Begin typing your search above and press return to search.

అక్కడ ఎంపీలకు పెన్షన్లు రద్దు...భారత్ లోనూ చర్చ !

రాజకీయం అంటే సేవా భావం. ప్రజా సేవకు ఈ రంగాన్ని ఎంచుకుంటారు. గతంలో అంతా అలాగే వచ్చేవారు

By:  Satya P   |   19 Feb 2026 8:00 AM IST
అక్కడ ఎంపీలకు పెన్షన్లు రద్దు...భారత్ లోనూ చర్చ !
X

రాజకీయం అంటే సేవా భావం. ప్రజా సేవకు ఈ రంగాన్ని ఎంచుకుంటారు. గతంలో అంతా అలాగే వచ్చేవారు. అలా వచ్చిన వారు ఎవరూ ఆగర్భ శ్రీమంతులు కారు, అయినా అవినీతికి పాల్పడలేదు. అదే సమయంలో వారు ఏ రకమైన జీత భత్యాలను పెద్దగా ప్రభుత్వం నుంచి కోరుకోలేదు. కానీ రాను రానూ ప్రజా ప్రతినిధులకు జీత భత్యాలు పెరిగాయి. వారికి ఇతర సదుపాయాలను కూడా పెంచుతున్నారు. దాంతో రాజకీయాల్లో ఉన్న వారి పని బాగుంది, తమకేంటి అని జనాలు అనుకునే స్థితి ఏర్పడింది. ఇది రాజకీయ నేతల మీద వ్యతిరేకతను పెంచుతోంది.

ఒక్కసారి చేస్తే చాలు :

ఎవరైనా ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా ఒక్కసారి చేస్తే చాలు వారికి జీవిత కాలం పెన్షన్ లభిస్తుంది. అది కూడా కాలానుగుణంగా పెరుగుతూ వస్తుంది. అదే మూడున్నర దశాబ్దాలు పనిచేసినా పెన్షన్ సక్రమంగా రాని వారు ఉన్నారు. ప్రైవేట్ బతుకుల వారు అయితే ఇక ఇంతే సంగతులు. మన దేశంలో ఒకసారి ఎంపీ అయితే జీతంతో ఎంత అంటే అక్షరాలా లక్షా ఇరవై నాలుగు వేల రూపాయలు. ఇక జీతంతో పాటుగా భత్యాలు ప్రతీ రోజూ చెల్లిస్తారు. అలాగే ఉచితంగా ప్రయాణాలు, సబ్సిడీ మీద నివాసం, వీటితో పాటు నియోజకవర్గ నిధులు ఇస్తున్నారు. పదవీ విరమణ చేస్తే ఆ ఎంపీకి 31 వేల రూపాయలు పెన్షన్ అందుతోంది. అలాగే అయిదేళ్ళకు మించి ఆ పదవిలో ఉంటే ప్రతీ ఏడాది అదనంగా 2,500 వంతున అలా పెరుగుతూ ఉంటుంది. ఇక ఎమ్మెల్యే ఎంపీ ఇలా వేరు వెరుగా చేస్తే వేరు వేరు పెన్షన్లు కూడా ఇస్తున్నారని అంటున్నారు. వీటికి అధిక మొత్తం ఖర్చు అవుతోంది అన్నది జనంలో ఉన్న భావన.

శ్రీలంకలో రద్దు :

అయితే దక్షిణాసియా దేశాలలో మొదట అతి కీలకమైన నిర్ణయాన్ని శ్రీలంక తీసుకుంది. కొన్నాళ్ళ క్రితం శ్రీలంక ఆర్ధికంగా ఎంత ఇబ్బంది పడిందో అందరికీ తెలుసు. ఆర్ధికంగా పెను సంక్షోభంలోకి నెట్టబడింది. ఆ నేపధ్యంలో రాజకీయ నేతలకు అందిన సదుపాయాల మీద సాధారణ జనం మండిపోయారు. దీంతో వారంతా ఈ డిమాండ్ ని తెచ్చారు. ప్రజా ప్రతినిధులకు భత్యాలు జీతాలు ఎందుకు అని కూడా ప్రశ్నించారు. అయితే ఈ క్రమంలో శ్రీలంక అధ్యక్ష పదవికి రాజీజామా చేసిన రాజపక్స తరువాత కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే దీని మీద పూర్తి దృష్టి పెట్టారు. ఇక ఆయన నాయకత్వంలో వామపక్ష ప్రభుత్వం తాము అధికారం చేపట్టాక ఎంపీల పెన్షన్లు రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. దాని ప్రకారం ఇపుడు అక్కడ పెన్షన్లు రద్దు చేసి విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు.

బిల్లు ఆమోదం :

ఇక శ్రీలంక పార్లమెంట్ లో మంచి మెజారిటీతో ఎంపీల పెన్షన్ రద్దు బిల్లుని ఆమోదించారు. మొత్తం 225 మంది సభ్యులు ఉన్న పార్లమెంట్ లో 154 ఓట్ల మెజారిటీ ఈ బిల్లు ఆమోదం పొందింది. ఇది తొందరలోనే చట్టంగా మారనునిద్. దాంతో ఎంపీలకు అక్కడ పెన్షన్లు కట్ అవుతాయన్న మాట. మరి భారత్ లో పరిస్థితి ఏంటి అన్న చర్చ కూడా వస్తోందిపుడు.

ప్రజా సేవకులకు ఎందుకు :

రాజకీయాల్లోకి వచ్చిన వారు ప్రజా సేవకే కదా అన్న మాట ఉంది. మళ్ళీ వారికి జీవిత కాలం పెన్షన్, వారి తరువాత జీవిత భాగస్వామికి పెన్షన్ ఇవ్వడం వల్ల ఆర్ధికంగా ఖజానా భారం అంటున్న వారూ ఉన్నారు ప్రతీ అయిదేళ్ళకు కొత్త ప్రజా ప్రతినిధులు వస్తారు. అలా చూసుకుంటే ఏ ఏటికి ఆ ఏడు భారం పెరిగిపోతోంది అన్న చర్చ కూడా ఉంది. అయితే అందరూ ధనవంతులు కాదు కదా కొందరు నిస్వార్ధంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేసి ఏమీ మిగుల్చుకోవడం లేదు అన్న చర్చ ఉంది. అయిత అత్యధిక శాతం మంది మాత్రం చూస్తే బాగానే ఉంటున్నారు కాబట్టి ఈ పెన్షన్లు రద్దు చేయడమే మార్గం అన్నది పెద్ద చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో. కేవలం భారత్ లోనే కాదు, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి చోట్ల సైతం ఆర్ధిక భారాలు పెరిగిపోతున్నాయి. మరి వారు తగ్గించుకునేందుకు శ్రీలంక రూట్లో వెళ్తారా అన్నది కూడా ఉంది.