెస్సీ షెడ్యూల్ ను బయటకు రాకుండా ప్రభుత్వం భారీ గోప్యతను పాటిస్తోంది. 13 సాయంత్రం ఐదున్నర గంటల నుంచి 6.15 గంటల వరకు మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మాయను హైదరాబాదీయులు ప్రత్యక్షంగా చూసే వీలుంటుంది. తొలుత నిర్వహించే సెలబ్రిటీలతో ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఒక జట్టుకు సీఎం రేవంత్.. మరో జట్టుకు మెస్సీ సారథ్యం వహిస్తారు. ఆ తర్వాత యువ ప్రతిభావంతులతో మెస్సీ మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత పెనాల్టీ షూటౌట్ నిర్వహిస్తారు.

మెస్సీ ప్రోగ్రాం చివర్లో మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహిస్తారు. ఆ రాత్రి మెస్సీ హైదరాబాద్ లోనే బస చేస్తారు. పద్నాలుగు ఉదయం ప్రత్యేక విమానంలో ముంబయికి బయలుదేరి వెళతారు. మెస్సీ టూర్ కు సంబంధించిన షెడ్యూల్ ఒకటి ఇండిగో విమానయాన సంస్థ నిర్వాహణ లోపాల ప్రభావం బారిన పడింది. షెడ్యూల్ ప్రకారం మెస్సీ టీం శుక్రవారం హైదరాబాద్ కు రావాల్సి ఉంది. ఆయన టూర్ కు సంబంధించిన అంశాల్ని పరిశీలించేందుకు హైదరాబాద్ కు రావాల్సి ఉండగా.. ఇండిగో విమానాల రద్దు కారణంగా వారి ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యింది. ఈ రోజు (శనివారం) వారు హైదరాబాద్ కు వస్తారని భావిస్తున్నారు. అంతకంతకూ పెరుగుతున్న మెస్సీ మానియా.. పదమూడో తేదీకి మరింత భారీగా పెరగటం ఖాయమని చెప్పాలి.