Begin typing your search above and press return to search.

పెద్దల సభకు లింగమనేని.. జనసేన అభ్యర్థిగా నామినేషన్

శుక్రవారమే ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగా, శనివారం ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా బి.ఫాం అందుకున్నారు. అనంతరం కూటమి ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభ సచివాలయంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి వనితా రాణికి సమర్పించారు.

By:  Tupaki Political Desk   |   6 Jun 2026 4:47 PM IST
పెద్దల సభకు లింగమనేని.. జనసేన అభ్యర్థిగా నామినేషన్
X

జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. జనసేన 12 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో తొలిసారిగా రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయగా, కూటమికి ఉన్న బలంతో లింగమనేని రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. శుక్రవారమే ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగా, శనివారం ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా బి.ఫాం అందుకున్నారు. అనంతరం కూటమి ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభ సచివాలయంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి వనితా రాణికి సమర్పించారు.

శనివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లింగమనేని రమేష్ బి-ఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా రమేష్‌కు పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అద్భుతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఇక అనంతరం అక్కడ నుంచి బయలుదేరి శాసనసభ కార్యాలయానికి చేరుకున్న లింగమనేని మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ఎన్. ఈశ్వరరావుతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.

లింగమనేని అభ్యర్థిత్వాన్ని జనసేన ఎమ్మెల్యేలు నాదెండ్ల మనోహర్, పులపర్తి రామాంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, వంశీకృష్ణ శ్రీనివాస్, దేవ వరప్రసాద్ తోపాటు టీడీపీ ఎమ్మెల్యే మంత్రి కొల్లు రవీంద్ర, కాగిత కృష్ణ ప్రసాద్, నక్కా ఆనంద బాబు, ఎన్. ఈశ్వర రావు ప్రతిపాదించారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎంపీలు వి. బాలశౌరి, టి. ఉదయ్ శ్రీనివాస్, శాసనమండలి విప్ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, గిడ్డి సత్యనారాయణ తదితరులు లింగమనేని రమేష్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు

లింగమనేని రమేష్ కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు.. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అటు జనసేనాని పవన్ కళ్యాణ్ కి అత్యంత నమ్మకస్తుడు, సన్నిహితుడిగా చెబుతున్నారు. దీంతో ఆయన ఎంపికపై ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని అంటున్నారు. కూటమి బంధం మరింత బలోపేతం కావడానికి, రెండు పార్టీల మధ్య సమన్వయకర్తగా వ్యవహరించడానికి ఆయన ఉపయోగపడతారని ఇద్దరు అగ్రనేతలు భావించారని అంటున్నారు.

స్వశక్తితో ఎదిగిన పారిశ్రామికవేత్త:

ఒక సాధారణ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన లింగమనేని రమేష్, తన స్వశక్తితో, పట్టుదలతో దేశంలోనే గుర్తింపు పొందిన పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా.. వ్యాపార రంగంలో ఆయన సాధించిన విజయాలు, విలువలతో కూడిన ప్రయాణమే ఈరోజు ఆయనను చట్టసభకు నడిపించాయని చెబుతున్నారు. ఇక ఆయన రాజ్యసభకు ఎంపిక కావడం లాంఛనమే కావడంతో స్వగ్రామం మొవ్వ మండలం పెద్దముత్తెవిలో బంధువులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. గ్రామస్థాయి నుంచి రాజ్యసభకు ఎదగడంపై వారంతా ఆనందం వ్యక్తం చేశారు.

12 ఏళ్ల నిరీక్షణ తర్వాత దక్కిన గౌరవం

2014లో స్థాపించిన తర్వాత జనసేన పార్టీ నుంచి తొలిసారిగా ఆ పార్టీ నేత రాజ్యసభలో అడుగుపెడుతున్నారు. గత ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన తర్వాత జనసేన అసెంబ్లీ, పార్లమెంటులో ఒకేసారి అడుగుపెట్టింది. తర్వాత శాసనమండలికి తన అభ్యర్థులను పంపించుకోగలిగింది. ఎట్టకేలకు రెండేళ్ల నిరీక్షణ తర్వాత ఇప్పుడు తొలిసారిగా రాజ్యసభ స్థానాన్ని కైవసం చేసుకోబోతోందని అంటున్నారు. ఈ పరిణామం జనసేన కార్యకర్తల్లో, నాయకుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని అంటున్నారు.